ఫిర్యాదు బాక్సులు ఎక్కడా? | complaint boxes ? | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు బాక్సులు ఎక్కడా?

Published Wed, Nov 20 2013 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

complaint boxes ?

 సాక్షి, ముంబై: నగర పౌరులు తమ సమస్యలపై ఫిర్యాదుచేయడానికి ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు అదృశ్యమౌతున్నాయి. నగర వాసులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. ఏర్పాటులో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఈ ప్రక్రియ ఆదిలోని విఫలమయింది. గత ఏడాది అక్టోబర్‌లో దాదాపు  వెయ్యికి పైగా ఫిర్యాదు బాక్సులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఇప్పుడు ఎక్కడోకాని కనిపించకపోవడంతో పోలీసులు ఈ బాక్సులను మందుబాబులు దొంగిలించి ఉంటారని ఆరోపిస్తున్నారు.
 హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్, ముంబై కమిషనరు డాక్టర్ సత్యపాల్‌సింగ్‌లు 2012 అక్టోబర్‌లో దాదర్‌లోని రవీంద్ర నాట్య మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫిర్యాదుల విధానాన్ని ప్రారంభించారు. పౌరులు ఎదుర్కొంటున్న శాంతిభద్రతల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడానికి సమాచార వారధిగా ఫిర్యాదు బాక్స్‌ల విధానం ప్రవేశపెట్టరు.   ఈ సందర్భంగా వెయ్యి ఫిర్యాదు పెట్టెలను 96 పోలీస్ స్టేషన్ల పరిధిలో అమరుస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే వీటి జాడ కనిపించకుండా పోయింది. సాధారణ ఫిర్యాదులే కాకుండా పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ ఫిర్యాదుల పెట్టెలను తెరిచే అధికారం స్థానిక అధికారులకు కాకుండా సీఐడీ విభాగానికి అప్పగించారు. ప్రారంభించిన రెండు నెలల తర్వాత సీఐడీ విభాగం అధికారులు ఈ బాక్సులు తెరచి ఫిర్యాదులు స్వీకరించడానికి సరియైన సిబ్బంది తమ వద్దలేరని చేతులెత్తాశారు. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకం పూర్తిగా మూలపడింది. కొద్ది రోజుల్లోనే ఎక్కడా ఫిర్యాదుల పెట్టె కనిపించని పరిస్థితి వచ్చింది.
 హిందుజా కాలేజీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నెల రోజులపాటు ఫిర్యాదుల పెట్టెను కాలేజీ ఆవరణలో చూశానన్నారు. కాలేజీ ఆవరణలో తరచూ వేధింపుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనీ, ముఖ్యంగా యువతులకు ఈ బాక్సు చాలా ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేరు తెలియజేయకుండా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండడంతో ఫిర్యాదుదారుడిని నియంత్రించడానికి కూడా అవకాశంలేని ఈ విధానం పోలీసు వర్గాల అవినీతిని తూర్పార బట్టే సాధనమయ్యేది. అందుకే దీన్ని నిర్వహించాల్సిన సీఐడీ విభాగం శ్రద్ధ చూపకుండా వదలిపెట్టిందని ఓ సమాజిక కార్యకర్త ఒకరు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement