యాచకులకు ‘గౌరవం’ | Beggars 'honor' | Sakshi
Sakshi News home page

యాచకులకు ‘గౌరవం’

Published Sun, Jul 27 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

యాచకులకు ‘గౌరవం’

యాచకులకు ‘గౌరవం’

  •       ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’
  •      గౌరవ సదన్‌ల ఏర్పాటుకుసర్కార్ ప్రత్యేక దృష్టి
  •      యాచకుల విముక్తికి కార్యాచరణ
  •      స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే
  •      ఉపాధి కల్పించే అవకాశం
  •      సమీక్షించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అడుక్కునే వారుండకూడదని సర్కార్ భావిస్తోంది. ఆ వృత్తిని నిషేధించి అందులో ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేం దుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’లో భాగంగా నగరంలో భిక్షాటన చేసే వారిని గుర్తించి వారు ఆ వృత్తి నుంచి బయట పడేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం వారికి ‘గౌరవ్ సదన్’లో ఆశ్రయం కల్పించడంతోపాటు ఆసరాగా నిలవాలని చూస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికే ఓ దఫా యాచకులపై సర్వే చేపట్టింది.

    ఇప్పటివరకు 16 ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద 239 మంది యాచకులతో మాట్లాడి వివరాలు సేకరించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ సమాచారాన్ని జీహెచ్‌ఎంసీకి అందజేశారు. అయితే సమగ్ర సర్వే జరిపి ఆగస్టు 15లోగా తుది నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులకు సూచించారు. ఒకే పర్యాయంలో యాచకులు తమ మనోభావాల్ని వెల్లడించలేరనే భావనతో మూడు దఫాలుగా సర్వే చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు.

    ఏయే ప్రాం తాల్లో యాచిస్తున్నారు..?, ఏయే పద్ధతుల్లో వృత్తి కొనసాగిస్తున్నారు..?, రోజుకు సగటు ఆదాయం ఎంత?, వారు చేస్తున్న ఖర్చు?, ప్రస్తుతం ఎక్కడ  ఆశ్రయం పొందుతున్నా రు?, సంపాదనతో ఏం చేస్తున్నారు?, ఎలాం టి ఆసరా కోరుకుంటున్నారు..? తదితర వివరాలను తాజాగా చేపట్టే సర్వేలో రాబట్టనున్నారు. ఈ అంశంపై శనివారం ఏపీఐఐసీ వైస్ చైర్మన్ , ఎండీ జయేశ్‌రంజన్‌తో కలిసి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాచకుల పునరావాసం కోసం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా దిగువ కార్యక్రమాలు పూర్తిచేయాల్సిందిగా సూచించారు.
         
    ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యాచకుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్ల వివరాలు.
         
    ట్రాఫిక్ పోలీసుల నుంచి జంక్షన్ల వివరాలు సేకరించి యాచకుల బెడద ఎక్కువగా ఉన్న 100 ప్రాంతాలను గుర్తించాలి. ఆయా జంక్షన్లలోని యాచకుల పునరావాస బాధ్యతలను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం. అందుకోసం ముందు కు వచ్చే ఔత్సాహిక స్వచ్ఛంద సంస్థలకు ఆగస్టు ఒకటిన శిక్షణ కార్యక్రమం.
         
    ఒక్కో ట్రాఫిక్ జంక్షన్‌కు ఓ కౌన్సెలర్‌ను నియమించి.. అక్కడి యాచకుల వివరాలతో నివేదిక. యాచకుల ఫొటోతో సహా వ్యక్తిగత వివరాల సేకరణ. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15లోగా పూర్తిచేయాలి.
         
    యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి తగిన గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం.
         
    వృద్ధులు, వికలాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను గుర్తించి.. యాచకుల్లోని వృద్ధు లు, వికలాంగులకు సేవలందించేందుకు భాగస్వాములు కావాల్సిందిగా ప్రకటనల ద్వారా కోరడం.
         
    యాచకులకు తగిన ఆశ్రయం కల్పించేం దుకు తొలిదశలో జోన్‌కు ఒకటి చొప్పున తగిన భవనాలను గుర్తించి.. వాటిని ‘గౌరవ్ సదన్’లుగా తీర్చిదిద్దడం.
         
    గౌరవ్ సదన్‌లలోకి తరలించే వారికి అవసరమైన ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెతోపాటు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉపాధి చూపించాలి.
     
    భిక్షాటనలో ఎన్నో వింతలు..

    నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కన్పిస్తుంటారు. ఆలయాలు.. మసీదులు.. చర్చిలు, బస్టాప్‌లు, ట్రాఫిక్ సిగ్నళ్లు.. ఫుట్‌పాత్‌ల వద్ద వారు తప్పక ఉంటారు. ఇది కొందరికి కడుపు నింపుతుండగా మరికొందరికి ఉపాధి మార్గంగా మారింది. ఇందులో బాలలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కుగా కన్పిస్తుంటారు. ఇక వీరి సంపాదన విషయానికొస్తే రోజుకు రూ.200 నుంచి రూ.1,000 వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు మహిళలు పార్ట్‌టైమ్‌గా భిక్షాటన చేస్తూ మిగతా సమయంలో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో జంక్షన్ వద్ద ఒక్కోపూట యాచిస్తున్న వారూ ఉన్నారు. ఓ జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లేం దుకు ఆటోలున్న వారూ ఉన్నారు. యాచక వృత్తి నుంచి వారిని విముక్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద నిర్వహించిన తొలి దశ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
         
    ఏ పనీ చేయలేని అశక్తులు, వికలాంగులతోపాటు పనులు చేయగల శక్తి కలిగిన వారూ ఉన్నారు.
         
    సీజన్‌ను బట్టి కొందరు ఆయా ప్రాంతాల్లో యాచిస్తుంటారు. పండుగలు.. ప్రాంతాలను బట్టి ‘డ్రెస్ కోడ్’ పాటిస్తుంటారు.
         
    సంపాదనలో ఒక పూట భోజనం కోసం మాత్రం డబ్బు ఖర్చుచేస్తున్నారు. పగటిపూట భోజనాన్ని  అన్నదాన కేంద్రాల్లో చేస్తున్నారు.  
         
    నగరంలో యాచకవృత్తి చేస్తున్నవారిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. వికారాబాద్, శంకర్‌పల్లి, కంది, షాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి రోజూ బస్సులు, ఆటోల్లో వచ్చి ఈ వృత్తి కొనసాగిస్తున్నారు.  
         
    నగర శివార్లు, పొరుగు జిల్లాల నుంచే కాక అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చి యాచిస్తున్న వారు కూడా ఉన్నారు.
         
    సమీప జిల్లాల వారు ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం తిరిగి వెళ్తున్నారు.
         
    సీజన్లను బట్టి భిక్షాటన కోసం నగరానికి వచ్చేవారు.
         
    యాచకుల్లో ఓటరుకార్డులు కలిగిన వారి నుంచి వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నవారు.
         
    తాము సంపాదించే సొమ్మును కూడబెట్టి స్థానికుల వద్ద దాచుకుంటున్నారు. కొందరు స్వల్ప సమయాలకు తక్కువ రేటుకు వడ్డీలకు ఇస్తున్నారు.
         
    కొసమెరుపు: పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలపై తమకు నమ్మకం లేదంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement