Traffic Junction
-
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే అంతే! రెడ్ సిగ్నల్ పడిందో..
సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే.. ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి.. పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా. గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు హైదరాబాద్ 70,03,012 25,453 సైబరాబాద్ 53,50,724 34,746 రాచకొండ 22,64,225 8,121 -
జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’
సాక్షి హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సమగ్ర అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గుర్తిస్తున్నారు. తాజాగా చేపట్టిన అధ్యయనంలో గడిచిన మూడేళ్ల కాలంలో ట్రాఫిక్ జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2019– 21 మధ్య మొత్తం మృతుల్లో కనిష్టంగా 18.91 శాతం, గరిష్టంగా 21.14 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే మృత్యువాతపడ్డారని తేలింది. మొత్తమ్మీద 147 మంది ఈ ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్‌లోనే కన్నుమూశారు. ఈ అధ్యయనాల ఆధారంగా నిరోధానికి చర్యలు తీసుకుంటామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లంఘనలే ప్రధాన కారణం.. సిటీలోని పలు ప్రాంతాల్లో అనునిత్యం కనిపించే సీన్లు చూస్తే ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటారని స్పష్టమవుతోంది. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడం వంటివి చేస్తుంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే జంక్షన్లు, యూ టర్న్స్ వద్దా ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే వీరితో పాటు ఎదుటి వారి ప్రాణాల మీదకు తెస్తోందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే జంక్షన్లు, యూ టర్న్స్ మృత్యువాతపడిన వాళ్లల్లో ద్విచక్ర వాహనచోదకులది మొదటి స్థానం కాగా.. పాదచారులది రెండో స్థానం. అధ్యయనంలో గుర్తించిన అంశాలివి... 2021లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా.. జంక్షన్ల వద్ద 48 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 279 మంది. ఇందులో రాత్రి వేళ 28 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 31 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 17 మంది, ద్విచక్ర వాహనచోదకులు 35 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. లంగర్‌హౌస్‌లోని ఆర్మీ గేట్ యూ టర్న్, బోయిన్పల్లి చౌరస్తా, డెయిరీ ఫామ్ టీ జంక్షన్, ఎంజే మార్కెట్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 31 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 254. రాత్రి వేళ 20 ప్రమా దాలు జరగ్గా, పగటి వేళ 19 చోటు చేసుకున్నా యి. మృతుల్లో పాదచారులు 12 మంది, ద్విచక్ర వాహనచోదకులు 26 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అమీర్‌పేట చౌరస్తా, నల్లగొండచౌ రస్తా, బాలమ్రాయి ఎక్స్ రోడ్స్, తాజ్‌మహల్ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2019లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 38 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 259 మంది. రాత్రి వేళ 22 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 27 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 25 మంది, ద్విచక్ర వాహనచోదకులు 19 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. చిలకలగూడ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్‌లోని జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. తాజా అధ్యయనం గుర్తించిన అంశాల ఆధారంగా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇతర విభాగాలతో కలిసి ఆయా చోట్ల క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహిస్తాం. వారి సహకారంతో అవసరమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు రోడ్ ఇంజినీరింగ్ వంటి చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
యాచకులకు ‘గౌరవం’
‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ గౌరవ సదన్ల ఏర్పాటుకుసర్కార్ ప్రత్యేక దృష్టి యాచకుల విముక్తికి కార్యాచరణ స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే ఉపాధి కల్పించే అవకాశం సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అడుక్కునే వారుండకూడదని సర్కార్ భావిస్తోంది. ఆ వృత్తిని నిషేధించి అందులో ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేం దుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’లో భాగంగా నగరంలో భిక్షాటన చేసే వారిని గుర్తించి వారు ఆ వృత్తి నుంచి బయట పడేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం వారికి ‘గౌరవ్ సదన్’లో ఆశ్రయం కల్పించడంతోపాటు ఆసరాగా నిలవాలని చూస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికే ఓ దఫా యాచకులపై సర్వే చేపట్టింది. ఇప్పటివరకు 16 ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద 239 మంది యాచకులతో మాట్లాడి వివరాలు సేకరించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ సమాచారాన్ని జీహెచ్ఎంసీకి అందజేశారు. అయితే సమగ్ర సర్వే జరిపి ఆగస్టు 15లోగా తుది నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులకు సూచించారు. ఒకే పర్యాయంలో యాచకులు తమ మనోభావాల్ని వెల్లడించలేరనే భావనతో మూడు దఫాలుగా సర్వే చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. ఏయే ప్రాం తాల్లో యాచిస్తున్నారు..?, ఏయే పద్ధతుల్లో వృత్తి కొనసాగిస్తున్నారు..?, రోజుకు సగటు ఆదాయం ఎంత?, వారు చేస్తున్న ఖర్చు?, ప్రస్తుతం ఎక్కడ ఆశ్రయం పొందుతున్నా రు?, సంపాదనతో ఏం చేస్తున్నారు?, ఎలాం టి ఆసరా కోరుకుంటున్నారు..? తదితర వివరాలను తాజాగా చేపట్టే సర్వేలో రాబట్టనున్నారు. ఈ అంశంపై శనివారం ఏపీఐఐసీ వైస్ చైర్మన్ , ఎండీ జయేశ్‌రంజన్‌తో కలిసి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాచకుల పునరావాసం కోసం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా దిగువ కార్యక్రమాలు పూర్తిచేయాల్సిందిగా సూచించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యాచకుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్ల వివరాలు. ట్రాఫిక్ పోలీసుల నుంచి జంక్షన్ల వివరాలు సేకరించి యాచకుల బెడద ఎక్కువగా ఉన్న 100 ప్రాంతాలను గుర్తించాలి. ఆయా జంక్షన్లలోని యాచకుల పునరావాస బాధ్యతలను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం. అందుకోసం ముందు కు వచ్చే ఔత్సాహిక స్వచ్ఛంద సంస్థలకు ఆగస్టు ఒకటిన శిక్షణ కార్యక్రమం. ఒక్కో ట్రాఫిక్ జంక్షన్‌కు ఓ కౌన్సెలర్‌ను నియమించి.. అక్కడి యాచకుల వివరాలతో నివేదిక. యాచకుల ఫొటోతో సహా వ్యక్తిగత వివరాల సేకరణ. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15లోగా పూర్తిచేయాలి. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి తగిన గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం. వృద్ధులు, వికలాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను గుర్తించి.. యాచకుల్లోని వృద్ధు లు, వికలాంగులకు సేవలందించేందుకు భాగస్వాములు కావాల్సిందిగా ప్రకటనల ద్వారా కోరడం. యాచకులకు తగిన ఆశ్రయం కల్పించేం దుకు తొలిదశలో జోన్‌కు ఒకటి చొప్పున తగిన భవనాలను గుర్తించి.. వాటిని ‘గౌరవ్ సదన్’లుగా తీర్చిదిద్దడం. గౌరవ్ సదన్లలోకి తరలించే వారికి అవసరమైన ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెతోపాటు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉపాధి చూపించాలి. భిక్షాటనలో ఎన్నో వింతలు.. నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కన్పిస్తుంటారు. ఆలయాలు.. మసీదులు.. చర్చిలు, బస్టాప్‌లు, ట్రాఫిక్ సిగ్నళ్లు.. ఫుట్‌పాత్‌ల వద్ద వారు తప్పక ఉంటారు. ఇది కొందరికి కడుపు నింపుతుండగా మరికొందరికి ఉపాధి మార్గంగా మారింది. ఇందులో బాలలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కుగా కన్పిస్తుంటారు. ఇక వీరి సంపాదన విషయానికొస్తే రోజుకు రూ.200 నుంచి రూ.1,000 వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు మహిళలు పార్ట్‌టైమ్‌గా భిక్షాటన చేస్తూ మిగతా సమయంలో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో జంక్షన్ వద్ద ఒక్కోపూట యాచిస్తున్న వారూ ఉన్నారు. ఓ జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లేం దుకు ఆటోలున్న వారూ ఉన్నారు. యాచక వృత్తి నుంచి వారిని విముక్తి చేసేందుకు జీహెచ్ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద నిర్వహించిన తొలి దశ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఏ పనీ చేయలేని అశక్తులు, వికలాంగులతోపాటు పనులు చేయగల శక్తి కలిగిన వారూ ఉన్నారు. సీజన్‌ను బట్టి కొందరు ఆయా ప్రాంతాల్లో యాచిస్తుంటారు. పండుగలు.. ప్రాంతాలను బట్టి ‘డ్రెస్ కోడ్’ పాటిస్తుంటారు. సంపాదనలో ఒక పూట భోజనం కోసం మాత్రం డబ్బు ఖర్చుచేస్తున్నారు. పగటిపూట భోజనాన్ని అన్నదాన కేంద్రాల్లో చేస్తున్నారు. నగరంలో యాచకవృత్తి చేస్తున్నవారిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. వికారాబాద్, శంకర్పల్లి, కంది, షాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి రోజూ బస్సులు, ఆటోల్లో వచ్చి ఈ వృత్తి కొనసాగిస్తున్నారు. నగర శివార్లు, పొరుగు జిల్లాల నుంచే కాక అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చి యాచిస్తున్న వారు కూడా ఉన్నారు. సమీప జిల్లాల వారు ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం తిరిగి వెళ్తున్నారు. సీజన్లను బట్టి భిక్షాటన కోసం నగరానికి వచ్చేవారు. యాచకుల్లో ఓటరుకార్డులు కలిగిన వారి నుంచి వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నవారు. తాము సంపాదించే సొమ్మును కూడబెట్టి స్థానికుల వద్ద దాచుకుంటున్నారు. కొందరు స్వల్ప సమయాలకు తక్కువ రేటుకు వడ్డీలకు ఇస్తున్నారు. కొసమెరుపు: పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలపై తమకు నమ్మకం లేదంటున్నారు.