వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో పేద వైశ్యుల అభివృద్ధి కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక బంగారు వారి వాసవీ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన తటవర్తి కృష్ణమూర్తి, సరస్వతి ఏసీ ఫంక్షన్ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు స్వగ్రామం జువ్వల దిన్నెను అభివృద్ధి చేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పాలకొల్లు పట్టణంలో సత్రాల ద్వారా పేద విద్యార్థులకు భోజన సదుపాయం, కళాశాలల ద్వారా విద్యాభివృద్ధికి వైశ్యులు తోడ్పడుతున్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ వైశ్యుల సేవలను కొనియాడారు. నిడమర్రు మండలం భువనపల్లి గ్రామంలో ఇటీవల ఆగ్నికి ఆహుతైన ఫ్యాన్సీషాపు యజమానికి వైశ్య సంఘం తరఫున ఆర్థిక సాయం అందజేశారు. శ్రీదేవీ ఆర్యవైశ్య మహిళా సేవా మండలి, కొత్త వెంకటేశ్వర్లు, కనకరత్నమాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలుగురు మహిళలకు కుట్టుమెషీన్లు, క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి టూ వీలర్ కుర్చీని అందజేశారు. తటవర్తి కృష్ణమూర్తి సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామమూర్తి, వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.