కోర్టు వివాదంలో ఉన్న భూ యాజమాన్య హక్కుల మార్పు
అభ్యంతరాలు బేఖాతరు చేసి మ్యుటేషన్!
శాంతిపురం: వివాదంలోని భూమిపై రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై పెట్రోల్ చల్లి, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం చోటుచేసుకుంది. శాంతిపురం మండలంలోని 30 సొన్నేగానిపల్లి పంచాయతీ పరిధిలోని నాయనపల్లికి చెందిన లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపతి తల్లి లక్ష్మమ్మ కర్ణాటకలోని రాజుపేట రోడ్డులో ఓ బట్టల దుకాణం యజమాని ఇంట్లో పనిచేసేది. లక్ష్మమ్మ 2019లో మరణించాక దుకాణం యజమాని సుమమ్మ తాను మృతురాలి నుంచి 2002లో భూమిని కొనుగోలు చేశానని కుప్పం కోర్టును ఆశ్రయించింది.
అనువంశిక ఆస్తిని తన తల్లి ఒక్కరే విక్రయించే హక్కు లేదని, చదువులేని తన తల్లిని మోసం చేశారని లక్ష్మీపతి సైతం కోర్టుకు వెళ్లాడు. ఈ కేసు కుప్పం కోర్టులో విచారణలో ఉంది. అయితే కుప్పం–పలమనేరు జాతీయ రహదారి పక్కనే ఉన్న 0.79 ఎకరాల వివాదాస్పద భూమి విలువ రూ.2 కోట్లకు పైగా ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల్లో యజమాని పేరు మార్పునకు ద్రస్తాలు కదిలాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీపతి శుక్రవారం సాయంత్రం తహశీల్దారు శివయ్యకు తన గోడు వినిపించే ప్రయత్నం చేశాడు. పట్టించుకోని తహశీల్దారు తనను బయటకు గెంటించారని తెలిపాడు.
దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీపతి శనివారం తన కుటుంబ సభ్యులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో డీటీ పౌలే‹Ùని కలిసి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు హేళన చేశాడు. ఎంతకీ తహశీల్దారు రాకపోవడం, ఇతర అధికారులు పట్టించుకోకపోవటంతో లక్ష్మీపతి తన వంటిపై పెట్రోల్ పోసుకుని, కుటుంబ సభ్యులపైనా చల్లే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించి వారు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను అతని నుంచి లాక్కుని నీళ్లు పోశారు. కలెక్టర్, కుప్పం ఆర్డీవో ఆదేశాల మేరకు సదరు భూమిని రెవెన్యూ రికార్డుల్లో వివాదాస్పద భూమిగా నమోదు చేస్తామని తహశీల్దారు చెప్పారు. తాను రికార్డుల ప్రకారమే మ్యుటేషన్ చేశానని, భూమి కొనుగోలు పత్రం, ఈసీలను క్షుణ్ణంగా చూశాకే యజమాని పేరు మార్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment