సాక్షి, తిరువనంతపురం : భూకబ్జాల వివాదాలతో గత కొన్ని నెలలుగా ఆ మంత్రివర్యులు వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పైగా అందమైన సరస్సును పూడ్చి మరీ విలాసానికి రిసార్ట్ కట్టుకున్నారు. అధికారంలో ఉన్నాం కదా ఏం ఫర్వాలేదన్న ధీమా. కానీ, నిజాయితీ ముందు ఏదీ నిలబడదు కదా.
థామస్ చాందీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కేరళ రవాణాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యవహారం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన గద్దెదిగడానికి కారణం ఓ మహిళా కలెక్టర్. ఆమె పేరు టీవీ అనుపమ. ప్రస్తుతం అలప్పుఝా జిల్లా కలెక్టర్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రకృతి అందాలతో విరజిల్లే మార్తాండం సరస్సును పూడ్చి మంత్రి థామస్ అక్రమంగా లేక్ ప్యాలెస్ నిర్మించటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై మంత్రి-కలెక్టర్ మధ్య విమర్శలు-ప్రతి విమర్శలు కూడా కొనసాగాయి. దీంతో రెవెన్యూ శాఖ నుంచి పూర్తి నివేదికలు తెప్పించుకున్న ఆమె అందులో అవినీతి జరిగిందన్న విషయం నిర్థారించుకున్నాకే రెవెన్యూ కార్యదర్శికి తుది నివేదికను సమర్పించారు.
ఆ సమయంలో ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి.. బెదిరింపులు ఎదురయ్యాయి. కానీ, ఆమె మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో నివేదికను తప్పుబడుతూ సదరు మంత్రి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు వేశారు. అయితే ఆయన వ్యవహారాన్ని పనిపై స్థానిక మీడియాలు వరుస కథనాలు ప్రసారం చేయటంతో ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఎల్‌డీఎఫ్ కూటమి భాగస్వామ్య పార్టీలు ఆయన రాజీనామాను పట్టుబట్టడం.. అదే సమయంలో కోర్టు కూడా ఆయన తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేయటంతో చివరకు గత బుధవారం రాజీనామా చేస్తూ లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రస్తుతం ఆయన కబ్జా కట్టడాలను కూల్చివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇదిలా ఉంటే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయంగా.. అధికారానికి ఎదురొడ్డి మరీ అనుపమ చూపించిన తెగువకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
అనుపమ నేపథ్యం...
మళప్పురం జిల్లా పొన్నానిలోని మారంచెరీకి చెందిన అనుపమకు చిన్నప్పటికీ సివిల్స్ సాధించాలన్నది కలగా ఉండేది. గోవా బిట్స్ పిలానీ క్యాంస్‌లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. బీఈలో 92 శాతం ఉత్తీర్ణత సాధించటం విశేషం. 2010 సివిల్స్ పరీక్షలో నాలుగో ర్యాంక్‌ను ఆమె సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment