ఈ మారణహోమం ఆగదా?
ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా రహదారుల నెత్తుటి దాహం నానాటికీ పెరుగుతూనే ఉన్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నాలుగురోజుల క్రితం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక-2015లో ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలున్నాయి. దేశంలో గంటకు సగటున 17 మంది...రోజుకు 400మంది పౌరులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదమృతుల్లో 51 శాతంమంది 15-34 ఏళ్లలోపువారు. అధిక శాతం(77.1శాతం) ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే కారణమవుతున్నాయి. 2014లో 4,89,000 ప్రమాదాలు జరిగి 1,39,671మంది పౌరులు మరణిస్తే... నిరుడు ప్రమాదాల సంఖ్య 5,01,423 చేరుకుని 1,46,133మంది ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. నిరుడు జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారి సంఖ్య 5,00,279కి చేరింది. రహదారుల నిర్మాణంలోని ఇంజనీరింగ్ లోపాలవల్ల ప్రమాదాలు జరుగు తున్నాయని ఈ నివేదిక తొలిసారి ఎత్తిచూపింది. ఎన్డీఏ సర్కారును ఒకందుకు మెచ్చుకోవాలి.
గత ప్రభుత్వాల మాదిరి రోడ్డు ప్రమాదాల తీవ్రతను దాచడానికి ప్రయత్నించడం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్య క్రమంలో నిరుడు దీన్ని ప్రస్తావించారు. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాలతోపాటు ప్రజలకు కూడా అవగాహన కలిగించేందుకు ప్రయత్నించారు. గడ్కరీ కూడా ఒకటికి పదిసార్లు రోడ్డు ప్రమాదాల గురించి చెబుతూనే ఉన్నారు. అయినా ఎంతో కీలకమైన రహదారి భద్రత బిల్లు ఇంతవరకూ పార్లమెంటు ముందుకు రాలేదు. ఎన్డీఏ సర్కారు ఏర్పడిన కొద్ది రోజులకే కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే న్యూఢిల్లీలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు త్వరలోనే సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని గడ్కరీ ప్రకటించారు. రెండేళ్లు పూర్తయినా అదింకా సాకారం కాలేదు. 2014లో సుప్రీంకోర్టు సైతం ఈ సమస్యపై దృష్టిసారించి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా దాదాపు ఏడాద వుతోంది. అయినా సమస్య తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగేవాటిని ప్రమాదాలంటారు. చాలా రోడ్డు ప్రమాదాలు ఆ కోవలోకి రావు. మన రోడ్లు సరిగా లేవని తెలిసినా సరే ఏటా లక్షలాది వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తుంటాయి. వాటికి బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేస్తాయి. మన రోడ్లు ఇంత భారీ సంఖ్యలో వాహనాలను భరించేంత విశాలమైనవని కాదని అర్ధమవుతున్నా ప్రభుత్వాలు పరిమితి విధించా లనుకోవు. ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటం వల్ల పౌరులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు పడుతున్నారని...దాన్ని మెరుగుపరిస్తే చాలామంది వాహనాల జోలికి వెళ్లరని తెలిసినా ఆ పనికి పూనుకోవు. ఫలానాచోట రోడ్డు సరిగా లేదని...ఫలానా మలుపు దగ్గర హెచ్చరిక బోర్డు లేదని...ఫలానాచోట రోడ్డు గుంతలు పడి ఉన్నదని అధికారులకు తెలుసు. అయినా దాన్ని సరిచేయడానికి ప్రయత్నించరు. వాహనాల వేగం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల గురించి ఫిర్యాదులందినా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయరు. జాతీయ రహదారుల్లో వాహ నాలు పరిమితికి మించిన వేగంతో వెళ్తాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ధోరణి ఎక్కువగా ఉన్నదని తెలిసినా నిరంతర గస్తీ, సీసీ టీవీ కెమెరాలు, స్పీడ్గన్లు ఏర్పాటు చేయరు. జాతీయ రహదారులపై సాగుతున్న మద్యం విక్రయాలను నియంత్రించడమే సాధ్యం కావడం లేదు. విచక్షణారహితంగా డ్రైవింగ్ లెసైన్స్ల మంజూరు...తప్పు వెల్లడైనా వాటిని రద్దు చేయడానికి పూనుకోక పోవడం మన దగ్గర అతి సహజం. అవినీతే అందుకు కారణం. వాహనాల సైజు, వాటి వేగం గతంతో పోలిస్తే హెచ్చాయి. అనుమతులిచ్చేవారికి ఈ సంగతి పట్టదు. ఇన్ని లోపాలున్నా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న పాలకులున్నచోట రోడ్డు ప్రమాదాలను ప్రమాదాలుగానే భావించాలా...ఉద్దేశపూర్వకంగా సాగుతున్న హత్యలనుకోవాలా?
అడుగడుగునా మన ప్రభుత్వాలు చూపుతున్న అలసత్వాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిశితంగా విమర్శించింది. ఏవో రెండు, మూడు రాష్ట్రాలు మినహా మిగిలినచోట్ల రహదారి భద్రతా విధానమే లేదని వెల్లడించింది. ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాల గురించి ఇక చెప్పనవసరమే లేదు. అందుకు సంబంధించిన విధానమే రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేదని కమిటీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సాయపడేవారికి పోలీసుల వేధింపులు లేకుండా చూస్తామని, ఆస్పత్రులు సైతం నగదు రహిత చికిత్సను వెనువెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోదీ చెప్పినా ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. పోలీసులు తమనే అనుమానితులుగా చూస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు.
రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ఉగ్రవాదుల మారణకాండలో చనిపోతున్నవారి సంఖ్య చాలా తక్కువ. ఉగ్రవాద బెడద నివారణకు మన ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. పటిష్టమైన నిఘా, ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వగైరాలన్నీ అందులో భాగం. అందువల్లే ఆ సమస్య చాలావరకూ అదుపులో ఉంది. కానీ రోడ్డు ప్రమాదాలు ఉగ్రవాద బెడదను మించిపోయాయి. భూగోళం మొత్తం మీద ఉగ్రవాద దాడుల్లో రోజూ మరణిస్తున్నవారి సంఖ్యతో పోలిస్తే... మన దేశంలో ప్రమాదాల బారినపడి ఒక రోజులో చనిపోతున్నవారు కనీసం పది రెట్లు ఎక్కువ. ఏదైనా ఒకచోట ఉగ్రవాద దాడి జరిగితే మీడియా మొత్తం ఆ ఘటనకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అందులో ఎంతమంది మరణిం చారన్న దానితో నిమిత్తం లేదు. కానీ మృతుల సంఖ్య ఎక్కువున్నప్పుడు
మాత్రమే ప్రమాదాల వార్తలు అందరికీ తెలుస్తాయి. ప్రమాద కారకులు డబ్బు, పలుకుబడి ఉన్నవారై... బాధితులు నిరుపేద కుటుంబాలవారైతే అవి అరకొరగానే వెల్లడవుతాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలి. ప్రమాదాల నివార ణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు
అందుకు దారితీసిన పరిస్థితులేమిటో విచారించి, కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే రోడ్లపైకి వెళ్లినవారు భద్రంగా ఇళ్లకు చేరగలుగుతారు.
రోడ్డు భద్రత అనేది యాధృచ్చికం కాదు. అది మేధోపరమైన చర్యల సామూహిక ప్రయత్నం.
- జార్జ్ మిచెల్
ఇంగ్లీషు గాయకుడు, రచయిత