Baindovar
-
మహిళ బైండోవర్
నంగునూరు: నాటుసార తయారు చేస్తున్నారనే సమాచారంతో శనివారం దాడులు నిర్వహించి మహిళను తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామని రాజగోపాల్‌పేట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. సీతరాంపల్లి తండాకు చెందిన లౌడ్య లక్ష్మి తన వ్యవసాయ బావి వద్ద సారా తయారు చేస్తోందనే సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 లీటర్ల బెల్లం పాకం లభిచడంతో ఆమెను తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. సీఆర్పీ సెక్షన్ 110 కింద మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రౌడీ షీటర్లపై పోలీసు కన్ను
సాక్షి, సిటీబ్యూరో: ‘నేరస్తుల సమగ్ర సర్వే’ చిట్టాతో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసులు అసాంఘిక శక్తులు, షీటర్లపై నిఘా పెట్టారు. గణేశ్ ఉత్సవాలు, బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించిన పోలీసులు ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ఆ సర్వే వివరాలతో నేరగాళ్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క క్లిక్‌తో ఆయా ఠాణాల పరిధిల్లోని నేరగాళ్ల వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుండటంతో వారిని ఠాణాకు పిలిపించి మరీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ యాప్‌ను ప్రారంభించకపోయినా అంతర్గత సేవల కోసం తాత్కాలికంగా తొలిసారిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, వెస్ట్ పోలీస్ కమిషనర్ నవీన్ చంద్ ఆయా కమిషనరేట్లలోని పోలీసు సిబ్బందితో గణేశ్ ఉత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అసాంఘిక శక్తులు, షీటర్ల గురించి చర్చకు వచ్చింది. వారిని నియంత్రిస్తే దాదాపు సగానికన్నా ఎక్కువ టెన్షన్ తగ్గినట్టేనన్న కమిషనర్ల ఆదేశాల మేరకు కిందిస్థాయి సిబ్బంది ఆయా ఠాణాల పరిధిలో ఉన్న షీటర్లను పిలిపించి మాట్లాడుతున్నారు. గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ పండుగ సమయాల్లో అల్లర్లు సృష్టించే అవకాశమున్న వారిని బైండోవర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 3,117 మందిపై కన్ను... అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజులకుపైగా చేపట్టిన సమగ్ర నేరస్తుల సర్వేలో దాదాపు ఐదువేల మందికిపైగా నేరగాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 3,117 మంది స్థానికంగా ఉంటుండగా, మిగిలిన వారు ఇక్కడ దొంగతనాలు చేసి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు తేల్చారు. ఆ సర్వేలో సేకరించిన వీరిందరి వివరాలు, ఫొటోలతో పోలీసు సిబ్బంది కోసం రెడీ చేసిన సైబ్ కాప్ యాప్‌ను తాత్కాలికంగా పోలీసులు వినియోగిస్తున్నారు. సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్‌లో 1,248 మందిపై రౌడీషీట్లు, 416 మందిపై సస్పెక్ట్ షీట్లు, 1,214 మందిపై కేడీ షీట్లు, 239 మందిపై సీడీసీ షీట్లు ఉన్నాయి. ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు అసాంఘిక శక్తులు, షీటర్లపై కన్నేసి ఉంచారు. అలాగే వినాయకచవితి, బక్రీద్ల కోసం స్థానిక పోలీసు సిబ్బందినే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని తెచ్చే ప్రయత్నాల్లో కమిషనర్లు ఉన్నారు. -
నలుగురు ఉపాధ్యాయుల బైండోవర్
గండేడ్: బోగస్ ఉపాధ్యాయుల విషయమై సమాచార హక్కుచట్టం కింద సమాచారాన్ని కోరిన విషయంలో తనపై కేసులు నమోదు చేయించి తనను జైలుపాలు చేశారని మహమ్మదాబాద్ గ్రామస్తుడు గోపాల్ ఫిర్యాదు మేరకు గండేడ్ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను మంగళవారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొండారెడ్డి, పాండునాయక్, వెంకట్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌ను గండేడ్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచామని ఆయన చెప్పారు. గోపాల్‌కు ఎలాంటి హాని జరిగినా సదరు ఉపాధ్యాయులే బాధ్యులవుతారని ఎస్ఐ వివరించారు. -
12 మందిపై బైండోవర్
బంట్వారం: పాత నేరస్తులు 12 మందిని గురువారం తహశీల్దార్ మారుతీ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. జిన్నారం, తొర్మామిడి గ్రామాలకు చెందిన వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడటంవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరందరిని హెచ్చరించి వదిలేశామని చెప్పారు. మండల పరిధిలోని పాత నేరస్తులందరిపై నిఘా పెట్టినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. -
‘టైమ్’ దాటితే జైలుకే..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగం నిర్దేశించిన సమయానికి మించి...అర్థరాత్రి దాటిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై సిటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పదేపదే ఈ తరహాలో చేస్తూ రికార్డుల్లోకి ఎక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వ్యాపారులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధికి చెందిన ఇద్దరు వ్యాపారులకు న్యాయస్థానం బుధవారం మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు వ్యాపారుల్నీ బైండోవర్ చేసింది. భవిష్యత్తులోనూ చార్జ్షీట్ల దాఖలు కొనసాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సమయపాలన పాటించాలని డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట పెట్టీ కేసులతో సరి... శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో నగరంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి పోలీసు విభాగం సమయాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి కొత్వాల్ నిత్యం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు లెసైన్స్ నిబంధనల్లోనూ ఆ అంశాన్ని పొం దుపరుస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది వ్యాపారులు వీటిని బేఖాతరు చేస్తూ వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, పబ్బు లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాపారాలను గుర్తించే క్షేత్రస్థాయి పోలీసులు ప్రాథమికంగా సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం పెట్టీ కేసులు పెట్టి, జరిమానా విధిస్తున్నారు. ‘హద్దులు’ దాటికే అభియోగాలు... కొందరు వ్యాపారులపై ఈ పెట్టీ కేసులు, జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఫలితంగా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రావట్లేదు. వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తూ పదేపదే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వ్యాపారులకు చెక్ చెప్పడానికి పశ్చిమ మండల పోలీసులు కేసుల నమోదు ప్రారంభించారు. గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసి, గత చరిత్రతో సహా న్యాయస్థానంలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేసిన ఆరోపణపై (ఐపీసీ 188) సదరు వ్యాపారులకు జైలు విధిస్తున్నాయి. ఇద్దరికి మూడు రోజుల జైలు... బోరబండకు చెందిన మహ్మద్ ఆరిఫ్ సోమాజిగూడలో ఏ-1 రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి నిర్దేశిత సమయం దాటిన తర్వాతా వ్యాపారం చేస్తూ పంజగుట్ట పోలీసుల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది ఐదుసార్లు, ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు ఇలా చేస్తూ చిక్కి రూ.50 జరిమానా చెల్లించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆరిఫ్పై కేసు నమోదు చేసి పదో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆరిఫ్‌కు మూడు రోజుల సాధారణ జైలు, రూ.200 జరిమానా విధించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద బిస్మిల్లా ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకుడు నజీర్ సైతం ఇప్పటికే ఆరుసార్లు సమయం పాటించకుండా జరిమానా కట్టాడు. మంగళవారం సైతం పునరావృతం కావడంతో కోర్టు మూడు రోజుల సాధారణ జైలు, రూ.50 జరిమానా విధించింది. పక్కాగా కేసులు ‘నిర్దేశిత సమయం దాటి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం.36లో క్లబ్ ట్రినిటీ పబ్ నిర్వహిస్తున్న ఆర్.విజయ్, పియూష్ జైన్ల పైనా చార్జ్షీట్లు దాఖలు చేశాం. వీరిని బైండోవర్ చేసిన న్యాయస్థానం పునరావృతమైతే జైలుకు పంపిస్తానని స్పష్టం చేసింది. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తదితరాలు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉండాలి. ఆ సమయం దాటి జరుగుతున్న వ్యాపారాలపై నిఘా ఉంచాం. అలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలను ట్యాబ్స్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫొటోలు తీస్తున్నాం. వీటి ద్వారా ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం, పని చేస్తున్న సమయాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తున్నాం. యజమానులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం’ - ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్ డీసీపీ