జన ధన ఖాతాలకు 3 వారాల్లోగా రుపే కార్డ్‌ల జారీ
ముంబై: జన ధన పథకంకింద బ్యాంకులు గత వారం చివరికి 4 కోట్ల ఖాతాలను తెరిచినప్పటికీ రుపే కార్డ్‌ల జారీ ఆలస్యమవుతోంది. ఒక్కసారిగా కోట్లకొద్దీ ఖాతా లు ఓపెన్ కావడంతో కార్డ్‌ల జారీకి సమయం పడుతుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఎండీ ఏపీ హొటా చెప్పారు. జన ధన పథకం ద్వారా ప్రారంభమైన కొత్త ఖాతాలకు ఏటీఎం కార్డ్‌లను ఎన్‌పీసీఐ జారీ చేస్తోంది.
ఇప్పటి వరకూ 20 లక్షల రుపే కార్డ్‌లను జారీ చేసినట్లు హొటా చెప్పారు. అయితే ఒక్కసారిగా ఇన్ని ఖాతాలను ఎవరూ అంచనా వేయలేదని, మూడు వారాల్లోగా కార్డ్‌ల జారీని పూర్తి చే సే అవకాశమున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఆగస్ట్ 28న జన ధన పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. పథకంలో భాగంగా ఖాతాదారులకు రూ. 5,000 వరకూ రుణ సదుపాయం(ఓవర్‌డ్రాఫ్ట్), రుపే డెబిట్ కార్డ్, రూ. లక్ష విలువచేసే బీమా రక్షణ లభిస్తాయి.