సాక్షి అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: తండ్రి, తనయుడి కేబినెట్‌లలో ఆ నలుగురు..
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా..
బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు.
మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం..
1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌పీసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్‌లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్‌లోకి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment