గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టీకరణ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.
రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు...
డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.
స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులు
ఎఫ్‌అండ్‌వో ట్రేడ్ చాలా పెద్ద అంశం
సెబీ చైర్‌పర్సన్ మాధవిపురి
ఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్‌లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్‌లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్‌పర్సన్ చెప్పారు.
ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్‌ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment