ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలి
పరిగి: ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరిని విడనాడాలని, ఉద్యోగుల జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని టీఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సిద్దిఖి, పరిగి డిపో అధ్యక్షుడు సత్తయ్య, గ్యారేజ్ కార్యదర్శి ఖుద్బుద్దీన్ అన్నారు. టీఎన్‌ఎంయూ పిలుపు మేరకు గురువారం కార్మికులు పరిగి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిపై మండిపడ్డారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామంటూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
జీతభత్యాల సవరణ పూర్తి చేయకుండా కేవలం ఐఆర్‌తో సరిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. జనవరి నుంచి డీఏ ఎరియర్స్ చెల్లించని కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా గుర్తింపు సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తూ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని వారు విమర్శించారు. కాలం చెల్లిన బస్సులతో గ్యారేజి ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్‌ఎంయూ సంఘం నాయకులు వెంకటయ్య, షరీఫ్, రమేష్, ఖదీర్, షర్భలింగం, రాంచందర్ పాల్గొన్నారు.