సాక్షి హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సమగ్ర అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గుర్తిస్తున్నారు. తాజాగా చేపట్టిన అధ్యయనంలో గడిచిన మూడేళ్ల కాలంలో ట్రాఫిక్ జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2019– 21 మధ్య మొత్తం మృతుల్లో కనిష్టంగా 18.91 శాతం, గరిష్టంగా 21.14 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే మృత్యువాతపడ్డారని తేలింది. మొత్తమ్మీద 147 మంది ఈ ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్‌లోనే కన్నుమూశారు. ఈ అధ్యయనాల ఆధారంగా నిరోధానికి చర్యలు తీసుకుంటామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఉల్లంఘనలే ప్రధాన కారణం..
సిటీలోని పలు ప్రాంతాల్లో అనునిత్యం కనిపించే సీన్లు చూస్తే ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటారని స్పష్టమవుతోంది. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడం వంటివి చేస్తుంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే జంక్షన్లు, యూ టర్న్స్ వద్దా ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే వీరితో పాటు ఎదుటి వారి ప్రాణాల మీదకు తెస్తోందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే జంక్షన్లు, యూ టర్న్స్ మృత్యువాతపడిన వాళ్లల్లో ద్విచక్ర వాహనచోదకులది మొదటి స్థానం కాగా.. పాదచారులది రెండో స్థానం.
అధ్యయనంలో గుర్తించిన అంశాలివి...
- 2021లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా.. జంక్షన్ల వద్ద 48 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 279 మంది. ఇందులో రాత్రి వేళ 28 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 31 చోటు చేసుకున్నాయి.
- మృతుల్లో పాదచారులు 17 మంది, ద్విచక్ర వాహనచోదకులు 35 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. లంగర్‌హౌస్‌లోని ఆర్మీ గేట్ యూ టర్న్, బోయిన్‌పల్లి చౌరస్తా, డెయిరీ ఫామ్ టీ జంక్షన్, ఎంజే మార్కెట్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.
- 2020లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 31 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 254. రాత్రి వేళ 20 ప్రమా దాలు జరగ్గా, పగటి వేళ 19 చోటు చేసుకున్నా యి. మృతుల్లో పాదచారులు 12 మంది, ద్విచక్ర వాహనచోదకులు 26 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అమీర్‌పేట చౌరస్తా, నల్లగొండచౌ రస్తా, బాలమ్‌రాయి ఎక్స్ రోడ్స్, తాజ్‌మహల్ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.
- 2019లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 38 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 259 మంది. రాత్రి వేళ 22 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 27 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 25 మంది, ద్విచక్ర వాహనచోదకులు 19 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. చిలకలగూడ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.
పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం
హైదరాబాద్‌లోని జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. తాజా అధ్యయనం గుర్తించిన అంశాల ఆధారంగా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇతర విభాగాలతో కలిసి ఆయా చోట్ల క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహిస్తాం. వారి సహకారంతో అవసరమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు రోడ్ ఇంజినీరింగ్ వంటి చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.
– ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్
Comments
Please login to add a commentAdd a comment