మృగాడికి రక్షాకవచం..!? | tdp leader takes on city police due to case files on Rapeist | Sakshi
Sakshi News home page

మృగాడికి రక్షాకవచం..!?

Published Wed, Sep 28 2016 8:03 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

tdp leader takes on city police due to case files on Rapeist

మూడేళ్లుగా యువతిపై వేధింపులు
వీడియో తీసి బెదిరింపులు
పోలీసుల విచారణలో నిగ్గుతేలిన నిజం
మృగాడికి ఓ ప్రజాప్రతినిధి వత్తాసు
రాజకీయ ఒత్తిడితో చర్యలకు వెనకడుగు

 
బెజవాడ సైబర్ నేరాల అడ్డాగా మారుతూ బెంబేలెత్తిస్తోంది. యువతులపై అమానుషానికి పాల్పడుతూ చెలరేగిపోతున్న మృగాళ్లకు కూడా రాజకీయ రక్షాకవచం కల్పిస్తుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.  రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు గోప్యంగా ఉంచుతున్న ఓ మృగాడి విశృంఖలత్వం ఇది... మూడేళ్లుగా వేధింపులకు గురైన ఓ యువతి దయనీయ స్థితి ఇది.!
 
అమరావతి బ్యూరో : అతడు ఓ మృగాడు ..తన పేరు మార్చుకున్నాడు...ప్రేమించానన్నాడు...నమ్మిన యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు...అదంతా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు.
 
 ఏకంగా మూడేళ్లపాటు అకృత్యాలకు పాల్పడ్డాడు. లక్షలకు లక్షలు గుంజాడు. ఇక తాళలేక ఆ యువతి తల్లిదండ్రులకు చెబితే వీడియో లీక్‌చేసి అన్నంత పనీ చేశాడు..తల్లిదండ్రులు, బంధువులు వెళ్లి నిలదీస్తే ప్లేటు ఫిరాయిస్తూ వర్గ రాజకీయాల పాచిక వేశాడు. మా వాడిపై కేసు పెడతారా అని అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేశారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా తమవాడిని కాపాడేందుకు పైరవీలు ముమ్మరం చేస్తున్నారు.
 
 పేరుమార్చుకుని ఏమార్చాడు : అది 2013...పటమటలోని గణపతినగర్‌లోని ఓ యువతిపై అతడి కన్నుపడింది. తనపేరును రాజ శేఖర్‌గా మార్చుకుని ఆ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు.ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తరువాత ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మిం చాడు. 2013 సెప్టెంబ రులో తన పుట్టిన రోజు అని చెప్పి  ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహాలో లేని ఆమెను అసభ్యకరంగా వీడియో తీశాడు.
 
 తరువాత ఆ వీడియో చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరికలు తీర్చమని వేధించాడు.  ఓసారి రూ.10లక్షలు విలువైన ఆమె నగలను తీసుకుపోయాడు. ఏకంగా మూడేళ్లపాటు ఆ మృగాడి అకృత్యాలను ఆమె మౌనంగా రోధిస్తూ భరించింది. సైకోలా ప్రవరిస్తూ ఆమెను  శారీరకంగా తీవ్రచిత్రహింసలకు గురిచేశాడు. అదంతా కూడా వీడియో తీసేవాడు. ఇక అతడి అకృత్యాలను తట్టుకోలేక ఆమె జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పుకుని బోరుమంది. తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేని ఆమె తల్లిదండ్రులు ఆ మృగాడిని నిలదీస్తే ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి.
 
 నిగ్గుతేలిన దిగ్భ్రాంతికర నిజాలు : పోలీసుల విచారణలో మృగాడి అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగు చూశాయి. ఆ యువతిని ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. ఆమెను శారీరకంగా చిత్రహింసలకు గురి చేసినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సైకోలా మారి ఆమెను ఏ స్థాయిలో చిత్రహింసలకు గురిచేసిందీ తెలుసుకుని వైద్యులే నిర్ఘాంతపోయారు. సైబర్ చట్టం కింద కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె వీడియోలను కొన్ని సైట్లలో అతడు అప్‌లోడ్ చేశాడని నిర్ధారణ అయ్యింది.
 
కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధి ..
తాను చేసిన అకృత్యాలు బట్టబయలు కావడంతో ఆ మృగాడు వర్గ రాజకీయాలకు తెరతీశాడు. నగరంలో ఇటీవల అధికార పార్టీ పంచన చేరిన ఓ ప్రజాప్రతినిధి ఆ మృగాడికి అండగా నిలవడం విస్మయపరుస్తోంది. మావాడిపై కేసు పెట్టడానికి వీల్లేదంటూ ఆయన పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో పోలీసులు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ఇంకా అతడిపై చర్యలు తీసుకునేందుకు సందేహిస్తున్నారు.  చెప్పుకోలేని రీతిలో యువతిని శారీరకంగా వేధించి వీడియోలు తీసిన మృగాడిపై చర్యలు తీసుకోకుండాఅధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తుండడం దిగ్భ్రంతి కలిగిస్తోంది. రాజధాని విజయవాడలో యువతులకు రక్షణ లేదన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement