మహిళతో అశ్లీల వ్యాఖ్యలు.. మంత్రి రాజీనామా
తిరువనంతపురం: ఓ మహిళను కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశింద్రన్ లైంగికంగా వేధిస్తూ అసభ్యంగా సంభాషించిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం మంత్రి చర్యను తప్పుబట్టగా ఆదివారం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. విషయం ఏంటంటే.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత ఏకే శశింద్రన్(71) రవాణా మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి శశింద్రన్ గత కొన్ని రోజులుగా ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళకు తరచుగా ఫోన్ చేస్తూ తన కోరికను తీర్చాలంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను మంగళం అనే స్థానిక మీడియో ప్రసారం చేసి మంత్రి వ్యవహారాన్ని బటయపెట్టింది. తనకు సాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ మంత్రి శశింద్రన్ వద్దకు వెళ్లగా అప్పటినుంచీ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారని ఆడియో టేపుల సారాంశం. ఇది తీవ్రమైన చర్య అని మంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. బాధిత మహిళ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆడియో టేపుల సాక్ష్యాలున్నాయని.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నేతలు మంత్రి శశింద్రన్ రాజీనామాకు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉత్తర కేరళ కోజీకోడ్‌లో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆడియో టేపుల వివాదంపై మంత్రి శశింద్రన్ వివరణ ఇచ్చారు. 'నేను ఎవరితోనూ ఆ విధంగా సంభాషించలేదు. నా పదవికి రాజీనామా చేశాను. ప్రభుత్వంలో మా పార్టీ వల్ల ఎలాంటి విభేదాలు తలెత్తకూడాదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడియో టేపుల ఆరోపణలపై సీఎం పినరయి విజయన్ ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాను' అని శశింద్రన్ అన్నారు.