Rupay
-
రూపే క్రెడిట్ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు
రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కార్డ్ హోల్డర్లకు విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్లలో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి.“ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్‌లో రూపే ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, పానీయాలు, వినోదాలను అందిస్తుంది" అని ఎన్పీసీఐ పేర్కొంది.నూతన మార్గదర్శకాల ప్రకారం, రూపే క్రెడిట్‌కార్డు యూజర్లకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేసే వ్యయం ఆధారంగా నిర్ణయించారు. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!ఇటీవల పలు విమానాశ్రయ లాంజ్‌లు రూపే కార్డులను స్వీకరించడం ప్రారంభించాయి. యూపీఐలో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన తర్వాత రూపే కార్డ్‌ల జారీ పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3లో రూపే తన మొదటి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. -
యూపీఐ, రూపే ‘విశ్వవ్యాప్త’మే ధ్యేయం
ముంబై: యూపీఐ, రూపేలను ‘‘వాస్తవరీతిన విశ్వ వ్యాపితం’’గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్న కీలక అంశాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో గవర్నర్ మాట్లాడుతూ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పురోగతికి, వినియోగదారుల రక్షణ, సైబర్ భద్రత, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక సేవల ప్రపంచ ఏకీకరణ అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అనేక దేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ వేదికల ఏర్పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ నిమగ్నమై ఉందని అన్నారు. డేటా గోప్యత ఆందోళన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశ్వసనీయ ఏఐ‘ అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, అలాగే ఆర్థిక రంగ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా దాస్ ఉద్ఘాటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... → సరిహద్దు చెల్లింపు వ్యవస్థలతో సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆర్బీఐ కీలక లక్ష్యాలుగా ఉన్నాయి. → భారతదేశానికి సాంకేతిక ప్రతిభ, అభివృద్ధి చెందిన ఆర్థిక ఫిన్‌టెక్ వ్యవస్థల బలం ఉంది. తద్వారా డిజిటల్ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ సహకారానికి నిబద్దతతో పనిచేయడం, ఎక్సలెన్స్ సంస్థలను అభివృద్ధి చేయడం వంటి వాటికి గ్లోబల్ హబ్‌గా ఉండే సామర్థ్యాన్ని దేశం సముపార్జించింది. → భూటాన్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), మారిషస్, నమీబియా, పెరూ, ఫ్రాన్స్‌సహా కొన్ని ఇతర దేశాలతో రుపే కార్డ్‌ల అంగీకారం, యూపీఐ నెట్వర్క్ ద్వారా చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ బోర్డర్ చెల్లింపులతో అక్రమాలకు చెక్ – ఫెడ్ అధికారి క్రిస్టోఫర్ జే వాలర్ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు క్రిస్టోఫర్ జే వాలెర్ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ, డిజిటల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులతో అక్రమ ధనార్జన, టెర్రర్ ఫండింగ్ కట్టడి సాధ్యమవుతాయని అన్నారు. ట్రాన్స్–బోర్డర్ డిజిటల్ లావాదేవీల సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఫెడ్ అధికారి కూడా దీనికి వోటువేయడం గమనార్హం. -
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలు తగ్గింపు
రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.గత ఏడాది బడ్జెట్లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?బడ్జెట్లో కేంద్రం విడుదల చేసే డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక నిధులు ఫిన్‌టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
కోచి: భారత్‌లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. భారత్ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంతో విజయవంతమైంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అందుకే పలు దేశాలు ఈ సాధనం విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ విజన్ 2025 కింద.. ప్రతి ఒక్కరికీ ఈ–చెల్లింపులు, ఎక్కడైనా, ఎప్పుడైనా (4ఈలు) అనే ముఖ్యమైన థీమ్‌కు కట్టుబడి ఉన్నాం. మన చెల్లింపుల ఉత్పత్తులను అంతర్జాతీయం చేసేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు మన దేశానికి కొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఏడాది జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. కనుక అంతర్జాతీయంగా అందరి దృష్టికీ మన విజయవంతమైన స్టోరీని తీసుకెళ్లాలి’’అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం అంతర్జాతీయ వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానత పెరుగుతోందన్నారు. సీమాంతర చెల్లింపులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని.. మన యూపీఐ, రూపే నెట్వర్క్ స్థానం అంతర్జాతీయంగా విస్తరిస్తోందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో మన చెల్లింపులు, స్వీకరణ లావాదేవీలు మరింత సులభంగా, చౌకగా, వేగంగా జరిగేందుకు వీలు పడుతుందన్నారు. యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ చెల్లింపులు ప్రస్తుతం భూటాన్, సింగపూర్, యూఏఈలో అందుబాటులోకి రావడం గమనార్హం. ఈ విషయంలో మనం ఎంతో సాధించామని, రానున్న రోజుల్లో మరింత చేయాల్సి ఉందని శక్తికాంతదాస్ అన్నారు. వైఫల్యాలపై దృష్టి సారించాలి.. ‘‘విజయవంతం కాని ప్రతీ లావాదేవీ, మోసపూరిత ప్రయత్నాలనేవి కొనసాగితే, ప్రతి ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించకపోతే అది ఆందోళనకరమైన అంశమే అవుతుంది. అప్పుడు మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దేశంలో ఎవరూ కూడా డిజిటల్ చెల్లింపులకు వెలుపల ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శక్తికాంతదాస్ అన్నారు. -
యూపీఐలో కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన రూపే క్రిడెట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పరిధిలోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కస్టమర్లందరూ తమ యాక్టివ్ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు. ఖాతా ఆధారిత యూపీఐ లావాదేవీల తరహాలోనే కార్డ్‌ని భౌతికంగా వినియోగించకుండానే చెల్లింపులు జరపవచ్చు. పీఓఎస్ మెషీన్లు లేని వ్యాపారులు యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్ల నుంచి చెల్లింపులు పొందవచ్చు. దీనివల్ల చిన్న వ్యాపారులు తక్కువ ఖర్చుతో విక్రయాల టర్నోవర్‌ను, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. -
పేటీఎం రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసిందిగా! కార్డు లేకుండానే..
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత ‘రూపే క్రెడిట్ కార్డ్’ను విడుదల చేసింది. కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఏర్పడుతుందని తెలిపింది. వినియోగదారులకు ఉత్తమ సదుపాయాలను అందించాలన్న లక్ష్యంలో భాగమే రూపే క్రెడిట్ కార్డ్ అని కంపెనీ అభివర్ణించింది. (ఇదీ చదండి : RBI Policy review: రెపో రేటు పెంపు) రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకున్న యూపీఐ ఐడీ ద్వారా లావాదేవీలు సజావుగా, ఆఫ్‌లైన్ , ఆన్లైన్ చెల్లింపులు రెండూ వేగంగా మారుతాయని కంపెనీ వెల్లడించింది. తమ కస్టమర్లకు చెల్లింపులను మరింత సులభం చేసేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ సేవలు ప్రారంభించామని పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ సురీందర్ చావ్లా తెలిపారు. (ఐకియా గుడ్‌న్యూస్: ధరలు తగ్గాయోచ్!) -
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్: ఫోన్‌ఫే కో-ఫౌండర్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 2022లో నిర్వహించిన అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ దేశీయ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. 8వ ఫ్రాంచైజీ- ముంబై మీటార్స్‌ను ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు. అలాగే భారత వాలీబాల్ టీమ్ మాజీ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారని ఫోన్‌పే ఫౌండర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ క్రీడాకారుడిగా వాలీబాల్ ఆట ఆనందం గురించి తనకు తెలుసునని రూపే పీవీఎల్ తమకు ఖచ్చితమైన అవకాశాన్ని ప్రొఫెషనల్ మార్గంలో ప్రపంచశ్రేణి స్ధాయిలో నిర్మించే అవకాశం అందిస్తుందని భావిస్తున్నామంటూ కోఫౌండర్ సమీర్ నిగమ్ సంతోషం వెలిబుచ్చారు. భారతీయ క్రీడా వ్యవస్థ అత్యంత ఉత్సాహ పూరిత మైందనీ, ముఖ్యంగా క్రికెటేతర రంగంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న రంగంలో తగిన తోడ్పాటునందించేందుకు రూపే పీవీఎల్ తమకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మరో కో ఫౌండర్ రాహూల్ చారి తెలిపారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన కార్పోరేట్ లీడర్లు సమీర్, రాహుల్‌లు ఫ్రాంచైజీ యజమానులుగా చేరడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ముంబై ఫ్రాంచైజీ యజమానులును స్వాగతించిన థామస్ ముత్తూట్, యజమాని, కొచి బ్లూ స్పైకర్స్ మాట్లాడుతూ వారి వ్యాపార అనుభవం, ఈ క్రీడ పట్ల అభిరుచి రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు తోడ్పడుతుందనిపేర్కొన్నారు. రెండో సీజన్ 2023 సంవత్సరారంభంలో ప్రారంభమవుతుందని అంచనా. వాలీబాల్ అంతర్జాతీయ సంస్ధ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ వాలీబాల్, ఎఫ్‌ఐవీబీ)కు వాణిజ్య విభాగం, వాలీబాల్ వరల్డ్ ఇప్పుడు పీవీఎల్‌తో చేతులు కలపడంతో పాటుగా పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్ట్రీమింగ్ భాగస్వామిగా వ్యవహరించనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. ఈ లీగ్‌కు మొత్తం 133 మిలియన్ల టెలివిజన్ వ్యూయర్షిప్ ఉంది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలలో కామెంట్రీ ఎంచుకునే అవకాశమూ అందించింది. -
IPL 2022: ఐపీఎల్ భాగస్వామిగా ‘రూపే’.. మూడేళ్లకు ఒప్పందం
IPL 2022 New Sponsor Rupay: నానాటికి పెరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్ దృష్ట్యా.. క్యాష్ రిచ్ లీగ్‌తో జతకట్టేందుకు బడా కార్పొరేట్ సంస్థలు ఎగబడుతున్నాయి. ఇప్పటికే టాటా, డ్రీమ్ 11, అన్ అకాడమీ, క్రెడ్, అప్‌స్టాక్స్, స్విగ్గీ ఇన్స్టంట్, పేటీఎం, సియట్ వంటి కార్పొరేట్లు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) ఐపీఎల్‌తో చేతులు కలిపింది. రూపే మూడేళ్ల పాటు ఐపీఎల్‌కు అఫిషియల్ పార్ట్నర్గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా కథనాల ప్రకారం రూపే ఏడాదికి రూ. 42 కోట్లకు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందంతో ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరగనుంది. కాగా, మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ నుంచి ‘టాటా’ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఐపీఎల్ 2022 సెంట్రల్ స్పాన్సర్స్ : - టాటా : టైటిల్ స్పాన్సర్ - డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్ - అన్ అకాడమీ : అఫిషియల్ పార్ట్నర్ - క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్ - అప్‌స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్ - స్విగ్గీ ఇన్స్టంట్ : అఫిషియల్ పార్ట్నర్ - పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్ - సియట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్ - రూపే : అఫిషియల్ పార్ట్నర్ చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..!
Visa Complains To US Govt About India Backing For Local Rival Rupay: అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ వీసా తన ప్రత్యర్థి రూపేపై కుతంత్రాలకు పాల్పడుతోంది. భారత్‌లో వీసాను రూపే భారీగా దెబ్బతీస్తోందని అమెరికన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. రూపేపై భారత్ చేస్తున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని వీసా తన ఫిర్యాదులో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కారణం ఇదే..! దేశీయ చెల్లింపుల రూపేకి భారత ప్రభుత్వం "అనధికారిక, అధికారికంగా" ప్రచారం చేస్తోందని వీసా తన ఫిర్యాదులో పేర్కొంది. భారత ప్రభుత్వం రూపే డెబిట్ కార్డులపై భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వీసా పేర్కొంది. రూపేకు భారత్‌లో భారీ ఆదరణ వస్తోండడంతో వీసా ఓర్వడం లేదు. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా రూపేకు మద్దతు వస్తోందని వీసా అమెరికా ప్రభుత్వానికి తన ఫిర్యాదులో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్ధానిక కార్డుల వినియోగాన్ని ఏకంగా జాతీయ సేవతో పోల్చరాన్ని వీసా అమెరికా ప్రభుత్వానికి దాఖలు చేసిన మెమోలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. లాభాపేక్షలేని సంస్థ రూపే..! ఇతర దేశీయ , విదేశీ ఎలక్ట్రానిక్ చెల్లింపుల కంపెనీల కంటే రూపేను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (NPCI) ఏలాంటి లాభాపేక్షలేకుండా నడుపుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో వీసా, మాస్టర్‌కార్డ్‌లకు సవాలుగా మారడంతో ప్రధాని మోదీ స్వదేశీ రూపే కార్డును ప్రోత్సహించారు. దీంతో రూపే కార్డుపై భారీ ఎత్తున ఆదరణ లభించింది. నవంబర్ 2020 నాటికి భారత్‌లోని 952 మిలియన్ల డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లలో రూపే 63 శాతం వాటాను కలిగి ఉంది. గతంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ "రూపే కార్డును మాత్రమే" బ్యాంకులు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రజా రవాణా చెల్లింపుల కోసం ప్రభుత్వం రూపే ఆధారిత కార్డును కూడా ప్రమోట్ చేసింది. భారత్‌లో మార్కెట్ లీడర్ మేమే..! ఈ ఏడాది మేలో రూపే లాంటి సంస్థలు వీసాకు సమస్యాత్యకంగా మారే అవకాశం ఉందని వీసా ఎగ్జిక్యూటివ్ అధికారి అల్ప్రెడ్ కెల్లీ వెల్లడించారు. అయితే వీసానే భారత మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుందని కెల్లీ చెప్పారు. అంతకుముందు మాస్టర్‌కార్డ్ కూడా..! భారత్‌పై ఫిర్యాదు చేసిన వాటిలో వీసా ఒక్కటే కాదు. అంతకుముందు 2018లో మరో ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ మాస్టర్ కార్డ్ కూడా యూఎస్ ప్రభుత్వానికి మెమోలను దాఖలు చేసింది. స్వదేశీ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ జాతీయవాదాన్ని ఉపయోగిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌తో ఫిర్యాదు చేసింది. 2018 నిబంధనలకు అనుగుణంగా లేదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో మాస్టర్ కార్డ్ భారత్‌లో కొత్త కార్డ్‌లను జారీ చేయడంపై నిరవధిక నిషేధాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్టీఆర్ అధికారి మాస్టర్‌కార్డ్ నిషేధాన్ని "క్రూరమైన చర్య" అని పిలిచారు. చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే.. -
భూటాన్ విశ్వసనీయ పొరుగుదేశం
పారో/థింపూ: భూటాన్ భారత్‌కు ఎప్పుడూ విశ్వసనీయ పొరుగుదేశమేనని ప్రధాని మోదీ చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ శనివారం భూటాన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్, మంత్రివర్గ సభ్యులతో కలసి మోదీకి పారాలోని విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తర్వాత ఇరువురు ప్రధానులు కలసి పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. అనేక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా చర్చలు కొనసాగించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ‘భూటాన్ అభివృద్ధిలో భారత్ ప్రధాన భాగస్వామి కావడం ఒక విశేషం. భూటాన్ పంచవర్ష ప్రణాళికలలో భారత్ సహకారం ఇకపైన కూడా కొనసాగుతుంది’ అని మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్యారంగానికి సంబంధించి ఇరు దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ దేశ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌తో కూడా భేటీ అయ్యారు. రూపే కార్డును ప్రారంభించిన మోదీ భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం ఇస్రో సహాయంతో అభివృద్ధి చేసిన గ్రౌండ్ ఎర్త్ స్టేషన్, సాట్కామ్ నెట్‌వర్క్‌ను మోదీ, షెరింగ్ కలిసి ప్రారంభించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భూటాన్ అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. సిమ్తోఖా జొంగ్ వద్ద భూటాన్‌లో రూపే పే కార్డును మోదీ ప్రారంభించారు. ‘భూటాన్‌లో రూపే పే కార్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధానం డిజిటల్ చెల్లింపులు, వాణిజ్యం, పర్యాటక రంగంలో ఇరుదేశాల సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. మాంగ్దేచు జలవిద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, ఐదు దశాబ్దాల భారత–భూటాన్ జలవిద్యుత్ సహకారాన్ని గుర్తుచేసే స్టాంపులను కూడా విడుదలచేశారు. మోదీ ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని థింపూకి వెళ్తున్నప్పుడు ప్రజలు త్రివర్ణ పతాకాలు ఊపుతూ దారిపొడవునా మోదీకి స్వాగతంపలికారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
రూ.1,590కు కోటి గెల్చుకున్న లక్కీ గాళ్
నాగపూర్:కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన అవార్డులను ప్రదానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అందించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ నాగపూర్‌లో ఈ బహుమతులకు విజేతలకు అందజేసారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన్ కింద లాతూర్‌కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినిని అదృష్ట లక్ష్మి వరించింది. మొబైల్ ఈఎంఐ పేమెంట్‌ను ఆన్లైన్లో చెల్లించి కోటి రూపాయలు దక్కించుకుంది. రూపే యాప్ ద్వారా రూ.1,590 డిజిటల్ లావాదేవీలు జరిపినందుకు శ్రద్ధ మోహన్ (20) కోటి రూపాయలను సొంతం చేసుకుంది. రెండవ బహుమతిగా రూ. 50లక్షల నగదు బహుమతి గుజరాత్‌కు చెందిన హార్దిక్ కుమార్ (29)ని వరించింది. ప్రైమరీ స్కూలు టీచర్ అయిన ఇతను రుపే కార్డు ద్వారా రూ.1110 ఆన్ లైన్ లావాదేవీ నిర్వహించారు. డిజి ధన్ వ్యాపార యోజన కింద మొదటి బహుమతిగా రూ. 50లక్షలను తమిళనాడులోని తాంబరానికి చెందిన జీఆర్టీ జ్యువెల్లరీ వ్యాపారి ఆనంద్ అనంత పద్మనాభన్ గెలుచుకున్నారు. రూ.300 పేమెంట్‌ను ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. ఈ కేటగిరీలో రెండవ బహుమతి రూ. 25లక్షలను మహారాష్ట్రలోని బ్యూటీ పార్లర్ యజమాని రాగిణి రాజేంద్ర ఉత్తేకర్ అందుకున్నారు. తన బ్యూటీ సేవలకు గాను ఈమె రూ.510 స్వీకరించారు. కాగా డిజిటల్ లావాదేవీలను ఊతమిచ్చే దిశగా నీతి ఆయోగ్ గత ఏడాది డిశెంబర్ లో లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన పేరుతో ఈ క్యాష్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా16లక్షలమందికి రూ. 258కోట్ల ప్రైజ్‌మనీ అందించారు. వీరిలో కస్టమర్లు, వ్యాపారులు ఉన్నారు. -
రూపేకార్డుల పంపిణీకి చర్యలు
ఆలూరు: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఖాతాదారులందరికీ రూపేకార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ డీజీఎం సునిల్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగిల్ విండో సహకార పరపతి సంఘ ఽకార్యాలయంలో కర్షక జ్యోతి ఫైనాన్ష్యల్ ఆర్గనైజర్ బసవరాజ్ ఆధ్వర్యంలో బుధవారం రూపేకార్డులతో నగదు బదిలీలను చేసుకునే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునిల్‌కుమార్ రైతులు, చిరువ్యాపారులు, ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్‌లో ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు కొనసాగించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 1.50లక్షల రూపే కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో స్థానిక కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రమేష్, జిల్లా అధికారి శాస్త్రీ, జనజ్యోతి ఫైనాన్షియల్ కౌన్సిల్ సభ్యుడు రామూర్తి, ఆలూరు సహకార సింగిల్ విండో సీఈఓ వెంకటరెడ్డి, డైరెక్టర్లు హనుమంతు, అనిల్, స్వామి పాల్గొన్నారు. -
పొదుపు మహిళలందరికీ రూపే కార్డులు
కర్నూలు(హాస్పిటల్): నగదు కొరత నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ రూపే కార్డులు యాక్టివేట్ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వెలుగు సీఈఓ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలో ఎంత మంది పొదుపు మహిళలకు జనధన్ఖాతాలున్నాయి, ఎంత మందికి ఎస్బీ అకౌంట్లున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. జనధన్ ఉన్న వారికి రూపే కార్డులున్నాయా..?, ఉంటే ఎన్ని యాక్టివ్‌లో ఉన్నాయి, యాక్టివ్‌లో లేని వాటికి ఎలా అమలులోకి తీసుకురావాలనే విషయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనధన్ ఖాతా లేని వారికి సాధారణ ఏటీఎంలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 4లక్షలకు పైగా పొదుపు మహిళలు ఉన్నారు. వీరందరికీ ఒకటో తేది నాటికి రూపే, ఏటీఎం కార్డులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
జన ధన ఖాతాలకు 3 వారాల్లోగా రుపే కార్డ్‌ల జారీ
ముంబై: జన ధన పథకంకింద బ్యాంకులు గత వారం చివరికి 4 కోట్ల ఖాతాలను తెరిచినప్పటికీ రుపే కార్డ్‌ల జారీ ఆలస్యమవుతోంది. ఒక్కసారిగా కోట్లకొద్దీ ఖాతా లు ఓపెన్ కావడంతో కార్డ్‌ల జారీకి సమయం పడుతుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఎండీ ఏపీ హొటా చెప్పారు. జన ధన పథకం ద్వారా ప్రారంభమైన కొత్త ఖాతాలకు ఏటీఎం కార్డ్‌లను ఎన్పీసీఐ జారీ చేస్తోంది. ఇప్పటి వరకూ 20 లక్షల రుపే కార్డ్‌లను జారీ చేసినట్లు హొటా చెప్పారు. అయితే ఒక్కసారిగా ఇన్ని ఖాతాలను ఎవరూ అంచనా వేయలేదని, మూడు వారాల్లోగా కార్డ్‌ల జారీని పూర్తి చే సే అవకాశమున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఆగస్ట్ 28న జన ధన పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. పథకంలో భాగంగా ఖాతాదారులకు రూ. 5,000 వరకూ రుణ సదుపాయం(ఓవర్‌డ్రాఫ్ట్), రుపే డెబిట్ కార్డ్, రూ. లక్ష విలువచేసే బీమా రక్షణ లభిస్తాయి.