ఆర్టీచీ..! | Irregularities in ongole rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీచీ..!

Published Thu, Nov 3 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఆర్టీచీ..!

ఆర్టీచీ..!

ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో అన్నీ అక్రమాలే
వినతులకు చెల్లుచీటీ సిఫార్సులకే పెద్దపీఠ
వెల్లువెత్తుతున్న విమర్శలు స్పందించని అధికారులు

‘రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నాం.. నష్టాలు తగ్గించి లాభాల బాటలోకి తీసుకొస్తున్నాం.. అధికారులు, సిబ్బంది, కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఆర్టీసీని ఆదరించాలి’...  ఇవీ.. రవాణా శాఖామంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు నిత్యం వల్లెవేసే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారుు. సంస్థలో అంతర్గతంగా అన్నీ అక్రమాలు జరుగుతున్నారుు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పైరవీల కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం జరుగుతోంది. ప్రతిభ గల వారికి బదులుగా అసమర్థులకే ఆర్టీసీలో పెద్దపీఠ పడుతోంది. ఫలితంగా సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. రాష్ట్ర రవాణా శాఖామంత్రి జిల్లాలోనే ఇలా జరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.

ఒంగోలు : ‘వినతులకు చెల్లుచీటి.. సిఫార్సులకే పెద్దపీఠ’ అన్న చందంగా మారింది ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో పరిస్థితి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పడరాని పాట్లు పడుతున్నామంటూ ఆ సంస్థ ఉన్నతాధికారులు మొదలు ప్రజాప్రతినిధుల వరకూ ప్రతిఒక్కరూ ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా ఆచరిస్తున్న దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే.. ఆదాయ మార్గాలను సైతం పెడచెవిన పెట్టి సిఫార్సులకు వారంతా పెద్దపీఠ వేస్తున్నారు. ఈ క్రమంలో ఏవైనా అక్రమాలు జరిగితే కనీసం వాటిపై కచ్చితమైన విచారణ చేసేవారు కూడా లేకపోతుండడం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో జరిగిన పలు ఘటనలే అందుకు నిదర్శనంగా ఉన్నారుు...

ఆర్టీసీలో నైపుణ్యం గల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం నెలకు రూ.17 వేలు మాత్రమే. కానీ, కేవలం కార్గోలో పనిచేసేందుకు ఒక టీడీపీ నేత కుమారుడిని రూ.20 వేలు వేతనంతో తీసుకోవాలని సాక్షాత్తూ ఆర్టీసీ ఎండీ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అతని నియూమకం కూడా జరిగింది. అరుుతే, అనంతరం అధికారుల తనిఖీల్లో ఒకేరోజు రూ.2 వేల వరకు అతని వద్ద లెక్కల్లో తేడాలు బయటపడ్డారుు. దీంతో అతనిని విధుల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్గోలో ఒక రికార్డే మాయమైందంటే ఆర్టీసీలో అక్రమాలు ఏ స్థారుులో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఆర్టీసీలో కార్గో సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం ఒక మేనేజర్, ఇద్దరు అధికారులు, మరికొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. కాగా, తమకు అవకాశమిస్తే ఆర్టీసీకి లక్ష రూపాయలు అడ్వాన్స్ చెల్లించి తామే విధులు నిర్వహించుకుంటామని, ఏరోజుకారోజు అధికారులకు లెక్కలు చూపిస్తామని సుబ్బారావు అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. రోజుకు 3 షిఫ్టుల చొప్పున 24 గంటలపాటు సేవలకు అందుబాటులో సిబ్బందిని కూడా ఉంచుతామన్నారు. అందుకు విరుద్ధంగా కేవలం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉండేలా రూ.20 వేలు అడ్వాన్స్ చెల్లించిన వ్యక్తికి ఆ అవకాశం కల్పించారు ఆర్టీసీ అధికారులు. దీనివెనుక కూడా అక్రమాలు జరిగాయన్నది బహిరంగ రహస్యం.

ఆర్టీసీలో వాటర్ ట్యాంకర్‌కు ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన ఒక డ్రైవర్‌ను నియమించారు. అతని జీతం సుమారు రూ.50 వేలు ఉంటుంది. ఇది కాకుండా ఇతరత్రా ఖర్చులు కలుపుకుని ఆర్టీసీ రూ.85 వేల వరకు ఆర్టీసీ ఖర్చుచేస్తోంది. ఇదిలా ఉండగా, ట్యాంకర్‌కు రూ.340 చొప్పున ఇస్తే తామే నీరు సరఫరా చేస్తామంటూ కొంతమంది ముందుకొచ్చారు. దీని ప్రకారం ఆర్టీసీ చెల్లించే మొత్తం సుమారుగా నెలకు రూ.40 వేలు. దీన్ని అమలుచేస్తే నెలకు రూ.45 వేల వరకూ ఆర్టీసీకి మిగిలే అవకాశం ఉంది. దీనిపై ఆరు నెలలుగా చర్చిస్తున్న అధికారులు నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు.

చివరకు సాక్షాత్తూ ప్రస్తుత రవాణాశాఖామంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒంగోలు సిటీ సర్వీసులను సైతం ఆర్టీసీ అధికారులు తొలగించారు. వాటిపై మంత్రి సైతం మాట్లాడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికోసం బస్టాండ్లు, తదితరాల కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యూరుు. ఇక పబ్లిక్ టాయిలెట్ల వద్ద టోకెన్లు ఇవ్వాలని అధికారులు హెచ్చరించినా..నేటికీ అమలుకాకపోవడంపై కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు ఆధునిక మెషిన్లను ఇటీవల ప్రారంభించారు. వాటిలో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో చూసుకునే సౌలభ్యాన్ని ప్రయాణికులకు కలిగిస్తున్నట్లు ఆర్భాటంగా అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే అవి ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పనిచేయవో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement