నేటినుంచి ధరించాలని సర్కారు ఆదేశం
వేచిచూసే ధోరణిలో నగర పోలీసులు
కొత్త సీపీ వచ్చిన తర్వాతే నిర్ణయం
విజయవాడ సిటీ: ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన హెల్మెట్ల ధారణ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనచోదకులందరూ విధిగా హెల్మెట్లు ధరించి తీరాలని గురువారం నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్.కృష్ణారావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. రాష్ట్రంలో నానాటికీ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వేర్వేరు కారణాలపై జరిగే హత్యల కంటే రెట్టింపు స్థాయిలో రోడ్డు ప్రమాద మృతులు ఉంటున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది. తొలుత జూలై ఒకటో తేదీ నుంచే అమలుచేయనున్నట్టు మూడు నెలల కిందట ప్రకటించారు. వాహనచోదకుల సంఖ్యకు అనుగుణంగా హెల్మెట్లు లేకపోవడం, ప్రజల్లో వీటి ధారణపై అవగాహన కొరవడడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలుచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వేచిచూద్దాం..
పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు బదిలీ, పుష్కర విధుల నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. జూలైలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధారణపై దృష్టిసారించాలని పోలీసు అధికారులు భావించారు. ఈలోగా సీపీ బదిలీ, పుష్కరాలు వచ్చాయి. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు వంటి విధులతో పోలీసులు తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అమలుచేయడం ఇబ్బందేనని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఈ-చలానాలతో పోలీసులపై వ్యతిరేకత నెలకొంది. తిరిగి హెల్మెట్ అంటూ వెంటపడితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పోలీసుల అభిప్రాయం. ప్రజల వ్యతిరేకత పెరిగితే ప్రభుత్వం తిరిగి తమనే బాధ్యులను చేస్తుందనేది వీరి వాదన. వీటన్నింటిని అధిగమించి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలంటే కొత్త పోలీసు కమిషనర్ వచ్చే వరకు వేచిచూడడమే మంచిదని నిర్ణయించారు.
నాసిరకం హెల్మెట్లు
ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే సమాచారంతో నాసిరకం హెల్మెట్లు మార్కెట్లోకి వ్యాపారులు దించినట్టు చెబుతున్నారు. నగరంలో నాలుగు లక్షల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు పోలీసు లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరికి సరిపడా హెల్మెట్లు లేవు. కొన్ని షాపుల్లో బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. నాణ్యత కలిగిన హెల్మెట్లు తగిన సంఖ్యలో లేకపోవడంతో వాహనదారులు వీటిని కొనేందుకు ఇష్టపడటం లేదు. గతంలో రూ.200కి దొరికిన హెల్మెట్‌ను ఇప్పుడు రూ.500కు విక్రయిస్తున్నారు. అదేమంటే స్టాకులేదని చెబుతున్నట్టు వాహనచోదకుల వాదన. కారణాలేమైనప్పటికీ శనివారం నుంచి హెల్మెట్ల వాడకం సాధ్యపడదని పోలీసులు అంటున్నారు. కొత్త సీపీ వచ్చిన తర్వాత తగిన సమయం తీసుకొని అమలుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల ఊగిసలాట
నిబంధనల అమలులో కీలక పాత్ర పోషించే పోలీసు శాఖ మాత్రం ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. కొత్త పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా వెళ్లాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. దీనికి రవాణాశాఖ ఓకే చెబుతుంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపే పోలీసు శాఖ మాత్రం ఊగిసలాటలో ఉంది.
హెల్మెట్.. ఇక తప్పనిసరి
Published Sat, Aug 1 2015 12:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement