విజయనగరం క్రైం: జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధారణపై గత మూడు నెలల నుంచి అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని 41 పోలీసు స్టేషన్ల పరిధిలో హెల్మెట్ ధారణపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సమాయిత్తమవుతున్నారు.
జిల్లా కేంద్రంలో హెల్మెట్ ధారణతో ఇబ్బందులు
జిల్లా కేంద్రం విజయనగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించటం వల్ల అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏదైనా కార్యాలయానికి వెళ్లాలన్నా హెల్మెట్ పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. దొంగలు హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. అందరూ హెల్మెట్‌లు ధరించడంతో పోలీసులు దొంగలను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. హత్యలు, దాడులు చేసేందుకు కూడా హెల్మెట్‌లను వినియోగిస్తున్నారు. గతంలో జిల్లా కోర్టు సమీపంలో ఒక వ్యక్తిని హత్య చేసిన నేరస్తుడు హెల్మెట్‌తో వె ళ్లాడు. ఘటన తర్వాత పరారయ్యాడు.
హెల్మెట్ ధరించి వచ్చిన దుండగులు మహిళల మెడల్లోని బంగారు అభరణాలు దొంగిలించిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2009లో అప్పటి ఎస్పీ నవీన్ గులాఠీ జిల్లావ్యాప్తంగా హెల్మెట్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాకేంద్రంలోని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ వాడకం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా మినహాయింపు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు పట్టణ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌కు వినతిపత్రం అందించారు కూడా. దీనిపై ఎస్పీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
నేటి నుంచి ధరించాల్సిందే: ఎస్పీ
విజయనగరం క్రైం: ద్విచక్ర వాహనదారులు ఆగస్టు 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ తెలిపారు. హెల్మెట్‌లు ధరిస్తే ప్రమాదాలు జరిగినపుడు ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది తలకు గాయమై మృతి చెందుతున్నారన్నారు. ఈ నిబంధనను తప్పనిసరిగా అందరూ ఆచరించాలని, నిబంధనను అతిక్రమించిన వారి నుంచి ఆపరాధ రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు.
ఇక హెల్మెట్ల వాడకం తప్పనిసరి
Published Sat, Aug 1 2015 2:55 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement