ముంబై: యూపీఐ, రూపేలను ‘‘వాస్తవరీతిన విశ్వ వ్యాపితం’’గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్న కీలక అంశాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో గవర్నర్ మాట్లాడుతూ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పురోగతికి, వినియోగదారుల రక్షణ, సైబర్ భద్రత, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక సేవల ప్రపంచ ఏకీకరణ అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అనేక దేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ వేదికల ఏర్పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ నిమగ్నమై ఉందని అన్నారు. డేటా గోప్యత ఆందోళన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశ్వసనీయ ఏఐ‘ అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, అలాగే ఆర్థిక రంగ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా దాస్ ఉద్ఘాటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
→ సరిహద్దు చెల్లింపు వ్యవస్థలతో సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆర్‌బీఐ కీలక లక్ష్యాలుగా ఉన్నాయి.
→ భారతదేశానికి సాంకేతిక ప్రతిభ, అభివృద్ధి చెందిన ఆర్థిక ఫిన్‌టెక్ వ్యవస్థల బలం ఉంది. తద్వారా డిజిటల్ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ సహకారానికి నిబద్దతతో పనిచేయడం, ఎక్సలెన్స్ సంస్థలను అభివృద్ధి చేయడం వంటి వాటికి గ్లోబల్ హబ్‌గా ఉండే సామర్థ్యాన్ని దేశం సముపార్జించింది.
→ భూటాన్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), మారిషస్, నమీబియా, పెరూ, ఫ్రాన్స్‌సహా కొన్ని ఇతర దేశాలతో రుపే కార్డ్‌ల అంగీకారం, యూపీఐ నెట్‌వర్క్ ద్వారా చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.
డిజిటల్ ట్రాన్స్ బోర్డర్ చెల్లింపులతో అక్రమాలకు చెక్
– ఫెడ్ అధికారి క్రిస్టోఫర్ జే వాలర్
ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు క్రిస్టోఫర్ జే వాలెర్ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ, డిజిటల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులతో అక్రమ ధనార్జన, టెర్రర్ ఫండింగ్ కట్టడి సాధ్యమవుతాయని అన్నారు. ట్రాన్స్–బోర్డర్ డిజిటల్ లావాదేవీల సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఆర్‌బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఫెడ్ అధికారి కూడా దీనికి వోటువేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment