శివ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై
పెద్దారవీడు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి కింద పడిపోయారు. దీంతో ఒకరు ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన పెద్దారవీడు గ్రామం సమీపంలో చెరువు దగ్గర మూలమలుపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని మామ బాలంకయ్య తెలిపిన ప్రకారం.. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె గ్రామానికి చెందిన అక్కలి శివ తన మామ గంగుపల్లె గ్రామానికి చెందిన మురారి బాలంకయ్య కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాలకు వెళుతున్నారు. పెద్దారవీడు గ్రామం చెరువు మూలమలుపు వద్దకు రాగానే కిందపడిపోవడంతో అక్కలి శివ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై కుర్చున్న మామ మురారి బాలంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
హెల్మెట్ ఉన్నప్పటికీ పెట్టుకోకపోవడంతో శివ తలకు బలమైన గాయాలు తగిలాయి. గ్రామస్తులు వెంటనే 108కి సమాచారం అందించడంతో తీవ్ర గాయాలైన బాలంకయ్యను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలంకయ్య కూతురు మల్లేశ్వరిని శివ సంవత్సరం క్రితం వివాహాం చేసుకుని మామ ఇంటి వద్దనే ఉంటున్నారు. పెద్దదోర్నాలలో అమ్మమ్మ దగ్గర శివ చెల్లెలు నాగలక్ష్మి ఉంటూ చదువుకుంటూ ఉంది. మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో నాగలక్ష్మిని చేర్పించేందుకు మామతో కలిసి శివ ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాల బయలుదేరారు. ఈ ఘటనతో భార్య, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎస్సై పి. ముక్కంటి సంఘటన స్థలంనకు చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకుని ట్రాఫ్‌కు అంతరాయం లేకుండా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment