దేశంలో రోజూ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహనా రాహిత్యమే దీనికి ప్రధాన కారణని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశంలో రోజూ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహనా రాహిత్యమే దీనికి ప్రధాన కారణని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
స్టార్ల ప్రచారం
రెండు ప్రముఖ కంపెనీలు గురువారం నగరంలో చేపట్టిన రోడ్డు భద్రత ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రభృతులు పాల్గొన్నారు. రోడ్లను సురక్షిత మార్గాలుగా మార్చడం, నివారించదగ్గ ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశాలు. ఇందులో భాగంగా పౌరులను ప్రోత్సహించడం, ముఖ్యంగా యువతపై దృష్టి సారించి వాహనాలను నడిపే సమయంలో వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూడడం... లాంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అవగాహన లేమితో...
ఈ సందర్భంగా కరిష్మా కపూర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు భద్రత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎన్నో వేల ప్రాణాలను కాపాడగలిగిన వారమవుతామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆహూతులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయబోమంటూ ప్రమాణం చేశారు.