అందుకే రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి
ఈ ఏడాది ఇప్పటికే 1.68 లక్షల మంది మరణించారు
లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు.
గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు.
జరిమానాలు పెంచినా...
ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్‌స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment