City police
-
నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్‌పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్‌గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్‌పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్‌లను వివిధ రకాల పాస్‌వర్డ్‌లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు. బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా... సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు పోలీసులపైనా చర్యలు ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రిజర్వ్డ్ కేటగిరీలో ఇన్స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు) -
ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్.. ప్రయాణికుల ప్రాణాలతో క్యాబ్ డ్రైవర్ చెలగాటం
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మొబైల్లో గేమ్స్‌కు అడిక్ట్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు. వెనకాల కూర్చున్న ప్యాసెంజర్ గేమ్ ఆడకుండా డ్రైవింగ్ చేయమని చెప్పినా అతడు పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష్యంగా కారును ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. కనీసం సీట్ బెల్టు ధరించమని చెప్పినా పట్టించుకోలేదు. డ్రైవర్ వెర్రి చర్యకు చిర్రెత్తిపోయిన ప్యాసెంజర్ రాజీవ్ సింగ్ ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. @CYBTRAFFIC driving while playing pic.twitter.com/RRUP7GXF2E — Rajiv Singh (@rajusingh0810) August 5, 2022 ఇతని పేరు రాజు. అరుదైన డ్రైవింగ్ స్టైల్ ఉన్నట్టుంది. ఫోన్లో గేమ్ ఆడుతూనే కారు నడపుతున్నాడు. అసలు ఇతడ్ని డెల్ సంస్థ క్యాబ్ డ్రైవర్‌గా ఎలా తీసుకుంది అని వాపోయాడు. రాజీవ్ షేర్ చేసిన వీడియో చూసి నగర పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ చోటు ఎక్కడని అడిగారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అని అతడు బదులిచ్చాడు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలుసుకుని పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. చదవండి: ‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు -
బైక్ సెలైన్సర్లపై కొరడా..రోడ్ రోలర్‌తో తొక్కించిన వైజాగ్ పోలీస్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే అంతే! రెడ్ సిగ్నల్ పడిందో..
సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే.. ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి.. పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా. గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు హైదరాబాద్ 70,03,012 25,453 సైబరాబాద్ 53,50,724 34,746 రాచకొండ 22,64,225 8,121 -
జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’
సాక్షి హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సమగ్ర అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గుర్తిస్తున్నారు. తాజాగా చేపట్టిన అధ్యయనంలో గడిచిన మూడేళ్ల కాలంలో ట్రాఫిక్ జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2019– 21 మధ్య మొత్తం మృతుల్లో కనిష్టంగా 18.91 శాతం, గరిష్టంగా 21.14 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే మృత్యువాతపడ్డారని తేలింది. మొత్తమ్మీద 147 మంది ఈ ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్‌లోనే కన్నుమూశారు. ఈ అధ్యయనాల ఆధారంగా నిరోధానికి చర్యలు తీసుకుంటామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లంఘనలే ప్రధాన కారణం.. సిటీలోని పలు ప్రాంతాల్లో అనునిత్యం కనిపించే సీన్లు చూస్తే ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటారని స్పష్టమవుతోంది. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడం వంటివి చేస్తుంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే జంక్షన్లు, యూ టర్న్స్ వద్దా ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే వీరితో పాటు ఎదుటి వారి ప్రాణాల మీదకు తెస్తోందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే జంక్షన్లు, యూ టర్న్స్ మృత్యువాతపడిన వాళ్లల్లో ద్విచక్ర వాహనచోదకులది మొదటి స్థానం కాగా.. పాదచారులది రెండో స్థానం. అధ్యయనంలో గుర్తించిన అంశాలివి... 2021లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా.. జంక్షన్ల వద్ద 48 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 279 మంది. ఇందులో రాత్రి వేళ 28 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 31 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 17 మంది, ద్విచక్ర వాహనచోదకులు 35 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. లంగర్‌హౌస్‌లోని ఆర్మీ గేట్ యూ టర్న్, బోయిన్పల్లి చౌరస్తా, డెయిరీ ఫామ్ టీ జంక్షన్, ఎంజే మార్కెట్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 31 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 254. రాత్రి వేళ 20 ప్రమా దాలు జరగ్గా, పగటి వేళ 19 చోటు చేసుకున్నా యి. మృతుల్లో పాదచారులు 12 మంది, ద్విచక్ర వాహనచోదకులు 26 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అమీర్‌పేట చౌరస్తా, నల్లగొండచౌ రస్తా, బాలమ్రాయి ఎక్స్ రోడ్స్, తాజ్‌మహల్ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2019లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 38 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 259 మంది. రాత్రి వేళ 22 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 27 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 25 మంది, ద్విచక్ర వాహనచోదకులు 19 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. చిలకలగూడ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్‌లోని జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. తాజా అధ్యయనం గుర్తించిన అంశాల ఆధారంగా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇతర విభాగాలతో కలిసి ఆయా చోట్ల క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహిస్తాం. వారి సహకారంతో అవసరమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు రోడ్ ఇంజినీరింగ్ వంటి చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ..ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను బాధ్యులుగా నియమించారు. ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. బందోబస్తు సంబంధిత చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా ఎలక్షన్ సెల్ రెడీ! ‘గ్రేటర్’ ఎన్నికల సైరన్ మోగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నగరంలోని పరిస్థితులు బేరీజు వేడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: ‘గ్రేటర్’ వార్ 1న ► నగరంలోని అయిదు జోన్లలో ఎన్నికల విధి నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలను ఏర్పాటు చేయడం తదితర విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. డీజీపీ కార్యాలయంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఏర్పాటైన ఎలక్షన్ సెల్‌కు సంబంధించిన హాట్‌లైన్ దీనికి అనుసంధానించి ఉంటాయి. ► జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధులకు సంబంధించిన పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఈ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ అమలు, ప్రవర్తన నియమావళి తదితరాలకు సంబంధించి కొత్వాల్ అంజనీకుమార్ అన్ని స్థాయిన అధికారులను సమాయత్తం చేస్తున్నారు. దీనికోసం ఆయన మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ►ఇందులో గత ఎన్నికల్లో జరిగిన ఉదంతాలు, ఆ కేసుల స్థితిగతులు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లైసెన్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారంతా వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ►స్థానిక పోలీసుస్టేషన్లు లేదా అధీకృత ఆయుధ డీలర్ల దగ్గర డిపాజిట్ చేయాలి. కౌంటింగ్ తదితర ప్రక్రియలు పూర్తయ్యాక మాత్రమే తమ ఆయుధాలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం సైతం ఊపందుకోనుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభలు, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని భావించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభల్ని ఎస్ఈసీ నిషేధించింది. మిగిలినవీ పరిమిత సంఖ్యలో, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగనున్నాయి. దీనికోసం ఆయా అభ్యర్థులు, పార్టీలు సంబంధిత జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అనువుగా నిర్ణీత గడువుకు ముందే డీసీపీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం ఏర్పాటు చేసే సంచార వాహనాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సైబరాబాద్.. రాచకొండ పరిధిలోనూ.. బల్దియా ఎన్నికలకు నగారా మోగడంతో సైబరాబాద్, రాచకొండ పోలీసులు భద్రతా విధుల్లో తలమునకలయ్యారు. ఆయా కమిషనరేట్లలో ఉన్న 66 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్ దగ్గరి నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు దాదాపు 14,500 మందికిపైగా పోలీసు సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. సైబరాబాద్‌లో 38 డివిజన్లు, రాచకొండలో 28 డివిజన్లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఫ్లయింగ్ స్క్వాడ్లతో ఇటు నగదు, అటు మద్యం సరఫరాపై ప్రధానంగా నిఘా వేసి ఉంచుతామని ఇరు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ముందుకు.. ఎన్నికల వంటి కీలక ఘట్టాల్లో ఎంత పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామో.. అంత సజావుగా ఆ ఘట్టాలను పూర్తి చేసి విజయం సాధించగలం. సిటీ పోలీసులకు ఎన్నికల నిర్వహణలో మంచి అనుభవం ఉంది. 2018, 2019ల్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్ని సజావుగా పూర్తి చేసి ఈసీ మన్ననలు పొందాం. మరోసారి నాటి విధివిధానాలను మననం చేసుకోవాలి. సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులతో కొత్త పంథాలో ముందుకు వెళ్లాలి. – పోలీసు అధికారులతో కొత్వాల్ అంజనీకుమార్ కోడ్ కూసింది గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఇక కొత్త పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్ కానున్నాయి. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం యధాతథంగా కొనసాగించనున్నారు. అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త! -
నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా
సాక్షి, విజయవాడ: కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై విజయవాడ నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోమవారం రోజున రామవరప్పాడులో ట్రాఫిక్ ఏడీసీపీ రవిచంద్ర స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించి మాస్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీసీపీ రవిచంద్ర మాట్లాడుతూ.. నెల రోజుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10,805 మందిపై కేసులు నమోదు చేశాము. మొత్తంగా వారికి రూ. 8,83,600 జరిమానా విధించాము. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలి. నిర్లక్ష్యం వహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము' అని రవిచంద్ర పేర్కొన్నారు. (పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్) -
అర్ధరాత్రి శబ్ధాలు భరించలేకున్నా: హరీష్ శంకర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దానివలన భారీ శబ్దాలు వస్తుండటంతో ఇబ్బందిగా ఉందంటూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. 'జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్ జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రి పెద్ద శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతిచ్చారా..? న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన పోలీసులు ఆయనకు ఫోన్ చేసి అడ్రస్‌ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్ సిబ్బందిని పంపారు. భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. పోలీసుల స్పందన పట్ల హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మరో ట్వీట్ చేశారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్క్లేవ్ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నారు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నారు. I am indebted to @cyberabadpolice @GHMCOnline @hydcitypolice for their immediate action against my request..... Thank you so much this how you restore our trust and make us to be more responsible cirizen... 🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) February 16, 2020 Cant believe this with in minutes the noise has been stopped...... big thanks from entire jubli enclave residents .... meeru taluchukunte emainaa cheyagalaru eppudainaa raagalaru ani niroopinchaaru 🙏🙏🙏 https://t.co/1OF8UrqL9E — Harish Shankar .S (@harish2you) February 16, 2020 -
తెలిస్తే చాలు తాట తీసేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో : దిశ ఉదంతం తర్వాత మహిళలపై జరిగే నేరాలను హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొన్ని ఉదంతాలపై ఫిర్యాదు అందకపోయినా సమాచారం ఉంటేచాలు స్పందిస్తున్నారు. సుమోటోగా చర్య లు చేపట్టి బాధ్యుల్ని కటకటాల్లోకి నెడుతున్నా రు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ నగరంలోని తూర్పు మండలంలో ఉన్న ఉస్మానియా వర్సిటీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం ఓ నేరంపై సమాచారం అందుకున్న ఈ అధికారులు మంగళవారం బాధ్యుడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు.. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో హబ్సిగూడ స్ట్రీట్ నంబర్.8లోని రవీంద్రనగర్‌లో ఓ ఉదంతం చోటు చేసుకుంది. మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ సమయంలో వాకింగ్ చేస్తున్న మరికొందరు జరిగిన అంశాన్ని గమనించారు. ఇది కాస్తా ఆ వీధిలో చర్చనీయాంశంగా మారింది. అలా ఆ నోటా, ఈ నోటా విషయం సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన గస్తీ సిబ్బందికి తెలిసింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. రవీంద్రనగర్‌కు సిబ్బందిని పంపి విషయం ఆరా తీయించారు. దీంతో స్థానికులు ఫలానా చోట జరిగిందంటూ ఓ ప్రాంతాన్ని చూపించారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటర్‌పై రావడం.. అక్కడ పార్క్ చేసి ఓ మహిళ వెనుక నడుచుకుంటూ వెళ్ళడం.. కాసేపటికి వాహనం వదిలి పారిపోవడం రికార్డయ్యాయి. ఈ ఫీడ్‌లో రికార్డయిన స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తించిన పోలీసులు ఆర్టీఏ డేటా ఆధారంగా దాని చిరునామా తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు గౌలిపుర ప్రాంతానికి చెందిన బీరప్పను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఇతగాడు ఉప్పల్–సికింద్రాబాద్ రహదారిలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుంటాడని గుర్తించారు. విచారణ నేపథ్యంలో తాను ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించానని అంగీకరించాడు. అయితే బాధితురాలి ఆచూకీ లభించలేదు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులే స్వయంగా సిటీ పోలీసు చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద సుమోటో కేసు నమోదు చేశారు. -
సిటీ పోలీస్: ఇక గల్లీల్లోనూ సైకిళ్లతో గస్తీ!
సిటీ పోలీస్ ఇక సైకిల్ బాట పడుతున్నారు. స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరిట కాలనీలు, గల్లీల్లో గస్తీ నిర్వహణకు ప్రత్యేక సైకిళ్లు వినియోగించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సైకిళ్లను సోమవారం నుంచి వినియోగిస్తున్నారు. బ్లూకోల్ట్స్, ఇన్నోవాలు, ఇంటర్సెప్టార్ వాహనాలు వెళ్లలేని గల్లీల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని, ఇంధనం అవసరం లేని కారణంగా ఇవి పర్యావరణ హితమైనవి కూడా అని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దశలవారీగా వీటి వినియోగాన్ని విస్తరిస్తామని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం బ్లూకోల్ట్స్‌గా పిలిచే ద్విచక్ర వాహనాలు, రక్షక్లుగా పిలిచే ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్–డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ ఉన్న మారుమూల గల్లీల్లోకి వీటి ద్వారా వెళ్ళడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మౌంటెడ్ పోలీసుగా పిలిచే అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పెట్రోలింగ్ కోసం ప్రత్యేకమైన సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను ప్రయోగాత్మకంగా పంజగుట్ట ఠాణా పరిధిలో సోమవారం ప్రారంభించారు. తొలి దశలో ఐదు సైకిళ్లలో స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరుతో ఇది మొదలైందని ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ ‘సాక్షి’కి తెలిపారు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఎల్లారెడ్డిగూడ, ఆనంద్‌నగర్‌కాలనీ, సోమాజిగూడల్లోని స్లమ్స్, గల్లీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్బీపీ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు. అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు... ఈ సైకిళ్లను గస్తీ పోలీసుల దైనందిన అవసరాలకు తగ్గట్లు డిజైన్ చేశారు. వీటిని వినియోగించడం ద్వారా గస్తీ సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బ్లూకోల్ట్సŠ, రక్షక్‌లు చేరలేని ప్రాంతాలకూ ఇవి వెళ్తాయి. లాఠీ, వాటర్‌బాటిల్, సైరన్లతో పాటు జీపీఎస్ విధానం కూడా ఈ సైకిళ్లకు ఉంటుంది. వాకీటాకీ, సెల్‌ఫోన్, డైరీలను తమ వెంట తీసుకువెళ్ళడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఠాణా నుంచి గస్తీకి బయలుదేరిన సిబ్బంది సాయంత్రం వరకు ఈ సైకిల్ పైనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అలసట లేకుండా అద్భుతంగా పని చేసే షాక్ ఎబ్జార్వర్స్, బ్రేకింగ్ సిస్టం దీనికి ఉన్న అదనపు ఆకర్షణలు. ఈ సైకిల్‌కు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పెట్టెలో ప్రథమ చికిత్స ఉపకరణాలతో పాటు క్రైమ్ సీన్‌ను రక్షించడానికి ఉపయోగించేవీ, సైరన్ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం లో నేరం జరిగినప్పుడు తక్షణం అక్కడు వెళ్ళే ఎస్బీపీ సిబ్బంది తక్షణం సహాయక చర్యలు చేపట్టడానికి, నేర స్థలిని రక్షించడానికి ఇవి ఉపకరిస్తాయి. భవిష్యత్‌లో ఎస్బీపీ విస్తరణ... దేశంలోనే బెస్ట్ ఠాణాగా నిలిచిన పంజగుట్ట నుంచి ఈ ఎస్‌బీసీని ప్రారంభించారు. భవిష్యత్తులో మరింత విస్తరించాలని నగర పోలీసులు భావిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. రెండో దశలో టూరిస్ట్‌లు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో గస్తీ కోసం వినియోగిస్తారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, పెడస్ట్రియన్ ప్రాజెక్టు అమలవుతున్న చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయించాలని భావిస్తున్నారు. టూరిజం పోలీసింగ్‌కు మాత్రమే కాకుండా బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. -
హలో.. మీ కేసు ఇలా!
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఓ ఠాణాలో రెండేళ్ల క్రితం నమోదైన చీటింగ్ కేసు.. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్యాప్తు అధికారులు తీసుకున్న చర్యల విషయం తెలియని బాధితుడు తన కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి చులకన భావం ఏర్పరుచుకున్నాడు. అనేక మంది పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టాడు. పోలీసులపై ఒత్తిడి రావడంతో వారు అసలు విషయం బాధితుడికి వివరించారు. ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసులను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే అనేక ఇబ్బందులు పడుతుంటారు. అతి కష్టం మీద కలుసుకున్నా.. సరైన స్పందన లేని కారణంగా నిరాశ, అసంతృప్తి, అసహనాలకు లోనవుతారు. బాధితులకు సంబంధించిన ఈ ఫీలింగ్ పోలీసు విభాగంపై మచ్చకు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఓ వినూత్న విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తునకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. ఫిర్యాదుదారుడికి స్వయంగా ఫోన్ చేసి కనీసం పక్షం రోజులకొకసారైనా కేసు దర్యాప్తు పురోగతి వివరించాలని ఆదేశించారు. గత నెలలో కూకట్పల్లి జేఎన్టీయూలో జరిగిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా చిక్కరు.. దొరకరు.. నమోదైన కేసు ప్రాధాన్యం, దాని తీరుతెనులను బట్టి దర్యాప్తు అధికారుల హోదా ఉంది. అధిక కేసుల్లో సబ్–ఇన్స్పెక్టర్ (ఎస్సై) స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు దర్యాప్తు అధికారులుగా ఉంటారు. పోలీసుస్టేషన్లలో ఉండే ఎస్సైలు, ఇతర ఐఓలకు దర్యాప్తు బాధ్యతలతో పాటు పరిపాలన, బందోబస్తు, భద్రత విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీసుస్టేషన్లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం అరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది. ఇవన్నీ పోలీసు విభాగంపై ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది. ఆన్లైన్ అవకాశాలు ఉన్నప్పటికీ... ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ఈ–కాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్లైన్ విధానాలను ప్రవేశపెట్టింది. సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్), పోలీసు వెబ్సైట్లలో ‘నో యువర్ కేస్ స్టేటస్’ అవకాశం కల్పించింది. వీటి ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ‘అండర్ ఇన్వెస్టిగేషన్’ (యూఐ), ‘అండర్ ట్రయల్’ (యూటీ), క్లోజ్డ్... అని మాత్రమే తెలుస్తుంది. బాధితులు/ఫిర్యాదుదారులు తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే అది ఆన్లైన్ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల నేపథ్యంలో కేసు వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండట్లేదు. ఐఓలకే ఆ బాధ్యతలు అప్పగిస్తూ... ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించారు. ప్రతి ఐఓ తన దగ్గర ఉన్న కేసుల జాబితాతో పాటు ఫిర్యాదుదారుల ఫోన్ నెంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతి రోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా వీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. వారి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి ఐఓ తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతో పాటు వారి కాంటాక్టు నెంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని డీజీపీ ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరించే జిల్లా ఎస్పీలు, కమిషనరేట్ల పోలీసు కమిషనర్లకు అప్పగించారు. -
గేదెల రాజును హత్య చేయించింది నేనే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ రౌడీషీటర్ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్ గేదెల రాజును హత్య చేయించింది తానేనని ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు పోలీసుల ఎదుట అంగీకరించాడని విశాఖ సిటీ లా అండ్ ఆర్డర్ డీసీపీ–2 రవికుమార్‌మూర్తి వెల్లడించారు. ఇందుకోసం భూపతిరాజు శ్రీనివాసరాజుతో డీల్ కుదుర్చుకున్నాడని, తన కుమారుడి ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్‌లను కూడా రవిబాబు ఇచ్చాడని చెప్పారు. చోడవరం పోలీస్‌స్టేషన్ లో శుక్రవారం లొంగి పోయిన రవిబాబును రూరల్ ఎస్పీ.. సిటీ పోలీసులకు అప్పగించగా, శనివారం మీడియా ఎదుట హాజరుపర్చారు. అనంతరం జిల్లా కోర్టు అతనికి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ వెంటనే పోలీసు కస్టడీ కోరుతూ సిటీ పోలీసులు పిటిషన్ వేశారు. గేదెల రాజు హత్యలో రవిబాబు పాత్రతోపాటు, పద్మలత మృతి కేసులో కూడా సాక్ష్యాలను సేకరించామని డీసీపీ వెల్లడించారు. భూపతిరాజు, అతని డ్రైవర్‌తో పాటు బీచ్‌రోడ్ గెస్ట్‌హౌస్ భేటీలో పాల్గొన్న వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి మురళీనగర్‌లోని రవిబాబు ఇంట్లో ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పాస్‌పోర్టు, చెక్‌బుక్‌లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
కుయ్ కుయ్.. ఇక రయ్ రయ్!
♦ నగరంలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక ‘మార్గం’ ♦ అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్న నగర పోలీసులు సాక్షి, హైదరాబాద్: అంబులెన్స్.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోగులను, ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగపడే అత్యవసర వాహనం. కానీ, హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో రోగులను, బాధితులను గమ్యస్థానానికి చేర్చడానికి నానా పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించేలా అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా మార్గం ఏర్పాటు చేయాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. ప్రధాన రహదారిలో భాగంగానే ఓ పక్కగా మార్కింగ్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రయోగాత్మక అమలు కోసం ప్రధాన ఆస్పత్రులు ఉన్న 15 మార్గాల్లో అధ్యయనానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం సమన్వయంతో పని చేయనుంది. అంబులెన్స్‌లకు అష్టకష్టాలు.. వైద్య రంగానికి కేంద్ర బిందువుగా మారిన నగరంలో అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ ఆస్పతులు ఉండనే ఉన్నాయి. నగరంతో పాటు బయటి ప్రాంతాలకు చెందిన అనేక మంది రోగులను, తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో వైద్యం కోసం సిటీకి తీసుకువస్తున్నారు. ఆ వాహనాలు శివార్ల వరకు ఆగమేఘాలపై వచ్చినా.. సిటీలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నాయి. ఫలితంగా ఒక్కోసారి రోగుల పరిస్థితి చేయి దాటిపోతోంది. వర్షాలు కురవడం, ట్రాఫిక్ జామ్స్ వంటి సమయాల్లో సాధారణ వాహనాల్లాగే అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. స్ఫూర్తినిచ్చిన ‘గ్రీన్ చానల్’.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవల ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెరిగింది. ఇతర నగరాలతో పాటు రాష్ట్రాల్లోనూ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిన వారి అవయవాలను ఇక్కడకు తీసుకురావడం, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లడం చేస్తున్నారు. ఆ సందర్భాల్లో వైద్యులతో పాటు ట్రాఫిక్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సదరు అవయవాలతో ప్రయాణిస్తున్న అంబులెన్స్‌లు విమానాశ్రయం నుంచి నిర్దేశించిన ఆస్పత్రికి చేరుకునే వరకు పక్కా సమన్వయంతో పని చేస్తున్నారు. వీటి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ‘గ్రీన్ చానల్’ ఇస్తున్నారు. ఫలితంగా అవయవదానానికి సంబంధించిన లక్ష్యం నెరవేరుతోంది. ఇప్పుడు ఈ ‘గ్రీన్ చానల్’ విధానాన్ని నగర పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ వల్ల ‘గోల్డెన్ అవర్’ దాటిపోవడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో నగరంలో అంబులెన్స్‌లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువచ్చే అంశంపై కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్రయోగాత్మకంగా.. ‘క్లిష్ట సమయాల్లో’.. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అత్యంత క్లిష్ట సమయాల్లో అమలు చేయాలని నగర పోలీసులు యోచిస్తున్నారు. సిటీలో ఉన్న రహదారుల పరిస్థితి, వాటి వెడల్పులు, బాటిల్ నెక్స్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు అన్ని రహదారుల్లోనూ ఏకకాలంలో అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. తొలుత భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు, వర్షాలతో పాటు ఇతర కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రత్యేక లైన్‌ను అమలు చేస్తారు. ప్రధాన రహదారులకు కుడి వైపున నాలుగు అడుగుల ప్రాంతాన్ని అంబులెన్స్‌ల కోసం వదలాలని భావిస్తున్నారు. ఆయా సమయాల్లో ఈ రూట్స్‌లో అంబులెన్స్‌లతో పాటు ఇతర అత్యవసర వాహనాలను మాత్రమే పంపేలా చర్య లు తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రయోగాత్మక అమలు తర్వాత ఇతర ఇబ్బందుల్ని గుర్తించి, వాటిని పరిష్కరించాక నగర వ్యాప్తంగా అన్ని వేళల్లో అమలు అంశాన్ని పరిశీలించనున్నారు. అప్పట్లో ఢిల్లీలో ‘కామన్వెల్త్ లైన్’.. దేశ రాజధాని ఢిల్లీలో 2010 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. అప్పట్లో ఆటగాళ్లకు నగరంలోని ప్రధాన హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి ప్లేయర్లు మైదానాలకు రావడంలో ఆలస్యానికి తావు లేకుండా పోలీసు విభాగం ప్రధాన రహదారులకు కుడి వైపుగా ఓ లైన్ ఏర్పాటు చేసి, ఆ భాగాన్ని కామన్వెల్త్ లైన్‌గా మార్కింగ్ ఇచ్చింది. ఇందులోకి సాధారణ వాహనాలు వస్తే రూ.2 వేలు జరిమానా విధించింది. దీంతో ఆ ‘లైన్’ విజయవంతమై క్రీడాకారులకు ఇబ్బందులు తప్పాయి. -
మృగాడికి రక్షాకవచం..!?
మూడేళ్లుగా యువతిపై వేధింపులు వీడియో తీసి బెదిరింపులు పోలీసుల విచారణలో నిగ్గుతేలిన నిజం మృగాడికి ఓ ప్రజాప్రతినిధి వత్తాసు రాజకీయ ఒత్తిడితో చర్యలకు వెనకడుగు బెజవాడ సైబర్ నేరాల అడ్డాగా మారుతూ బెంబేలెత్తిస్తోంది. యువతులపై అమానుషానికి పాల్పడుతూ చెలరేగిపోతున్న మృగాళ్లకు కూడా రాజకీయ రక్షాకవచం కల్పిస్తుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు గోప్యంగా ఉంచుతున్న ఓ మృగాడి విశృంఖలత్వం ఇది... మూడేళ్లుగా వేధింపులకు గురైన ఓ యువతి దయనీయ స్థితి ఇది.! అమరావతి బ్యూరో : అతడు ఓ మృగాడు ..తన పేరు మార్చుకున్నాడు...ప్రేమించానన్నాడు...నమ్మిన యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు...అదంతా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. ఏకంగా మూడేళ్లపాటు అకృత్యాలకు పాల్పడ్డాడు. లక్షలకు లక్షలు గుంజాడు. ఇక తాళలేక ఆ యువతి తల్లిదండ్రులకు చెబితే వీడియో లీక్‌చేసి అన్నంత పనీ చేశాడు..తల్లిదండ్రులు, బంధువులు వెళ్లి నిలదీస్తే ప్లేటు ఫిరాయిస్తూ వర్గ రాజకీయాల పాచిక వేశాడు. మా వాడిపై కేసు పెడతారా అని అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేశారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా తమవాడిని కాపాడేందుకు పైరవీలు ముమ్మరం చేస్తున్నారు. పేరుమార్చుకుని ఏమార్చాడు : అది 2013...పటమటలోని గణపతినగర్‌లోని ఓ యువతిపై అతడి కన్నుపడింది. తనపేరును రాజ శేఖర్‌గా మార్చుకుని ఆ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు.ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తరువాత ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మిం చాడు. 2013 సెప్టెంబ రులో తన పుట్టిన రోజు అని చెప్పి ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహాలో లేని ఆమెను అసభ్యకరంగా వీడియో తీశాడు. తరువాత ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ తన కోరికలు తీర్చమని వేధించాడు. ఓసారి రూ.10లక్షలు విలువైన ఆమె నగలను తీసుకుపోయాడు. ఏకంగా మూడేళ్లపాటు ఆ మృగాడి అకృత్యాలను ఆమె మౌనంగా రోధిస్తూ భరించింది. సైకోలా ప్రవరిస్తూ ఆమెను శారీరకంగా తీవ్రచిత్రహింసలకు గురిచేశాడు. అదంతా కూడా వీడియో తీసేవాడు. ఇక అతడి అకృత్యాలను తట్టుకోలేక ఆమె జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పుకుని బోరుమంది. తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేని ఆమె తల్లిదండ్రులు ఆ మృగాడిని నిలదీస్తే ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. నిగ్గుతేలిన దిగ్భ్రాంతికర నిజాలు : పోలీసుల విచారణలో మృగాడి అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగు చూశాయి. ఆ యువతిని ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. ఆమెను శారీరకంగా చిత్రహింసలకు గురి చేసినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సైకోలా మారి ఆమెను ఏ స్థాయిలో చిత్రహింసలకు గురిచేసిందీ తెలుసుకుని వైద్యులే నిర్ఘాంతపోయారు. సైబర్ చట్టం కింద కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె వీడియోలను కొన్ని సైట్లలో అతడు అప్లోడ్ చేశాడని నిర్ధారణ అయ్యింది. కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధి .. తాను చేసిన అకృత్యాలు బట్టబయలు కావడంతో ఆ మృగాడు వర్గ రాజకీయాలకు తెరతీశాడు. నగరంలో ఇటీవల అధికార పార్టీ పంచన చేరిన ఓ ప్రజాప్రతినిధి ఆ మృగాడికి అండగా నిలవడం విస్మయపరుస్తోంది. మావాడిపై కేసు పెట్టడానికి వీల్లేదంటూ ఆయన పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో పోలీసులు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ఇంకా అతడిపై చర్యలు తీసుకునేందుకు సందేహిస్తున్నారు. చెప్పుకోలేని రీతిలో యువతిని శారీరకంగా వేధించి వీడియోలు తీసిన మృగాడిపై చర్యలు తీసుకోకుండాఅధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తుండడం దిగ్భ్రంతి కలిగిస్తోంది. రాజధాని విజయవాడలో యువతులకు రక్షణ లేదన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. -
‘ప్రీ యాక్టివేటెడ్’కు ఫుల్స్టాప్ పడేనా?
సాక్షి, సిటీబ్యూరో: మూడన్నర నెలల కిందట.. సినిమాల ప్రభావంతో సాయి, రవి, మోహన్ అనే యువకులు పదోతరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి, అతని తల్లిదండ్రుల నుంచి డబ్బు గుంజాలనుకున్నారు. పథకం ప్రకారం బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లు, గుర్తింపుతో ఉన్నవే. ఆ సిమ్ కార్డుల నుంచే కిడ్నాపర్లు అభయ్ కుటుంబీకులతో బేరాలాడారు. తర్వాత ఆ కిడ్నాప్ హత్యోదంగా మారిన సంగతి తెలిసిందే. నాటి కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులూ ఓ కారణం. గత నెలలో.. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపుతోకి తీసుకుంది. కుట్రలు అమలు చేయడంలో భాగంగా వారు సంప్రదింపులు జరుపుకోవడానికి ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. ముఠాలో కీలక వ్యక్తి అయిన ఫహద్ దగ్గర తొమ్మిది ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు లభించాయి. చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్లెట్లో వాటిని ఖరీదేచేశారని ఎన్ఐఏ గుర్తించింది. నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పెద్ద సంఘటనలు కాబట్టి కొన్ని పోలీస్ రికార్డులకు వస్తున్నాయిగానీ ఈ తరహా సిమ్ కార్డులతో జరుగుతోన్న నేరాలుఘోరాలకు ఎన్నో! అసాంఘిక శక్తులకు బాగా ఉపయోగపడుతున్న ఈ దందాకు చెక్ పెట్టడంలో పోలీసు విభాగం విఫలమవుతోంది. కనెక్షన్లు పెంచుకుంటూ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న సర్వీసు ప్రొవైడర్లూ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్... సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సిమ్‌కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డు విక్రయదారులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరుతో 100 నుంచి 150 సిమ్‌కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధమైన అంశం. అనారోగ్యకర పోటీ నేపథ్యంలో... ఈ ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దందా సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్‌కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్‌ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ-యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్తంమవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తే చర్యలతో హడావుడి... దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్డ్రై వ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. అన్నప్రకారమే నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగాయి. సెల్‌ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్‌లెట్స్‌లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రై వ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని పోలీసులు మర్చిపోయారు. యథాప్రకారం అధికారులు తమ రోటీన్ విధుల్లో నిమగ్నం కాగా అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ఎందుకు ఉండట్లేదు? కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది సుస్పష్టం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ-పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ ద ష్టికి తీసుకువెళ్లడం ద్వారా బాధ్యులైన సర్వీసు ప్రొవైడర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు భారీగా పెనాల్టీలు విధించడం, అవసరమైతే లెసైన్సులు రద్దు చేసే దిశలో పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
బురఖా వేసుకుని చోరీలు
హైదరాబాద్ : నగరంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా ఓ దొంగ బురఖా వేసుకుని చోరీలు చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం నాంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 44 తులాల బంగారంతోపాటు రూ. 19500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
‘టైమ్’ దాటితే జైలుకే..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగం నిర్దేశించిన సమయానికి మించి...అర్థరాత్రి దాటిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై సిటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పదేపదే ఈ తరహాలో చేస్తూ రికార్డుల్లోకి ఎక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వ్యాపారులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధికి చెందిన ఇద్దరు వ్యాపారులకు న్యాయస్థానం బుధవారం మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు వ్యాపారుల్నీ బైండోవర్ చేసింది. భవిష్యత్తులోనూ చార్జ్షీట్ల దాఖలు కొనసాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సమయపాలన పాటించాలని డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట పెట్టీ కేసులతో సరి... శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో నగరంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి పోలీసు విభాగం సమయాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి కొత్వాల్ నిత్యం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు లెసైన్స్ నిబంధనల్లోనూ ఆ అంశాన్ని పొం దుపరుస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది వ్యాపారులు వీటిని బేఖాతరు చేస్తూ వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, పబ్బు లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాపారాలను గుర్తించే క్షేత్రస్థాయి పోలీసులు ప్రాథమికంగా సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం పెట్టీ కేసులు పెట్టి, జరిమానా విధిస్తున్నారు. ‘హద్దులు’ దాటికే అభియోగాలు... కొందరు వ్యాపారులపై ఈ పెట్టీ కేసులు, జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఫలితంగా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రావట్లేదు. వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తూ పదేపదే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వ్యాపారులకు చెక్ చెప్పడానికి పశ్చిమ మండల పోలీసులు కేసుల నమోదు ప్రారంభించారు. గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసి, గత చరిత్రతో సహా న్యాయస్థానంలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేసిన ఆరోపణపై (ఐపీసీ 188) సదరు వ్యాపారులకు జైలు విధిస్తున్నాయి. ఇద్దరికి మూడు రోజుల జైలు... బోరబండకు చెందిన మహ్మద్ ఆరిఫ్ సోమాజిగూడలో ఏ-1 రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి నిర్దేశిత సమయం దాటిన తర్వాతా వ్యాపారం చేస్తూ పంజగుట్ట పోలీసుల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది ఐదుసార్లు, ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు ఇలా చేస్తూ చిక్కి రూ.50 జరిమానా చెల్లించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆరిఫ్పై కేసు నమోదు చేసి పదో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆరిఫ్‌కు మూడు రోజుల సాధారణ జైలు, రూ.200 జరిమానా విధించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద బిస్మిల్లా ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకుడు నజీర్ సైతం ఇప్పటికే ఆరుసార్లు సమయం పాటించకుండా జరిమానా కట్టాడు. మంగళవారం సైతం పునరావృతం కావడంతో కోర్టు మూడు రోజుల సాధారణ జైలు, రూ.50 జరిమానా విధించింది. పక్కాగా కేసులు ‘నిర్దేశిత సమయం దాటి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం.36లో క్లబ్ ట్రినిటీ పబ్ నిర్వహిస్తున్న ఆర్.విజయ్, పియూష్ జైన్ల పైనా చార్జ్షీట్లు దాఖలు చేశాం. వీరిని బైండోవర్ చేసిన న్యాయస్థానం పునరావృతమైతే జైలుకు పంపిస్తానని స్పష్టం చేసింది. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తదితరాలు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉండాలి. ఆ సమయం దాటి జరుగుతున్న వ్యాపారాలపై నిఘా ఉంచాం. అలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలను ట్యాబ్స్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫొటోలు తీస్తున్నాం. వీటి ద్వారా ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం, పని చేస్తున్న సమయాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తున్నాం. యజమానులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం’ - ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్ డీసీపీ -
ట్రాఫిక్ పోలీసుల కృషి అభినందనీయం - హీరో సందీప్‌కిషన్
అబిడ్స్ : సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని సీని హీరో సందీప్ కిషన్ అన్నారు. శనివారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మీటర్ లేకుండా ఆటోలను నడుపుతున్న 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సందీప్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చొరవతో గతంలో కంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. నగరంలోని రోడ్లపై వాహనం నడిపే సమయంలో బ్రేక్ వే యాలంటేనే భయపడతానన్నారు. మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు అండగా తమవంతుగా వలంటీర్‌గా వాహనదారులకు అవగాహన కల్పిస్తానన్నారు. ప్రముఖ సినీ కెమెరామెన్ చోటా కె. నాయుడు మాట్లాడుతూ... మనిషి ప్రాణం ఎంతో విలువైందని మద్యం తాగి వాహనం నడిపి తల్లిదండ్రులకు అప్రతిష్టపాలు చేయవద్దన్నారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషికి తనవంతుగా ట్రాఫిక్‌పై ఫిల్మ్ డాక్యుమెంటరీని తీస్తానన్నారు. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ...ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్, ఓవర్ లోడింగ్, స్పీడ్ డ్రైవ్ వంటివి పూర్తిగా తగ్గాయన్నారు. వాహనచోదకులలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టామన్నారు. నగరంలో 48 లక్షల వాహనాలు ఉండగా అందులో 25 లక్షల వాహనదారులకే డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉన్నాయన్నారు. ఇప్పటికే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నందున లక్షా ముప్పైవేల కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటి వరకు 100 ఆటోలను సీజ్ చేశామన్నారు. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, టీటీఐ రిజర్డ్వ్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హయత్‌నగర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : హయత్‌నగర్ కిడ్నాప్ కేసును నగర పోలీసులు మంగళవారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కిడ్నాపర్లు మహేశ్, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు నవీన్‌ను కిడ్నాప్ చేసేందుకు మహేశ్ రూ. లక్ష సుపారీ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మహేశ్‌కు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నవీన్ కిడ్నాప్‌కు యత్నించారని పోలీసులు వెల్లడించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. -
త్రినేత్రం
‘వెహికల్ మౌంట్ కెమెరాల’తో నేరాలకు చెక్ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేకంగా ఐదు వాహనాలు ట్యాంక్‌బండ్‌పై పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ సాక్షి, సిటీబ్యూరో: నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న నగర పోలీసులు మరో ముందడుగు వేశారు. ‘వెహికల్ మౌంట్ కెమెరాల’తో నేరాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం ఐదు వెహికల్ మౌంట్ కెమెరాలు సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో ఉన్న 20 కెమెరాలు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్ పింట్ జూమ్‌తో పాటు 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ పని చేసే ఈ కెమెరాలు అన్ని దృశ్యాలను ‘కవర్’ చేస్తాయి. వాహనానికి పక్కకు, వెనుకకు కూడా ఒక్కో కెమెరా ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల పరిధిలో తన పనితనాన్ని ‘చూపిస్తుంది’. లోపల ఉన్న స్క్రీన్ పై వీటిని చూసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించవచ్చు. వీటిలోని దృశ్యాలు 15 రోజుల పాటు నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఉంది. ఇలా పర్యవేక్షించడం వల్ల అప్రమత్తమై... గొడవలు, ఘర్షణలను నిరోధించవచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ వాహనాలతో పెట్రోలింగ్ వల్ల నేరాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ‘దశల వారీగా నగరంలో ఉన్న 120 వాహనాలకు వంటెడ్ కెమెరాలను అవుర్చి నేరాలు అదుపు చేస్తాం. ఇప్పటికే బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు గణనాథులు నిమజ్జనానికి వచ్చే మార్గంలో నాలుగు వందలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. వీటన్నింటిని సీపీ కార్యాయలంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించాం. ఆధునిక సాంకేతికతతో ఎక్కడ ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పర్యవేక్షి స్తున్నామ’ని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్కంట్రోల్ రూమ్‌తో పాటు ఐదు వెహికల్ మౌంట్ కెమెరాలను శనివారం ఆయన ప్రారంభించారు. జోన్‌కు ఒకటి చొప్పున వాహనాలను కేటాయించామన్నారు. జోన్ల డీసీపీలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ వాహనాలు నడిపేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర శాంతి భద్రతల అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా పాల్గొన్నారు. -
నగరంలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంపై పోలీసులు డేగ కన్ను ఉంచారు. అందులో భాగంగా అనుమానం ఉన్న చోట్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్, స్కూళ్లపై ప్రధానంగా దృష్టిని నిలిపి అప్రమత్తమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. -
హెల్మెట్.. ఇక తప్పనిసరి
నేటినుంచి ధరించాలని సర్కారు ఆదేశం వేచిచూసే ధోరణిలో నగర పోలీసులు కొత్త సీపీ వచ్చిన తర్వాతే నిర్ణయం విజయవాడ సిటీ: ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన హెల్మెట్ల ధారణ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనచోదకులందరూ విధిగా హెల్మెట్లు ధరించి తీరాలని గురువారం నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్.కృష్ణారావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. రాష్ట్రంలో నానాటికీ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వేర్వేరు కారణాలపై జరిగే హత్యల కంటే రెట్టింపు స్థాయిలో రోడ్డు ప్రమాద మృతులు ఉంటున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది. తొలుత జూలై ఒకటో తేదీ నుంచే అమలుచేయనున్నట్టు మూడు నెలల కిందట ప్రకటించారు. వాహనచోదకుల సంఖ్యకు అనుగుణంగా హెల్మెట్లు లేకపోవడం, ప్రజల్లో వీటి ధారణపై అవగాహన కొరవడడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలుచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వేచిచూద్దాం.. పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు బదిలీ, పుష్కర విధుల నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. జూలైలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధారణపై దృష్టిసారించాలని పోలీసు అధికారులు భావించారు. ఈలోగా సీపీ బదిలీ, పుష్కరాలు వచ్చాయి. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు వంటి విధులతో పోలీసులు తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అమలుచేయడం ఇబ్బందేనని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఈ-చలానాలతో పోలీసులపై వ్యతిరేకత నెలకొంది. తిరిగి హెల్మెట్ అంటూ వెంటపడితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పోలీసుల అభిప్రాయం. ప్రజల వ్యతిరేకత పెరిగితే ప్రభుత్వం తిరిగి తమనే బాధ్యులను చేస్తుందనేది వీరి వాదన. వీటన్నింటిని అధిగమించి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలంటే కొత్త పోలీసు కమిషనర్ వచ్చే వరకు వేచిచూడడమే మంచిదని నిర్ణయించారు. నాసిరకం హెల్మెట్లు ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే సమాచారంతో నాసిరకం హెల్మెట్లు మార్కెట్లోకి వ్యాపారులు దించినట్టు చెబుతున్నారు. నగరంలో నాలుగు లక్షల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు పోలీసు లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరికి సరిపడా హెల్మెట్లు లేవు. కొన్ని షాపుల్లో బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. నాణ్యత కలిగిన హెల్మెట్లు తగిన సంఖ్యలో లేకపోవడంతో వాహనదారులు వీటిని కొనేందుకు ఇష్టపడటం లేదు. గతంలో రూ.200కి దొరికిన హెల్మెట్‌ను ఇప్పుడు రూ.500కు విక్రయిస్తున్నారు. అదేమంటే స్టాకులేదని చెబుతున్నట్టు వాహనచోదకుల వాదన. కారణాలేమైనప్పటికీ శనివారం నుంచి హెల్మెట్ల వాడకం సాధ్యపడదని పోలీసులు అంటున్నారు. కొత్త సీపీ వచ్చిన తర్వాత తగిన సమయం తీసుకొని అమలుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పోలీసుల ఊగిసలాట నిబంధనల అమలులో కీలక పాత్ర పోషించే పోలీసు శాఖ మాత్రం ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. కొత్త పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా వెళ్లాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. దీనికి రవాణాశాఖ ఓకే చెబుతుంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపే పోలీసు శాఖ మాత్రం ఊగిసలాటలో ఉంది. -
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు
⇒ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బందోబస్తులోనే.. ⇒ ఉగ్రదాడుల నేపథ్యంలోతీవ్ర బందోబస్తు.. వారాంతపు సెలవులూ బంద్ ⇒ మానసిక ఒత్తిడికి గురవుతున్న రక్షక భటులు సాక్షి, ముంబై: ఇండియన్ ప్రెమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ల నగర పోలీసుల మీదకొచ్చి పడింది. క్రికెట్ స్టేడియాల వద్ద మధ్యాహ్నం నుంచి బందోబస్తులో ఉంటున్న పోలీసులు అర్ధరాత్రి దాటాక కూడా ఇళ్లకు వెళ్లలేక పోతున్నారు. ఇప్పటికే ముంబైకి అత్యంత సమస్యాత్మక నగరంగా పేరు ఉంది. ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ఉగ్రవాదుల దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నగరానికి రక్షణ ఇవ్వడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ముంబైలోని వాంఖడే, బ్రబార్న్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే అదనపు పని భారంతో సతమతమవుతున్న పోలీసులు బందోబస్తుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. వేసవి సెలవుల్లో అందరూ ఆనందంగా గడుపుతోంటే, తమకు కనీసం వారంతపు సెలవులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు క్రికెట్ మ్యాచ్ ఉంటే .. 12 గంటల నుంచే బందోబస్తుకు వెళ్లాలి. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఉంటే మధ్యాహ్నం 3 గంటలకే రిపోర్టు చేయాలి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 10 మంది పోలీసులు ఉండాల్సిన చోట 50 మందిని నియమిస్తున్నారు. ఎర్రని ఎండలో బందోబస్తు ఉండే పోలీసుల వెతలు వర్ణనాతీతం. అర్ధరాత్రి మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ప్రేక్షకులందరూ వెళ్లిపోయేదాకా బందోబస్తు ఉండాలి. అనంతరం తమ కార్యాలయాలకు వెళ్లి వారి సీనియర్ అధికారులకు నివేదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలి. ఉదయం యథాతథంగా విధులకు హాజరు కావలి. దీంతో సమయానికి భోజనం, తగినంత నిద్ర, విశ్రాంతి లేక నరకయాతన పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల సెలవులు మంజూరు కావడం లేదు. కొన్ని వారాలపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మూడు నెలల్లో 26 మంది.. పనుల ఒత్తిడి వల్ల జనవరి 1 నుంచి మార్చి 31 వరకు (మూడు నెలల్లో) ముంబై పోలీసు శాఖకు చెందిన సుమారు 26 మంది కానిస్టేబుళ్లు వృుత్యువాత పడ్డారు. సమయానికి భోజనం, విశ్రాంతి లేకపోవడం, రక్తపోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి సమస్యలతో చనిపోయారు. 2014 లోనూ ఇదే పరిస్థితి. పోలీసు ఇన్స్పెక్టర్లు మొదలుకుని కానిస్టేబుల్ స్థాయి వరకు సుమారు 147 మంది దాకా చనిపోయారు. ఇందులో 41 పోలీసులు గుండెపోటుతో మృతి చెందినట్లు రికార్డులున్నాయి. రోజురోజుకు పోలీసుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిం చేందుకు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో వాటిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమలు చేయాలనుకుంటున్నవి జరిగితే పోలీసులపై ఒత్తిడి కొంత మేరకైనా తగ్గే అవకాశాలున్నాయి. -
'ఉల్లంఘిస్తే అరెస్ట్‌లు తప్పవు'
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించొద్దంటూ టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. కాగా ఈ పాదయాత్రకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. తాము అనుమతి కోరిన పోలీసులు నిరాకరించారంటూ టీ పీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రలో పాల్గొనే నేతలు, కార్యకర్తలను తరలించేందుకు పోలీసులు వాహనాలను సిద్ధం చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. అరెస్ట్‌లు తప్పవంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయా పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి... గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని భావించారు. పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరగా... వారు నిరాకరించారు.