ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్‌పై నీలినీడలు! | RTC management planning to cut thier employees PF share of RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్‌పై నీలినీడలు!

Published Mon, Feb 15 2016 2:41 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్‌పై నీలినీడలు! - Sakshi

ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్‌పై నీలినీడలు!

- వేతనం రూ.15 వేలు మించితే యాజమాన్యం తన వాటా చెల్లించదు
 
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భవిష్య నిధి చెల్లింపు అంశంలో యాజమాన్యం నిర్ణయం కార్మికుల సంక్షేమం పాలిట గొడ్డలిపెట్టుగా మారనుంది. ఉద్యోగి మూల వేతనం(బేసిక్ పే), కరువు భత్యం(డీఏ) కలిపి రూ.15 వేలు దాటితే తన వాటా భవిష్య నిధి(పీఎఫ్)ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.32 లక్షల మంది ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరగనుంది. యాజమాన్యంపై భారాన్ని తగ్గించుకునేందుకు కార్మికుల పీఎఫ్‌లో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
 పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు
 ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము రూ.250 కోట్లను యాజమాన్యం సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో పీఎఫ్ సొమ్ము నుంచి రుణం కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు వేలాదిగా పెండింగ్‌లో ఉన్నాయి.  
 
ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్లు ఆదా!
ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి రూ.15 వేల పరిమితి దాటితే తన వంతు వాటా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు పీఎఫ్ కమిషనర్‌కు ఆర్టీసీ యాజమాన్యం త్వరలో లేఖ రాయనుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే కార్మిక సంఘాలకు నోటీసులివ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. తన వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
 
 ‘‘పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సాంబశివరావుకు వినతి పత్రం ఇచ్చాం. ఒకవేళ మొండిగా ముందుకెళితే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు’’
 - జిలానీ బాషా, ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు
 
 ‘‘ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. దొడ్డిదారిన నిర్ణయాలను అమలు చేస్తోంది. పీఎఫ్ బాధ్యత నుంచి తప్పుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’
 - రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement