సాక్షి, హైదరాబాద్: జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమ నిధులను సొంతానికి వినియోగించుకుంది. దాదాపు రూ.60 కోట్లు మింగేసింది. దీంతో రుణాలు లేక ఆర్టీసీ కార్మికులు అల్లాడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్య అవసరాలు, ఇంటి నిర్మాణం... ఇలా అతిముఖ్యమైన అవసరాలకు రుణాలు మంజూరు చేయాలంటూ పెట్టుకున్న నాలుగువేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదాయాన్ని మించి ఖర్చు వచ్చిపడటం, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం తనవంతుగా చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవ టంతో ఆర్టీసీ యాజమాన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.
దీంతో కనిపించిన నిధులనల్లా వాడేసుకుంటోంది. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబ అవసరాలకు రుణాలు అందించే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను యాజమాన్యం సొంతానికి వినియోగించుకుంది.
ఇదీ సంగతి: ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా కార్మికుల మూలవేతనంపై 5 శాతం మొత్తాన్ని మినహాయించుకుని దాన్ని సీసీఎస్‌కు జమ చేస్తుంది. సీసీఎస్‌ను గుర్తింపు కార్మిక సంఘం నిర్వహిస్తుంది. ఇలా టీఎస్‌ఆర్టీసీ పరిధిలో ప్రతినెలా దాదాపు రూ.25 కోట్ల మొత్తం జమ అవుతోంది. వాటిని కార్మికుల కుటుంబ అవసరాలకు రుణంగా అందజేస్తారు. సీసీఎస్‌కు చెందిన రూ.60 కోట్ల మొత్తాన్ని వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు రుణాలు లేకుండా చేసింది. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా 43 శాతం ఫిట్‌మెంట్ కావాలని కార్మికులు సమ్మె చేయగా విచిత్రంగా ప్రభుత్వం 44 శాతం ప్రకటించింది. ఆర్టీసీపై తీవ్ర భారం పడుతుందని యాజమాన్యం పేర్కొనటంతో ఆదుకుంటానని హామీ ఇచ్చింది.
కానీ ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి వస్తేకాని కార్మికులకు రుణాలందే పరిస్థితి లేదు. భవిష్యత్తులో సీసీఎస్ నిధులను సొంత అవసరాలకు వినియోగించుకోనంటూ ఇటీవల సమ్మె సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు హామీ కూడా ఇచ్చింది. గతంలో ఈ నిధులను స్వాహా చేయటంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సీసీఎస్ నిధులను వాడుకోవద్దంటూ సమ్మెకాలంలో కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చి మళ్లీ విస్మరించి ఆ నిధులను కొల్లగొట్టడంపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక నిధిని కొల్లగొట్టిన ఆర్టీసీ
Published Fri, Jul 31 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement