సాక్షి, సిటీబ్యూరో: తొమ్మిది రకాల అడవులు..140 జాతుల జంతువులు..సింగపూర్ నైట్ సఫారీ పార్కునే మించేలా..ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేలా కొత్వాల్‌గూడలో 125 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయాలనకున్న నైట్ సఫారీ పార్కు ప్రాజెక్టు అటకెక్కినట్లు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. గతేడాది జూన్ 24న బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించి మరో రెండు నెలల్లో డిజైన్లు సమర్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఆసక్తి కనబరిచినా తదనంతర పరిస్థితుల్లో దీన్ని పట్టించుకునేవారే కరువవడంతో ఆ ఊసే లేకుండా పోయింది. అయితే ఇప్పటికైనా నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఇటు హెచ్‌ఎండీఏ, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో పాటు హిమాయత్‌సాగర్ ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు.
నేపథ్యమిదే...
సింగపూర్ నైట్ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్ లేదా ట్రాయ్ ట్రైన్ ద్వారా సందర్శకులు దాదాపు గంటపాటు జంతువులను రాత్రి సమయాల్లో చూసే వీలుకల్పించనున్నారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్య ప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అనుభూతిని కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులు తచ్చాడుతూ అటుఇటు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. సహజంగా ఏర్పడిందా అన్నట్టుగా సృష్టించే ఈ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దాదాపు 1200 జంతువులు తీసుకురావాలని నిర్ణయించారు.. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే జంతువులు నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు...ఇలా వివిధ రకాల జంతువులను తీసుకొస్తామని అధికారులు చెప్పారు. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడ ఏర్పాటుచేసే చిన్నచిన్న కుంటల్లో మొసళ్లు కూడా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే సింగపూర్ నైట్ సఫారీ పార్క్ ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు, బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్‌లు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు రెస్టారెంట్‌లు కూడా ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించారు. రాత్రి సమయాల్లో నైట్ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.
ఇప్పటికైనా కదలిక వచ్చేనా...
గతేడాది జూన్‌లో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు తెరపైకి వచ్చినా తదనంతర రాజకీయ పరిస్థితులతో ఆ అంశం కనుమరుగైంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగడంతో హెచ్‌ఎండీఏ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా మంచి ఆదాయం రావడంతో పాటు ప్రపంచస్థాయిలో పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు వస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment