Kothwalguda
-
ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు. బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా... సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు పోలీసులపైనా చర్యలు ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రిజర్వ్డ్ కేటగిరీలో ఇన్స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు) -
బోనులో నైట్ సఫారీ!
సాక్షి, సిటీబ్యూరో: తొమ్మిది రకాల అడవులు..140 జాతుల జంతువులు..సింగపూర్ నైట్ సఫారీ పార్కునే మించేలా..ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేలా కొత్వాల్‌గూడలో 125 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయాలనకున్న నైట్ సఫారీ పార్కు ప్రాజెక్టు అటకెక్కినట్లు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. గతేడాది జూన్ 24న బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించి మరో రెండు నెలల్లో డిజైన్లు సమర్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఆసక్తి కనబరిచినా తదనంతర పరిస్థితుల్లో దీన్ని పట్టించుకునేవారే కరువవడంతో ఆ ఊసే లేకుండా పోయింది. అయితే ఇప్పటికైనా నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఇటు హెచ్ఎండీఏ, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో పాటు హిమాయత్‌సాగర్ ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు. నేపథ్యమిదే... సింగపూర్ నైట్ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్ లేదా ట్రాయ్ ట్రైన్ ద్వారా సందర్శకులు దాదాపు గంటపాటు జంతువులను రాత్రి సమయాల్లో చూసే వీలుకల్పించనున్నారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్య ప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అనుభూతిని కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులు తచ్చాడుతూ అటుఇటు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. సహజంగా ఏర్పడిందా అన్నట్టుగా సృష్టించే ఈ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దాదాపు 1200 జంతువులు తీసుకురావాలని నిర్ణయించారు.. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే జంతువులు నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు...ఇలా వివిధ రకాల జంతువులను తీసుకొస్తామని అధికారులు చెప్పారు. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడ ఏర్పాటుచేసే చిన్నచిన్న కుంటల్లో మొసళ్లు కూడా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే సింగపూర్ నైట్ సఫారీ పార్క్ ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు, బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్‌లు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు రెస్టారెంట్లు కూడా ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించారు. రాత్రి సమయాల్లో నైట్ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికైనా కదలిక వచ్చేనా... గతేడాది జూన్‌లో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు తెరపైకి వచ్చినా తదనంతర రాజకీయ పరిస్థితులతో ఆ అంశం కనుమరుగైంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగడంతో హెచ్ఎండీఏ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా మంచి ఆదాయం రావడంతో పాటు ప్రపంచస్థాయిలో పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. -
‘ఎనిమీ’తో ఆందోళన వద్దు
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులు తమ భూములకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్‌తో కలిసి ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే కృషి చేస్తుందన్నారు. బోగస్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన లావాదేవీలతో గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ ప్రజలకు అనుగుణంగానే అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అనవసర అపోహలకు గురై భూములను విక్రయించవద్దని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఇప్పటికి రెండు సార్లు సమీక్ష... ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిగాయని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని 1–174 సర్వే నెంబర్లలో మొత్తం 2700 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇందులో 286 ఎకరాల ప్రభుత్వ భూమి పోను, 685 ఎకరాల సీలింగ్ భూమి, 125 ఎకరాల భూదాన్ భూమి ఉందన్నా రు. మొత్తం 1621.12 ఎకరాల భూమిలో పట్టాదారులు, కౌలుదారులున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సేకరిస్తుందన్నారు. మార్చి నెలాఖరు వరకు ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు స్థానికులు ఎనిమీ ప్రాపర్టీ కారణంగా గ్రామస్తులు ఎదు ర్కొంటున్న సమస్యలను విన్న వించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
హైదరాబాద్ : ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. శంషాబాద్ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం బండ్లగూడకు చెందిన ప్రవీణ్(19) సోమవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి కొత్వాల్‌గూడ సమీపంలోని క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాని ప్రవీణ్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.