‘టైమ్’ దాటితే జైలుకే.. | After 1clock bussiness then case to jail | Sakshi
Sakshi News home page

‘టైమ్’ దాటితే జైలుకే..

Published Thu, Apr 14 2016 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

‘టైమ్’ దాటితే జైలుకే..

‘టైమ్’ దాటితే జైలుకే..

సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగం నిర్దేశించిన సమయానికి మించి...అర్థరాత్రి దాటిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై సిటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పదేపదే ఈ తరహాలో చేస్తూ రికార్డుల్లోకి ఎక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వ్యాపారులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధికి చెందిన ఇద్దరు వ్యాపారులకు న్యాయస్థానం బుధవారం మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు వ్యాపారుల్నీ బైండోవర్ చేసింది.

భవిష్యత్తులోనూ చార్జ్‌షీట్ల దాఖలు కొనసాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సమయపాలన పాటించాలని డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
 
మొదట పెట్టీ కేసులతో సరి...
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో నగరంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి పోలీసు విభాగం సమయాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి కొత్వాల్ నిత్యం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు లెసైన్స్ నిబంధనల్లోనూ ఆ అంశాన్ని పొం దుపరుస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది వ్యాపారులు వీటిని బేఖాతరు చేస్తూ వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, పబ్బు లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాపారాలను గుర్తించే క్షేత్రస్థాయి పోలీసులు ప్రాథమికంగా సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం పెట్టీ కేసులు పెట్టి, జరిమానా విధిస్తున్నారు.
 
‘హద్దులు’ దాటికే అభియోగాలు...
కొందరు వ్యాపారులపై ఈ పెట్టీ కేసులు, జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఫలితంగా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రావట్లేదు. వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తూ పదేపదే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వ్యాపారులకు చెక్ చెప్పడానికి పశ్చిమ మండల పోలీసులు కేసుల నమోదు ప్రారంభించారు. గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు.

వీటి ఆధారంగా కేసు నమోదు చేసి, గత చరిత్రతో సహా న్యాయస్థానంలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేసిన ఆరోపణపై (ఐపీసీ 188) సదరు వ్యాపారులకు జైలు విధిస్తున్నాయి.
 
ఇద్దరికి మూడు రోజుల జైలు...
బోరబండకు చెందిన మహ్మద్ ఆరిఫ్ సోమాజిగూడలో ఏ-1 రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి నిర్దేశిత సమయం దాటిన తర్వాతా వ్యాపారం చేస్తూ పంజగుట్ట పోలీసుల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది ఐదుసార్లు, ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు ఇలా చేస్తూ చిక్కి రూ.50 జరిమానా చెల్లించాడు.

దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆరిఫ్‌పై కేసు నమోదు చేసి పదో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆరిఫ్‌కు మూడు రోజుల సాధారణ జైలు, రూ.200 జరిమానా విధించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద బిస్మిల్లా ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వాహకుడు నజీర్ సైతం ఇప్పటికే ఆరుసార్లు సమయం పాటించకుండా జరిమానా కట్టాడు. మంగళవారం సైతం పునరావృతం కావడంతో కోర్టు మూడు రోజుల సాధారణ జైలు, రూ.50 జరిమానా విధించింది.
 
పక్కాగా కేసులు
‘నిర్దేశిత సమయం దాటి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం.36లో క్లబ్ ట్రినిటీ పబ్ నిర్వహిస్తున్న ఆర్.విజయ్, పియూష్ జైన్ల పైనా చార్జ్‌షీట్లు దాఖలు చేశాం. వీరిని బైండోవర్ చేసిన న్యాయస్థానం పునరావృతమైతే జైలుకు పంపిస్తానని స్పష్టం చేసింది. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తదితరాలు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉండాలి.

ఆ సమయం దాటి జరుగుతున్న వ్యాపారాలపై నిఘా ఉంచాం. అలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలను ట్యాబ్స్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫొటోలు తీస్తున్నాం. వీటి ద్వారా ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం, పని చేస్తున్న సమయాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తున్నాం. యజమానులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం’
 - ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్ డీసీపీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement