complaint box
-
లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం
కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌తో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. హెచ్ఎంలకు అవగాహన బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్ లైన్ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్ హెల్ప్ లైన్ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్ హెల్ప్ లైన్ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి ప్రవర్తనలో ఆకస్మిక మార్పు ఇతరుల నుంచి దూరంగా ఉండటం శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు భయపడుతూ ఉండటం ఆహారం, నిద్రలో మార్పులు బాలికలకు బోధించాల్సినవి మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫోన్ చేయండి - కెఎల్ఎస్.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం. – డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు -
ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధికారే..
సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు. సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే.. ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. తిప్పిపంపిన కలెక్టర్ ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్‌క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్ విభాగం, కమర్షియల్ టాక్స్ వంటి శాఖల అధికారులను కలెక్టర్ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులకు ఫోన్ ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు. పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. -
ఇది పోలీసుల పోస్ట్ బాక్స్!
చిత్తూరు అర్బన్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ చిత్తూరు పోలీసు శాఖ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులు అరికట్టడానికి చర్చలు, పరిష్కారాలతో పాటు తామూ అండగా ఉన్నామనే భావన కల్పించడానికి పూనుకుంది. తపాల శాఖ పోస్టు బాక్స్ తరహాలో పోలీసుల ‘ఫిర్యాదుల పెట్టె’ (కంప్లైంట్ బాక్స్) ను ప్రారంభించింది. జిల్లాలో హైస్కూళ్లు, జూనియర్ కళాశాల స్థాయి నుంచి అన్ని కాలేజీల్లోనూ, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలోనూ వీటిని ఏర్పాటు చేస్తోంది. చిత్తూరులోని ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన చేతుల మీదుగా బుధవారం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే.. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు చాలా వరకు వేధింపులకు గురవుతుంటారు. కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, నివాస ప్రాంతాల్లో యువతులు పోకిరీల బారిన పడి ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెబితే పరిణామాలెలా ఉంటాయోననే భయం.. తమపేరు బయటకొస్తే పరువు పోతుంది.. స్టేషన్.. కోర్టు చుట్టూ తిరగలేమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు తామున్నామనే భరోసానిస్తూ చిత్తూరు పోలీసు శాఖ ఫిర్యాదుల పెట్టెను పరిచయం చేస్తోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెల్లకాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేస్తే పోలీసులు పరిష్కరిస్తారు. ఫిర్యాదు చేస్తున్నవారి పేరు, ఊరు, ఫోన్ నంబర్ కావాలంటే రాయొచ్చు..వివరాలు ఇవ్వకపోయినా పర్లేదు. ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు? ఫలానా ఫిర్యాదు చేయాలనే పరిమితి ఇక్కడ ఉండదు. వేధింపులు, ర్యాగింగ్, కాలనీల్లోని సమస్యలు, కళాశాలల్లో అధ్యాపకుల ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలు.. ఇలా ప్రతీ ఒక్క సమస్యను ఫిర్యాదు పెట్టెలో వేయొచ్చు. కళాశాలలతో పాటు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలకు అవసరమనుకుంటే ఆయా హెచ్ఎంలు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేస్తారు. అలాగే పోలీసు వాట్సప్ నంబరు : 9440900006 కు సైతం సమాచారం ఇస్తే చాలు. పోలీసులు ఏం చేస్తారు? పెట్టెలోని ఫిర్యాదులను శక్తి బృందాలు (షీ టీమ్ పోలీసులు) నేరుగా ఆయా డీఎస్పీలకు అందచేస్తారు. ఇందు కోసం జిల్లాలోని చిత్తూరు, పుత్తూ రు, పలమనేరు, మదనపల్లె, పీలేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో 70 మంది ప్రత్యేకంగా పోలీసులు పనిచేస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను డీఎస్పీలు పరిశీలించి.. వాటిని పరిష్కరిస్తారు. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా ఎస్పీ సైతం ఇందులో నేరుగా కల్పించుకుని సమస్య పరిష్కరిస్తారు. వేధింపులకు గురిచేస్తున్న నిందితులను అరెస్టు చే యడం, సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ఎదుట నిలబెట్టి శిక్షపడేలా చేస్తారు. జిల్లా స్థాయిలో దీన్ని ప్రతిరోజూ పర్యవేక్షించడానికి ఆపరేషన్స్ ఏఎస్పీ కృష్ణార్జునరావు నోడల్ అధికారిగా ఉంటా రు. వచ్చిన ఫిర్యాదులు.. తీసుకున్న చర్యలను రాతపూర్వకంగా రోజూ ఎస్పీకు తెలియచేస్తారు. మహిళలూ! ధైర్యంగా ముందుకురండి పోలీస్ స్టేషన్, పోలీసులంటే ప్రజల్లో ఉన్న అపవాదును తుడిచేయడానికి ఫిర్యాదుపెట్టె అనే కార్యక్రమానికి ప్రారంభించాం. ఫిర్యాదు చేసేవారి వివరాలు మాకు అవసరం లేదు. కాబట్టి ఇక మహిళలూ! ధైర్యంగా ముందుకురండి. మీ ఫిర్యాదులు మాకు చెప్పండి.. మేమున్నాం. మేం చూసుకుంటాం. అలాగే ప్రజలు సలహాలు మాకు చెప్పండి వాటిని స్వీకరిస్తాం. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ, చిత్తూరు -
'పెట్టె' ఫలితమివ్వలే!
గ్రామాల్లో జరిగే కొన్ని నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొందరు జంకుతారు. పోలీసులు ఎక్కడ తమ పేరు బయట పెడుతారోనన్న భయంతో చాలావరకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు. వీరికోసమే పోలీసులు వినూత్న రీతిలో ప్రతి పంచాయతీ వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో పోలీసులు చేపట్టిన ప్రయత్నంవిఫలమవుతోంది. అడ్డాకుల (దేవరకద్ర): మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల మండలాన్ని పోలీసుశాఖ మోడల్ మండలంగా ఎంపిక చేసింది. ఫిర్యాదుల పెట్టె పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2017 జనవరి 5న కందూర్‌లో ఫిర్యాదుల పెట్టెపెట్టెను మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పోలీసు అధికారి కార్యాలయం బయట ఓ ఫిర్యాదుల పెట్టెను అమర్చారు. ఫిర్యాదు రాసి పెట్టెలో వేస్తే.. పోలీసు శాఖకు సంబం«ధించిన ఏదైనా సమస్యను ఓ తెల్లకాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలి. రాసేవారు తమ పేరును రాయాల్సిన పనిలేదు. అయితే ప్రతి సోమ, గురువారాల్లో నిర్వహించే గ్రామ పోలీసు కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చే పోలీసు అధికారి డబ్బాలో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అడ్డాకుల మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ఫలితమిస్తే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావించారు. ఎలాంటి స్పందనా రాలే! ప్రతి గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ప్రత్యే కంగా ఫి ర్యాదు పెట్టెను ఏర్పాటు చేశారు. వాటి వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేశారు. ప్ర తి సోమ, గురువారాల్లో పోలీసు అధికారులు తమ కార్యాలయాలకు వచ్చినప్పుడు ఫిర్యాదుల పెట్టె తాళం తీసి అందులో ఉన్న సమస్యల తెలుసుకుం టారు. దాన్ని పరిష్కరించేందుకు చర్యతీసుకుంటారు. ఈవ్ టీజింగ్, పేకాట, ఇసుక అక్రమ రవాణా, మత్తు మం దుల విక్రయాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చని ప్రచారం చేశారు. అయినా ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు. చిన్న తగాదాలను పోలీసు అధికారుల దృష్టికి తేవాలని సూచించినా పెద్దగా స్పందన రాలేదు. ప్రజలు ముందుకు రావాలి ఫిర్యాదుల పెట్టె ప్రయోగాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టినా ప్రజల నుంచి స్పందన రావడంలేదు. గ్రామాల్లో జరిగే నేరపూరిత చర్యలపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నా ప్రజలు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోలేదు. మరోసారి దీన్ని చేపట్టే అంశం ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. – ఎం.బాలస్వామి, ఏఎస్ఐ అడ్డాకుల -
అవినీతి అధికారులతో సిగ్గు సిగ్గు
► ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు చర్యలు ► ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సీతమ్మధార: ‘ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని వస్తే నా నియోజకవర్గంలో అవినీతి అధికారులతో సిగ్గేస్తోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అవినీతి పెరిగిపోయిందని, రాజకీయాలకు ఎందుకు వచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నానని అన్నారు. నీతి నిజాయితీ, మంచితనంతో నియోజకవర్గంలో పనిచేస్తున్నానని, అలాంటిది తన నియోజకవర్గంలో నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కాడం చూస్తే ఎంతగా అవినీతి పెరిగిపోయిందో చూస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఉత్తమ అధికారులను నియమించాలని సీఎం, హోం శాఖ మంత్రి, సీపీలను కోరారు. తాను ఇంత వరకు ఏ ఒక్క అధికారిని బదిలీ చేయాలని ఎవరినీ కోరలేదన్నారు. భీమిలి, పరవాడ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ కార్యాలయంలో త్వరలో ఫిర్యాదులు బాక్స్‌ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. లంచగోండి అధికారులపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించాలని ఆయన కోరారు. -
వేధిస్తే ఫిర్యాధు చేయాలిలా
పింప్రి, న్యూస్‌లైన్ : విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేసే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలల సమితి, పోలీసులు సంయుక్తంగా ఫిర్యాదుల బాక్స్‌లను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 4 పోలీస్ జోన్లు 8 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులను లైంగికంగా వేధించడం, మభ్యపెట్టడం లాంటి విషయాల సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తు న్నారు. ఆయా పాఠశాలల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బాక్సులల్లో ఫిర్యాదులు వేయాలని సూచిం చారు. పోలీసులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. సామాజిక సంస్థల స్ఫూర్తి.. 2005 జనవరిలో యరవాడా పోలీస్ స్టేషన్, సమాజ్ సేవకులు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చి నగరంలో బాలికలపై అత్యాచారాలను అరికట్టడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వివిధ పాఠశాలలకు వెళ్లి మార్గదర్శనం, పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసింది. ఈ క్రమంలో పాఠశాలల్లో ఆడపిల్లలపై విచక్షణ, వేధింపులు తగ్గడాన్ని గమనించి అదే ఫార్ములాను నగరంలోని 4 పోలీస్ జోన్ల పరిధిలోని పాఠశాలల్లో అమలు చేయడానికి పోలీస్ డిప్యూటీ కమిషనర్ మనోజ్ పాటిల్ కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ప్రతి హైస్కూలులో ఈ ఫిర్యాదు బాక్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో గల 21 పాఠశాలల్లో బాక్స్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్రతి బాక్స్‌పై ఫోన్ నంబర్ ఉంటుంది. బాక్స్లల్లోని ఫిర్యాదులను చూసే బాధ్యతను వారానికో పోలీసు అధికారికి అప్పగించారు. ఈ బాక్స్‌లపై పాఠశాల సిబ్బంది పెత్తనం నిర్వహించడానికి వీలు కాదు. విద్యార్థినులు తమపై ఎవరైనా వెకిలి చేష్టలు, వేధించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఫిర్యాదుల బాక్స్‌లను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
ఫిర్యాదు బాక్సులు ఎక్కడా?
సాక్షి, ముంబై: నగర పౌరులు తమ సమస్యలపై ఫిర్యాదుచేయడానికి ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు అదృశ్యమౌతున్నాయి. నగర వాసులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. ఏర్పాటులో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఈ ప్రక్రియ ఆదిలోని విఫలమయింది. గత ఏడాది అక్టోబర్‌లో దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదు బాక్సులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఇప్పుడు ఎక్కడోకాని కనిపించకపోవడంతో పోలీసులు ఈ బాక్సులను మందుబాబులు దొంగిలించి ఉంటారని ఆరోపిస్తున్నారు. హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, ముంబై కమిషనరు డాక్టర్ సత్యపాల్సింగ్లు 2012 అక్టోబర్‌లో దాదర్‌లోని రవీంద్ర నాట్య మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫిర్యాదుల విధానాన్ని ప్రారంభించారు. పౌరులు ఎదుర్కొంటున్న శాంతిభద్రతల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడానికి సమాచార వారధిగా ఫిర్యాదు బాక్స్‌ల విధానం ప్రవేశపెట్టరు. ఈ సందర్భంగా వెయ్యి ఫిర్యాదు పెట్టెలను 96 పోలీస్ స్టేషన్ల పరిధిలో అమరుస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే వీటి జాడ కనిపించకుండా పోయింది. సాధారణ ఫిర్యాదులే కాకుండా పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ ఫిర్యాదుల పెట్టెలను తెరిచే అధికారం స్థానిక అధికారులకు కాకుండా సీఐడీ విభాగానికి అప్పగించారు. ప్రారంభించిన రెండు నెలల తర్వాత సీఐడీ విభాగం అధికారులు ఈ బాక్సులు తెరచి ఫిర్యాదులు స్వీకరించడానికి సరియైన సిబ్బంది తమ వద్దలేరని చేతులెత్తాశారు. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకం పూర్తిగా మూలపడింది. కొద్ది రోజుల్లోనే ఎక్కడా ఫిర్యాదుల పెట్టె కనిపించని పరిస్థితి వచ్చింది. హిందుజా కాలేజీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నెల రోజులపాటు ఫిర్యాదుల పెట్టెను కాలేజీ ఆవరణలో చూశానన్నారు. కాలేజీ ఆవరణలో తరచూ వేధింపుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనీ, ముఖ్యంగా యువతులకు ఈ బాక్సు చాలా ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేరు తెలియజేయకుండా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండడంతో ఫిర్యాదుదారుడిని నియంత్రించడానికి కూడా అవకాశంలేని ఈ విధానం పోలీసు వర్గాల అవినీతిని తూర్పార బట్టే సాధనమయ్యేది. అందుకే దీన్ని నిర్వహించాల్సిన సీఐడీ విభాగం శ్రద్ధ చూపకుండా వదలిపెట్టిందని ఓ సమాజిక కార్యకర్త ఒకరు విమర్శించారు.