
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావొచ్చనే అంచనా తప్పింది.
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావొచ్చనే విశ్లేషకుల అంచనా తప్పింది. మరికొంత మందిని విచారించాలని ఈడీ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. తాజాగా..
ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌కు కైలాష్ మద్దతు ఉందనే ఆరోపణ మీద ఆయనకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా శనివారమే తమ ఎదుటకు రావాలని సమన్లలో ఈడీ కోరింది.
అంతేకాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ నాటి లిక్కర్ పాలసీ ముసాయిదా రూపకల్పనలో సభ్యుడిగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల విచారణ మొదలయ్యాక.. తరచూ ఆయన ఫోన్ నెంబర్లు మార్చినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళే(శనివారం) తమ ఎదుట హాజరు కావాలని ఈడీ మంత్రి కైలాష్‌కు సమన్లలో స్పష్టం చేసింది.