సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు.
రెడ్ సిగ్నల్ పడగానే..
ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి..
పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా.
గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య
కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు
హైదరాబాద్ 70,03,012 25,453
సైబరాబాద్ 53,50,724 34,746
రాచకొండ 22,64,225 8,121
Comments
Please login to add a commentAdd a comment