మెదక్‌టౌన్: రాష్ట్రంలోని పల్లెపల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ బస్ డిపోలోని నూతన బస్సులకు ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీను లాభాల్లోకి తీసుకవెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 500 హైర్, 500 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బంది సేవా ధృక్పథంతో పని చేయాలన్నారు.
మెదక్ బస్ డిపోకు 10 బస్సులు అవసరం ఉండగా ఇప్పటికి ఐదు బస్సులు వచ్చాయని, మరో ఐదు బస్సులు త్వరలో వస్తాయన్నారు. మెదక్ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో పార్కింగ్ స్థలానికి నిధులు కేటాయించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పద్మాదేవేందర్ దృష్టికి తీసుకవెళ్లగా, పార్కింగ్ స్థలానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఆర్టీఓ నగేష్, తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జునగౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఎంయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, షకయ్య, పృధ్వీరాజ్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుభాష్‌చంద్రబోస్, మల్లేశం, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
పల్లెపల్లెకు బస్సు సౌకర్యం
Published Sun, Nov 16 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement