ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో శనివారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు.
‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్ కారులో తిరిగా... కానీ ఇప్పుడు పార్చునర్ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్ కారుకో పోతదో, స్కూటర్‌కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment