న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప.. తాము పేటీఎంకి వ్యతిరేకమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.
ఫిన్‌టెక్ రంగానికి ఆర్‌బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉందని, పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు.‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీపీబీఎల్‌పై చర్యలు తీసుకున్నాం.
కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్‌ఏక్యూలను జారీ చేస్తాం‘ అని ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. ఇవి ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్థిక పరిస్థితులపై సమీక్ష..
ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి పెడుతున్న అంశాలను వివరించారు. ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment