Corporate Banking
-
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
‘కార్పొరేట్’ బ్యాంకులకు సై..!
ముంబై: దేశంలో అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది. స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒకటి ప్రతిపాదించింది. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. పటిష్ట నిఘా ఇక్కడ కీలకాంశమని స్పష్టం చేసింది. అంతర్గతంగా గ్రూప్ సంస్థలకు రుణాలు, పరస్పర ప్రయోజనాలకు విఘాతాలు వంటి పలు అంశాల నేపథ్యంలో ఒక భారీ స్థాయి కార్పొరేట్ సంస్థకు పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేయడానికి ఆర్బీఐ ఇప్పటివరకూ వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాను ప్రస్తుత 15% నుంచి 26%కి పెంచవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు 15 సంవత్సరాల కాల వ్యవధిని సూచించింది. దీనివల్ల పెయిడ్ అప్ క్యాపిటల్‌కు సంబంధించి ఓటింగ్ హక్కులు పెరుగుతాయి. భారత ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించి కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీ క్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. బ్యాంకులుగా పెద్ద ఎన్బీఎఫ్సీలు: రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 ఏళ్లకు పైగా చక్కటి నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ సూచించింది. కార్పొరేట్లు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఎన్‌బీఎఫ్‌సీలకు మరికొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించాలని సిఫారసు చేసింది. ఆదిత్య బిర్లా, బజాజ్, మహీంద్రా, టాటా గ్రూపులు ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎన్బీఎఫ్సీలను నిర్వహిస్తున్నాయి. నిజానికి దేశంలో మధ్య మధ్య స్థాయి బ్యాంకులకన్నా ఈ ఎన్బీఎఫ్సీలు పెద్దవి కావడం గమనార్హం. కనీస ప్రారంభ మూలధనం పెంపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కనీస ప్రారంభ మూలధన్నాన్ని పెంచాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. బ్యాంకుల విషయంలో ఈ మొత్తాలను రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు... అలాగే చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని పేర్కొంది. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ వాటా... మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రైవేటు రంగం వాటా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2000లో మొత్తం బిజినెస్‌లో ప్రైవేటు రంగం వాటా డిపాజిట్లకు సంబంధించి 12.63 శాతం ఉంటే, రుణాల విషయంలో ఈ రేటు 12.56 శాతంగా ఉండేదని వివరించింది. 2020లో ఈ శాతాలు వరుసగా 30.35 శాతం, 36.04 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులకు కోల్పోతున్నాయని తెలిపింది. మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లే దీనికి కారణమని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగానికి మూలధనం కూడా పెద్ద సమస్యగా ఉండడం లేదని తెలిపింది. గడచిన ఐదేళ్లలో మార్కెట్ నుంచి ప్రైవేటు బ్యాంకులు రూ.1,15,328 కోట్లు సమీకరించగలిగితే, ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఈ మొత్తం రూ.70,823 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందుకు అదనంగా ప్రభుత్వం నుంచి రూ.3,18,997 కోట్ల మూలధనం అందినట్లు వివరించింది. బ్యాంకింగ్ రంగంలో మార్పు! మొత్తంగా పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాలెన్స్ షీట్ల పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆరేడు బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే 3–4 బడా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడమో లేక, వాటి ఎన్బీఎఫ్సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడమో చేస్తే అవి మరింత పోటీని ఇస్తాయి. దేశంలో పలు మధ్య తరహా బ్యాంకులకన్నా పెద్దవిగా మారతాయి. పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు తలెత్తితే అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం పడుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం, ఆర్బీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు దివాలా తీయడం తెలిసిందే. -
ఆకర్షణీయంగా ఆటోమొబైల్, కార్పొరేట్ బ్యాంకులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్, కార్పొరేట్ బ్యాంకులు, పటిష్టమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఫార్మా, టెలికం సంస్థలు ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈవో జార్జి హెబర్ జోసెఫ్ తెలిపారు. పదేళ్ల వ్యవధిలో రియల్టీ కూడా మంచి రాబడులు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు అధిక వేల్యుయేషన్స్ ఉన్న ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ స్టేపుల్స్ వంటి రంగాల సంస్థలకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. స్మాల్ క్యాప్ సంస్థల విషయంలో బులి‹Ùగా ఉన్నట్లు జోసెఫ్ చెప్పారు. స్మాల్ క్యాప్ ఫండ్ ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి వచ్చిన పక్షంలో వచ్చే ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 200 కోట్లుగా ఉందన్నారు. 13 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 25కి పెంచుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజి ఫండ్‌ను ప్రారంభించినట్లు జోసెఫ్ తెలిపారు. ఇది డిసెంబర్ 23తో ముగుస్తుంది. సందర్భానుసారంగా ఈక్విటీ, డెట్ సాధనాల్లోకి ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ ప్రత్యేకతని జోసెఫ్ చెప్పారు. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
తెనాలి సబ్‌ట్రెజరీలో నిధుల గోల్ మాల్
► ట్రెజరీ ఉద్యోగి చేతివాటం ►ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా సొంత ఖాతాల్లోకి.. ► రూ.20.34 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం తెనాలి రూరల్ : తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయానికి సంబంధించిన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లినట్టు తెలుస్తోంది. కార్యాలయ ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తన సొంత ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్టు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు రూ.20.34 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తుండగా, కోటి రూపాయల వరకు ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల చెల్లింపు సబ్ ట్రెజరీల ద్వారా చేస్తారని తెలిసిందే. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు జిల్లా ట్రెజరీకి, అక్కడి నుంచి సబ్ ట్రెజరీ ద్వారా లావాదేవీలు జరుగుతుంటాయి. గతంలో వేతనాలకు సంబంధించి బిల్లులు చేసి, వాటిని సబ్‌ట్రెజరీ ఉద్యోగులు బ్యాంకులకు పంపే వారు. ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నగదు లావాదేవీలను కంప్యూటరీకరించి, సునాయాసంగా నగదు బదిలీ కోసం కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ పేరిట ప్రభుత్వం సబ్ ట్రెజరీలకు అకౌంట్లు తెరచింది. వీటికి సంబంధించిన పాస్వర్డ్లు సంబంధిత ఉద్యోగికి, కార్యాలయ అధికారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి నగదును సంబంధిత బ్యాంకులకు బదిలీ చేస్తారు. అనంతరం ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను బ్యాంకులు జమ చేస్తాయి. దారి మళ్లించిందిలా.. వరుణ్‌బాబు తండ్రి సబ్ ట్రెజరీ అధికారిగా పని చేస్తూ మరణించగా, కాంపెన్సేటివ్ గ్రౌండ్స్ కింద అదే శాఖలో ఉద్యోగం లభించింది. ఇంకా పర్మినెంట్ కాలేదని తెలిసింది. దీంతో పాటు అతనికి కొద్ది మేర కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండటంతో కార్పొరేట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా ప్రభుత్వోద్యోగుల వేతనాల నిధుల బదిలీ చేసే బాధ్యతను అప్పగించారు. తన నేర్పరితనాన్ని ప్రయోగించాడు. ప్రభుత్వోద్యోగుల వేతనాలకు సంబంధించి సబ్ ట్రెజరీల్లో టోకెన్లు కేటాయిస్తారు. ఆ టోకెన్ సంఖ్య ప్రకారం బ్యాంకులు వేతనాలను ఖాతాల్లోకి జమ చేస్తాయి. ఈ విధానంలో టోకెన్ నంబర్లను నకిలీ చెక్కులకు జోడించి బ్యాంకులకు పంపి, సదరు ఖాతాల్లోని నిధులను వరుణ్‌బాబు తన, తన తమ్ముడి ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని సమాచారం. బయటపడిందిలా.. వేతనాల నిధులకు సంబంధించి చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండడాన్ని సాధారణ పరిశీలనలో ట్రెజరీ అధికారులు గుర్తించారు. అప్పుడప్పుడు కొద్దిపాటి వ్యత్యాసాలు రావడం సహజమేనంటూ తేలికగా తీసుకున్నారు. పరిశీలన కొనసాగిస్తుండగా, ఏప్రిల్, మే నెలల్లో రూ.20,34,000 నిధులు దారిమళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరుపుతున్నారు. సుమారు రూ.కోటి వరకు గోల్మాల్ అయ్యుంటాయని భావిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు..? పెద్ద మొత్తంలో నిధులు గోల్మాల్ అవడంతో ఖంగుతిన్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయన్న దానిపై స్పష్టత రాలేదు. నిందితుడు వరుణ్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ‘వరుణ్‌బాబు నిధులు దారి మళ్లించినట్టు ఆదివారమే గుర్తించామని, పరిశీలిస్తున్నాం’ అని అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కె.వెంకటేశ్వర్లు తెలిపారు. నిధుల గోల్‌మాల్‌పై ఆడిట్ జరుగుతోందని గుంటూరు ఖజానా కార్యాలయం ఉపసంచాలకుడు కె.సురేంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు రూ.34 లక్షలు అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు అందలేదని, నిధులు దారిమళ్లినట్టు సమాచారం ఉందని వన్‌టౌన్ సీఐ బి.శ్రీనివాసరావు చెప్పారు.