సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు.
బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా...
సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు.
మరికొందరు పోలీసులపైనా చర్యలు
ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్‌ఎస్సై గొల్ల నిరంజన్‌పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్‌స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు.
రిజర్వ్‌డ్ కేటగిరీలో ఇన్‌స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
(చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment