వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం | vikarabad will do as the district center | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం

Published Thu, Jun 5 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం - Sakshi

వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
 
తాండూరు, న్యూస్‌లైన్: వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం పట్టణంలోని నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమానికి ఆయన తొలిసారి తాండూరుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న వికారాబాద్‌ను కచ్చితంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైతే అది తాండూరులో ఏర్పాటయ్యేలా చూస్తానని, చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు సైతం కృషి చేస్తానని  ఆయన హామీ ఇచ్చారు.
 
పశ్చిమ రంగారెడ్డిని విద్యాపరంగా అభివృద్ధి చేస్తానని, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడతానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తారని పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్నారు. తాండూరు, యాలాల పీఏసీఎస్ చైర్మన్‌లు నారాయణగౌడ్, సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రుణాల మాఫీ చేయించేందుకు కృషి చేయాలని కోరారు.
 
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, రవిగౌడ్, రవూఫ్, నరేందర్‌గౌడ్, వెంకటయ్య, అయూబ్‌ఖాన్, బాల్‌రెడ్డి, పి.నర్సింహులు, అజయ్‌ప్రసాద్, గాజీపూర్ నారాయణరెడ్డి, భరత్‌భూషన్, మున్సిపల్ కౌన్సిలర్లు  విజయలక్ష్మి, నీరజ, శోభారాణి, పరిమళ, రజాక్, ఖవి, విజయాదేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.  
 
మంత్రికి ఘన స్వాగతం
తాండూరు టౌన్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్‌రె డ్డికి టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు  పట్టణ మున్సిపల్ కమిషనర్ గోపయ్య తన సిబ్బందితో కలిసి కార్యాలయం వద్ద బతుకమ్మలతో స్వాగతం పలికారు.
 
ఈ సందర్భంగా మంత్రి ఓపెన్‌టాప్ జీపులో పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం స్థానిక క్లాసిక్ గార్డెన్స్‌లో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, కులసంఘాల నాయకులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
 
భూకైలాస్ సందర్శన
తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం తండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. తాండూరులో నిర్వహించిన సన్మాన సభ అనంతరం ఆయన భూకైలాస్‌ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు వాసు నాయక్ పవార్ మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్, మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, వడ్డె శ్రీను, శేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement