వినాయకుడికి హెల్మెట్ ఉంది.. మనకొద్దా..
న్యూఢిల్లీ: రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం దేవుళ్లతో ఓ కొత్త త్రీడీ వీడియోను రూపొందించి యూట్యూబ్లో ఉంచింది. ఇప్పుడా ప్రచార చిత్రం విరివిగా ప్రజలను ఆకర్షిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు అజాగ్రత్తలో వ్యవహరించడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలకు లోనవుతూ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుందని 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
తాను రూపొందించిన ప్రచార చిత్రంలోభాగంగా 'దేవుళ్లు మన రక్షకులు.. అనుక్షణం మనల్ని కాపాడుతూ వెన్నంటి ఉండేవారు.. సర్వశక్తిమంతులు. అలాంటి దేవుళ్లే రోడ్డు భద్రత పాటిస్తుంటే మనమెందుకు పాటించకూడదు' అని ఈ వీడియో ద్వారా 'ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్' ప్రశ్నించింది. ఈ వీడియోలో దుర్గామాత, వినాయకుడు, విష్ణుమూర్తి.. సింహం, ఎలుక, గరుడను అదిరోహిస్తూ ప్రయాణం ప్రారంభిస్తూ ఒక్కసారిగా ఆగి తమ కిరీటాలను ధరిస్తారు. దీనిద్వారా దేవుళ్లే బయటికెళ్లేటప్పుడు కిరీటాలు లేకుండా వెళ్లేవారు కాదని, అవి తమ తలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా ఉంటాయని సూచిస్తూ మనుషులైన మనం తప్పకుండా హెల్మెట్ ధరించకూడదా అని అందులో ఉంది.