బరువు కాదు.. బాధ్యత
♦ హెల్మెట్ వినియోగం తప్పనిసరి
♦ యువత బాధ్యతతో మెలగాలి
♦ ‘సాక్షి’ అవగాహన సదస్సులో డీటీసీ బసిరెడ్డి, కేఎస్‌ఎన్ రెడ్డి
‘సెల్ ఫోన్ స్క్రీన్‌పై చిన్న గీత పడకూడదని స్క్రీన్ గార్డు.. కిందపడితే ఎక్కడ చెడిపోతుందోనని ప్లిప్ కవర్ వేయించుకోవడంపై నేటి యువత ఎంతో శ్రద్ధ చూపుతోంది. బైక్‌పై వెళ్తున్నప్పుడు కిందపడితే శరీరంలో ప్రధాన భాగమైన తలకు దెబ్బ తగిలితే పరిస్థితి ఏమిటన్న దానిపై ఇసుమంత జాగ్రత్త తీసుకోవడం లేదు. ప్రాణం కంటే సెల్ ఫోన్ విలువైందా..? పిల్లలు ప్రయోజకులై పేరు తెస్తారని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు.. అడిగిందల్లా కాదనకుండా అప్పు చేసైనా కొనిస్తారు. అలాంటి వారి ఆశలపై నీళ్లు చ ల్లి కడుపు కోత మిగల్చ కూడదు. బైక్‌లపై వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురై వృుతి చెందిన వారిలో అత్యధికులు విద్యార్థులు కావడం ఆందోళన కలిగిస్తోంది. కన్నవారి కలలను నిజం చేయడం కోసమైనా బైక్‌పై వెళ్తున్నప్పుడు భారంగా కాక బాధ్యతగా భావించి హెల్మెట్ పెట్టుకోవాలి’ అని కడప నగర శివారులోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు.
వైవీయూ/ఎడ్యుకేషన్ :రహదారి భద్రత, వ్యక్తిగత భద్రత అన్నవి మనందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని కందుల గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘రహదారి భద్రత - హెల్మెట్ వినియోగం’ అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. బసిరెడ్డి విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే సెల్‌ఫోన్‌కు గీతలు పడకుండా స్క్రీన్‌గార్డ్ వేయించుకుంటారని, ఎంతో విలువైన తలకు హెల్మెట్ ధరించడానికి ఎందుకు ఆలోచిస్తారని ప్రశ్నించారు.
జిల్లా వ్యాప్తంగా గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 943 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 336 మంది చనిపోయారన్నారు. ఇందులో 256 ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటుచేసుకోగా 80 మంది మరణించారన్నారు. వీరిలో అధికశాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలనే తలకు గాయం కావడం ద్వారా మరణించారన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల పిల్లలు సైతం బైక్‌రైడింగ్‌లో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. విద్యార్థులకు చదువుకునే రోజుల్లో వాహనాలపై మోజు ఉంటుందని అయితే ఆ మోజులో ప్రాణాలను ఫణంగా పెట్టే విన్యాసాలు తగవని పేర్కొన్నారు. అటువంటి విన్యాసాల ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే మీ తల్లిదండ్రుల పడే ఆవేదనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
18 సంవత్సరాలలోపు వారు ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకూడదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు నేరుగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో పాటు పరీక్షకు హాజరై లెసైన్స్‌లు పొందాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగసాధనలో సఫలం కావాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమానికి సాక్షి బ్యూరో ఇన్‌చార్జి ఎం.బాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా. సాక్షి బ్రాంచ్ మేనేజర్ సుప్రియ, ఎడిషన్ ఇన్‌చార్జి రంగాచార్యులు, కేఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. వి.ఎస్.ఎస్. మూర్తి, ఖాజాపీర్‌లు ప్రసంగించారు. అంతకు ముందు రవాణ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లు, రహదారి భద్రతపై రూపొందించిన గీతాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ బి.వి. నాగిరెడ్డి, కళాశాల పీడీ నారాయణ, ప్రకాష్‌రెడ్డి, ఆర్‌టీఓ కార్యాలయ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.