తెనాలి సబ్‌ట్రెజరీలో నిధుల గోల్ మాల్ | Tenali sub- Treasury funds goal Mall | Sakshi
Sakshi News home page

తెనాలి సబ్‌ట్రెజరీలో నిధుల గోల్ మాల్

Published Tue, Jun 21 2016 8:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

తెనాలి సబ్‌ట్రెజరీలో నిధుల గోల్ మాల్

తెనాలి సబ్‌ట్రెజరీలో నిధుల గోల్ మాల్

ట్రెజరీ ఉద్యోగి చేతివాటం
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా సొంత ఖాతాల్లోకి..  
రూ.20.34 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం

 
తెనాలి రూరల్ :  తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయానికి సంబంధించిన ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లినట్టు తెలుస్తోంది. కార్యాలయ ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తన సొంత ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్టు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు రూ.20.34 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తుండగా, కోటి రూపాయల వరకు ఉంటుందనే వాదన వినిపిస్తోంది.  ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల చెల్లింపు సబ్ ట్రెజరీల ద్వారా చేస్తారని తెలిసిందే. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు జిల్లా ట్రెజరీకి, అక్కడి నుంచి సబ్ ట్రెజరీ ద్వారా లావాదేవీలు జరుగుతుంటాయి.


గతంలో వేతనాలకు సంబంధించి బిల్లులు చేసి, వాటిని సబ్‌ట్రెజరీ ఉద్యోగులు బ్యాంకులకు పంపే వారు.  ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నగదు లావాదేవీలను కంప్యూటరీకరించి, సునాయాసంగా నగదు బదిలీ కోసం కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ పేరిట ప్రభుత్వం సబ్ ట్రెజరీలకు అకౌంట్లు తెరచింది. వీటికి సంబంధించిన పాస్‌వర్డ్‌లు సంబంధిత ఉద్యోగికి, కార్యాలయ అధికారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి నగదును సంబంధిత బ్యాంకులకు బదిలీ చేస్తారు. అనంతరం ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను బ్యాంకులు జమ చేస్తాయి.


 దారి మళ్లించిందిలా..
 వరుణ్‌బాబు తండ్రి సబ్ ట్రెజరీ అధికారిగా పని చేస్తూ మరణించగా, కాంపెన్సేటివ్ గ్రౌండ్స్ కింద అదే శాఖలో ఉద్యోగం లభించింది. ఇంకా పర్మినెంట్ కాలేదని తెలిసింది. దీంతో పాటు అతనికి కొద్ది మేర కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండటంతో కార్పొరేట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా ప్రభుత్వోద్యోగుల వేతనాల నిధుల బదిలీ చేసే బాధ్యతను అప్పగించారు. తన నేర్పరితనాన్ని ప్రయోగించాడు. ప్రభుత్వోద్యోగుల వేతనాలకు సంబంధించి సబ్ ట్రెజరీల్లో టోకెన్‌లు కేటాయిస్తారు. ఆ టోకెన్ సంఖ్య ప్రకారం బ్యాంకులు వేతనాలను ఖాతాల్లోకి జమ చేస్తాయి. ఈ విధానంలో టోకెన్ నంబర్లను నకిలీ చెక్కులకు జోడించి బ్యాంకులకు పంపి, సదరు ఖాతాల్లోని నిధులను వరుణ్‌బాబు తన, తన తమ్ముడి ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని సమాచారం.

బయటపడిందిలా..
 వేతనాల నిధులకు సంబంధించి చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండడాన్ని సాధారణ పరిశీలనలో ట్రెజరీ అధికారులు గుర్తించారు. అప్పుడప్పుడు కొద్దిపాటి వ్యత్యాసాలు రావడం సహజమేనంటూ తేలికగా తీసుకున్నారు. పరిశీలన కొనసాగిస్తుండగా, ఏప్రిల్, మే నెలల్లో రూ.20,34,000 నిధులు దారిమళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరుపుతున్నారు. సుమారు రూ.కోటి వరకు గోల్‌మాల్ అయ్యుంటాయని భావిస్తున్నారు.


 పోలీసుల అదుపులో నిందితుడు..?
 పెద్ద మొత్తంలో నిధులు గోల్‌మాల్ అవడంతో ఖంగుతిన్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయన్న దానిపై స్పష్టత రాలేదు. నిందితుడు వరుణ్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ‘వరుణ్‌బాబు నిధులు దారి మళ్లించినట్టు ఆదివారమే గుర్తించామని, పరిశీలిస్తున్నాం’ అని అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కె.వెంకటేశ్వర్లు తెలిపారు. నిధుల గోల్‌మాల్‌పై ఆడిట్ జరుగుతోందని గుంటూరు ఖజానా కార్యాలయం ఉపసంచాలకుడు కె.సురేంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు రూ.34 లక్షలు అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు అందలేదని, నిధులు దారిమళ్లినట్టు సమాచారం ఉందని వన్‌టౌన్ సీఐ బి.శ్రీనివాసరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement