జాతీయంగా సగటున 94.6% మందికే..
బ్యాంకు అకౌంట్లలో మూడో స్థానంలో రాష్ట్రం
గ్రామాల్లోనే అత్యధిక ఖాతాలు
సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే, 2022–23లో వెల్లడి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండిన వారిలో 98 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జాతీయ సగటును మించి ఏపీలో బ్యాంకు అకౌంట్లు ఉండటం విశేషం. జాతీయంగా సగటున 94.6 శాతం మందికే బ్యాంకు ఖాతాలున్నాయి. సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే–2022–23 వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది.
వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళల్లో ఎంత మందికి వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఖాతాలున్నాయో సర్వే వెల్లడించింది. అత్యధికంగా బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో కర్ణాటక, ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. అత్యల్పంగా బ్యాంకు ఖాతాలు మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్‌లో ఉన్నట్టు సర్వే పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కొద్దిపాటి తేడాతో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల్లో కలిపి పురుషులకు 98.1 శాతం బ్యాంకు ఖాతాలుండగా, మహిళలకు 97.9 శాతం ఉన్నాయి. ఇదే జాతీయ సగటున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పురుషులకు 96.2 శాతం ఉండగా, మహిళలకు 92.8 శాతం బ్యాంకు ఖాతాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment