మెట్టుగూడ ఆర్టీసీ భవనాన్ని సందర్శించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ భవనం ఇకపై తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంగా మారనుంది. మెట్టుగూడ నుంచి తార్నాకకు వెళ్లే దారిలో ఈ భవనం ఉంది. ఆర్టీసీ ఎండీ కోసం నిర్మించిన ఈ భవనం ఆర్టీసీ చైర్మన్ల నివాస భవనంగా కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కుంటుంబం కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనంలోనే నివసించారు. నాలుగేళ్ల క్రితం సీఎం హోదాలో సికింద్రాబాద్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇదే భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పట్లోనే ఎక్సైజ్ మంత్రి హోదాలో పద్మారావు ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని ఆలోచించారు.
ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స్‌కు కొంతకాలం మకాం మార్చారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావుగౌడ్ ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లడం కంటే తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలనుకున్న ఆయన నిర్ణయానికి సీఎం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తన అనుచరులతో కలిసి ఆర్టీసీ భవనాన్ని సందర్శించారు. నీల ప్రభాకర్, ఓడియన్ శ్రీనివాస్, సుంకు రాంచందర్, అశోక్‌గౌడ్, శైలేందర్, మంత్రి తనయుడు రామేశ్వర్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత చందు గంగపుత్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment