3,117 మంది షీటర్లపై పోలీసు కన్ను
Published Tue, Aug 30 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
సాక్షి, సిటీబ్యూరో: ‘నేరస్తుల సమగ్ర సర్వే’ చిట్టాతో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసులు అసాంఘిక శక్తులు, షీటర్లపై నిఘా పెట్టారు. గణేశ్ ఉత్సవాలు, బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించిన పోలీసులు ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ఆ సర్వే వివరాలతో నేరగాళ్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క క్లిక్‌తో ఆయా ఠాణాల పరిధిల్లోని నేరగాళ్ల వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుండటంతో వారిని ఠాణాకు పిలిపించి మరీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ యాప్‌ను ప్రారంభించకపోయినా అంతర్గత సేవల కోసం తాత్కాలికంగా తొలిసారిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, వెస్ట్ పోలీస్ కమిషనర్ నవీన్ చంద్ ఆయా కమిషనరేట్లలోని పోలీసు సిబ్బందితో గణేశ్ ఉత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అసాంఘిక శక్తులు, షీటర్ల గురించి చర్చకు వచ్చింది. వారిని నియంత్రిస్తే దాదాపు సగానికన్నా ఎక్కువ టెన్షన్ తగ్గినట్టేనన్న కమిషనర్ల ఆదేశాల మేరకు కిందిస్థాయి సిబ్బంది ఆయా ఠాణాల పరిధిలో ఉన్న షీటర్లను పిలిపించి మాట్లాడుతున్నారు. గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ పండుగ సమయాల్లో అల్లర్లు సృష్టించే అవకాశమున్న వారిని బైండోవర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
3,117 మందిపై కన్ను...
అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజులకుపైగా చేపట్టిన సమగ్ర నేరస్తుల సర్వేలో దాదాపు ఐదువేల మందికిపైగా నేరగాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 3,117 మంది స్థానికంగా ఉంటుండగా, మిగిలిన వారు ఇక్కడ దొంగతనాలు చేసి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు తేల్చారు. ఆ సర్వేలో సేకరించిన వీరిందరి వివరాలు, ఫొటోలతో పోలీసు సిబ్బంది కోసం రెడీ చేసిన సైబ్ కాప్ యాప్‌ను తాత్కాలికంగా పోలీసులు వినియోగిస్తున్నారు. సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్‌లో 1,248 మందిపై రౌడీషీట్లు, 416 మందిపై సస్పెక్ట్ షీట్‌లు, 1,214 మందిపై కేడీ షీట్‌లు, 239 మందిపై సీడీసీ షీట్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు అసాంఘిక శక్తులు, షీటర్లపై కన్నేసి ఉంచారు. అలాగే వినాయకచవితి, బక్రీద్‌ల కోసం స్థానిక పోలీసు సిబ్బందినే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని తెచ్చే ప్రయత్నాల్లో కమిషనర్లు ఉన్నారు.
Advertisement
Advertisement