చిత్తూరులో ఫిర్యాదుల పెట్టె ప్రారంభిస్తున్న ఎస్పీ, ఏఎస్పీ తదితరులు
చిత్తూరు అర్బన్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ చిత్తూరు పోలీసు శాఖ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులు అరికట్టడానికి చర్చలు, పరిష్కారాలతో పాటు తామూ అండగా ఉన్నామనే భావన కల్పించడానికి పూనుకుంది. తపాల శాఖ పోస్టు బాక్స్ తరహాలో పోలీసుల ‘ఫిర్యాదుల పెట్టె’ (కంప్లైంట్ బాక్స్) ను ప్రారంభించింది. జిల్లాలో హైస్కూళ్లు, జూనియర్ కళాశాల స్థాయి నుంచి అన్ని కాలేజీల్లోనూ, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలోనూ వీటిని ఏర్పాటు చేస్తోంది. చిత్తూరులోని ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన చేతుల మీదుగా బుధవారం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎందుకంటే..
టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు చాలా వరకు వేధింపులకు గురవుతుంటారు. కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, నివాస ప్రాంతాల్లో యువతులు పోకిరీల బారిన పడి ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెబితే పరిణామాలెలా ఉంటాయోననే భయం.. తమపేరు బయటకొస్తే పరువు పోతుంది.. స్టేషన్.. కోర్టు చుట్టూ తిరగలేమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు తామున్నామనే భరోసానిస్తూ చిత్తూరు పోలీసు శాఖ ఫిర్యాదుల పెట్టెను పరిచయం చేస్తోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెల్లకాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేస్తే పోలీసులు పరిష్కరిస్తారు. ఫిర్యాదు చేస్తున్నవారి పేరు, ఊరు, ఫోన్ నంబర్ కావాలంటే రాయొచ్చు..వివరాలు ఇవ్వకపోయినా పర్లేదు.
ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు?
ఫలానా ఫిర్యాదు చేయాలనే పరిమితి ఇక్కడ ఉండదు. వేధింపులు, ర్యాగింగ్, కాలనీల్లోని సమస్యలు, కళాశాలల్లో అధ్యాపకుల ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలు.. ఇలా ప్రతీ ఒక్క సమస్యను ఫిర్యాదు పెట్టెలో వేయొచ్చు. కళాశాలలతో పాటు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలకు అవసరమనుకుంటే ఆయా హెచ్‌ఎంలు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేస్తారు. అలాగే పోలీసు వాట్సప్ నంబరు : 9440900006 కు సైతం సమాచారం ఇస్తే చాలు.
పోలీసులు ఏం చేస్తారు?
పెట్టెలోని ఫిర్యాదులను శక్తి బృందాలు (షీ టీమ్ పోలీసులు) నేరుగా ఆయా డీఎస్పీలకు అందచేస్తారు. ఇందు కోసం జిల్లాలోని చిత్తూరు, పుత్తూ రు, పలమనేరు, మదనపల్లె, పీలేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో 70 మంది ప్రత్యేకంగా పోలీసులు పనిచేస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను డీఎస్పీలు పరిశీలించి.. వాటిని పరిష్కరిస్తారు. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా ఎస్పీ సైతం ఇందులో నేరుగా కల్పించుకుని సమస్య పరిష్కరిస్తారు. వేధింపులకు గురిచేస్తున్న నిందితులను అరెస్టు చే యడం, సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ఎదుట నిలబెట్టి శిక్షపడేలా చేస్తారు. జిల్లా స్థాయిలో దీన్ని ప్రతిరోజూ పర్యవేక్షించడానికి ఆపరేషన్స్ ఏఎస్పీ కృష్ణార్జునరావు నోడల్ అధికారిగా ఉంటా రు. వచ్చిన ఫిర్యాదులు.. తీసుకున్న చర్యలను రాతపూర్వకంగా రోజూ ఎస్పీకు తెలియచేస్తారు.
మహిళలూ! ధైర్యంగా ముందుకురండి
పోలీస్ స్టేషన్, పోలీసులంటే ప్రజల్లో ఉన్న అపవాదును తుడిచేయడానికి ఫిర్యాదుపెట్టె అనే కార్యక్రమానికి ప్రారంభించాం. ఫిర్యాదు చేసేవారి వివరాలు మాకు అవసరం లేదు. కాబట్టి ఇక మహిళలూ! ధైర్యంగా ముందుకురండి. మీ ఫిర్యాదులు మాకు చెప్పండి.. మేమున్నాం. మేం చూసుకుంటాం. అలాగే ప్రజలు సలహాలు మాకు చెప్పండి వాటిని స్వీకరిస్తాం. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment