ఓ ఆటో డ్రైవర్...రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేయవచ్చా.. చేసినా ఆ బడుగుజీవుల ఆక్రందన అమాత్యులు వింటారా...? ఇన్నాళ్లూ అందరికీ ఇదే సందేహముండేది. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లోని మంత్రులంతా సామాన్యుల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలోని కొందరు ఆటో డ్రైవర్లు బుధవారం రవాణాశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయడం...వెంటనే స్పందించిన మంత్రి ఆరా తీయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా...ఇది జనసామాన్యుల ప్రభుత్వమని జనం ఆనందపడుతున్నారు. – అనంతపురం టవర్‌క్లాక్
సాక్షి, అనంతపురం: అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖల్లో ప్రక్షాళనకు మంత్రులు సిద్ధమయ్యారు. అంతేకాకుండా సామాన్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తూ అవినీతిపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోతోందని రవాణాశాఖలో అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని బుధవారం జిల్లాకు చెందిన కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న మంత్రి పేర్నినాని...అవినీతికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన అనంతపురం ఆర్టీఏ అధికారులకు ఫోన్‌చేసి ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో పాలన అదుపుతప్పినట్లు తెలిసి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి...అవినీతికి పాల్పడుతున్న అధికారులపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రవాణాశాఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకూడదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇంకోసారి ఎవరైనా అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తే...విచారించి అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు లైసెన్సుల కోసం కార్యాలయానికి వస్తే... అధికారులు ఎవరూ స్పందించడం లేదని, బ్రోకర్లను కలిసి లైసెన్సులు పొందేలా సూచనలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి విధానం మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. సేవలన్నీ పారదర్శకంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ ఉన్నతాధికారికి ఫోన్‌లో ఆదేశించిట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment