ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమత్రి కేసీఆర్ సమక్షంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అభివాదం చేస్తూ పరిచయం చేసుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, చిత్రంలో మంత్రులు కేటీఆర్, ఈటల తదితరులు
సాక్షి, ఖమ్మం: ఉద్యమాల గుమ్మం ఖమ్మంకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం శాసనసభ్యుడిగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి పదవి వరించింది. ఆదివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పువ్వాడ అజయ్ పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు రవాణా శాఖను కేటాయించారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన అజయ్ రెండుసార్లు ఖమ్మం నిజయోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాక 2018లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా రాష్ట్ర పార్టీ దృష్టిని ఆకర్షించారు.
కేసీఆర్ తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు తొలి మంత్రివర్గ విస్తరణలోనే అవకాశం లభిస్తుందని భావించారు. అయితే సామాజిక సమీకరణలు, ఇతర కారణాల వల్ల కేసీఆర్ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా పువ్వాడ అజయ్‌కు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని పార్టీ వర్గాలు గత కొంతకాలంగా పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. అయితే జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వివిధ సమీకరణల తర్వాత పార్టీ గుర్తుపై గెలిచినందుకు ప్రోత్సాహకంగా అజయ్‌ను కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టిన పువ్వాడ అజయ్‌కుమార్ మరో అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకున్నారు.
అ‘జై..’: ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలి మంత్రిగా ఖ్యాతి
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల్లో గెలుపొంది ఆయా ప్రభుత్వాలు అనేక మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏ ఒక్కరూ ఇప్పటి వరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా అయ్యే అరుదైన అవకాశం అజయ్ సొంతం చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మంత్రులుగా పని చేసిన జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, కోనేరు నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మంత్రులుగా పని చేసినప్పటికీ వారు జిల్లాలోని సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడం విశేషం.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించినా ఆయన ఆ సమయంలో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి లభించినట్లయింది. గత కొంత కాలంగా మంత్రి పదవి అజయ్‌ను వరిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనకు మంత్రి పదవి లభించడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన పువ్వాడ అజయ్ 2014, 2018 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. సీపీఐ సీనియర్ నేతగా ఉన్న ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సైతం ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లాకు ఇప్పటివరకు మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధి పరంగా కొంత వెనుకబడినట్లు అయింది. పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించడంతో జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సమస్యల పరిష్కారానికి కృషి
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా నుంచి నూతనంగా మంత్రిగా నియమితులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు
వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ప్రాంతప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని, జిల్లా అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి అందరి సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి సైతం తన వంతు కృషి చేస్తానని అజయ్ తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి రవాణా శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజా రవాణా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించి శాఖ పరంగా చేయవలసిన పనులపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. తనకు లభించిన పదవి జిల్లాలోని ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్తకు లభించినట్లు అని, అందరి ఆశీస్సులతో ఈ పదవి లభించిందని భావిస్తున్నాని, ప్రతి కార్యకర్తకు మరింత అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.
ప్రొఫైల్..
- పేరు: పువ్వాడ అజయ్‌కుమార్
- చదువు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్
- కుటుంబం: భార్య వసంతలక్ష్మి, కొడుకు నయన్‌రాజ్
- రాజకీయ ప్రస్థానం: పువ్వాడ అజయ్‌కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ సీనియర్ నేత. పువ్వాడ అజయ్‌కుమార్ 2012 నుంచి 2013 ఏప్రిల్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అనంతరం 2013లో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఖమ్మం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment