బుమ్రా సరికొత్త చరిత్ర.. కుంబ్లే రికార్డు బ్రేక్‌ | Ind vs Aus 4th Test: Bumrah Breaks Anil Kumble MCG Record Becomes | Sakshi
Sakshi News home page

బుమ్రా సరికొత్త చరిత్ర.. కుంబ్లే రికార్డు బ్రేక్‌

Published Thu, Dec 26 2024 2:48 PM | Last Updated on Thu, Dec 26 2024 4:10 PM

Ind vs Aus 4th Test: Bumrah Breaks Anil Kumble MCG Record Becomes

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన కంగారూలను కట్టడి చేశాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో భారత్‌ విజయం సాధించగా.. అడిలైడ్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆసీస్‌ గెలుపొందింది. ఇక బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల ‘డ్రా’ కావడంతో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

టాపార్డర్‌ హిట్‌
ఈ నేపథ్యంలో ఎంసీజీ వేదికగా గురువారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. టాపార్డర్‌ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఓపెనర్లు సామ్‌ కొన్‌స్టాస్‌(60), ఉస్మాన్‌ ఖవాజా(57).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌(72) అర్ధ శతకాలతో మెరిశారు.

బుమ్రా మ్యాజిక్‌ వల్ల
మిడిలార్డర్‌లో స్టీవ్‌ స్మిత్‌(68 నాటౌట్‌) కూడా హాఫ్‌ సెంచరీ చేయడంతో ఆసీస్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, డేంజరస్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌(0), ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌(4)లను బుమ్రా త్వరత్వరగా పెవిలియన్‌కు పంపడంతో కనీసం తొలి రోజు ఆఖరి సెషన్‌లోనైనా భారత జట్టుకు కాస్త ఊరట దక్కింది. వీరిద్దరితో పాటు ఉస్మాన్‌ ఖవాజా వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మెల్‌బోర్న్‌ టెస్టులో మొదటి రోజు ఆట సందర్భంగా మొత్తంగా మూడు వికెట్లు తీసిన బుమ్రా.. ఎంసీజీలో భారత్‌ తరఫున  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ప్రసిద్ధ మైదానంలో బుమ్రా మూడు మ్యాచ్‌లు(ఐదు ఇన్నింగ్స్‌) ఆడి మొత్తంగా 18 వికెట్లు తీశాడు. అంతకు ముందు అనిల్‌ కుంబ్లే మూడు మ్యాచ్‌లు(ఆరు ఇన్నింగ్స్‌) ఆడి పదిహేను వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మెల్‌బోర్న్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు
1. జస్‌ప్రీత్‌ బుమ్రా(పేసర్‌)- మూడు మ్యాచ్‌లు- ఐదు ఇన్నింగ్స్‌- 18 వికెట్లు
2. అనిల్‌ కుంబ్లే(స్పిన్నర్‌)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్‌- 15 వికెట్లు
3. రవిచంద్రన్‌ అశ్విన్‌(స్పిన్నర్‌)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్‌- 14 వికెట్లు
4. కపిల్‌ దేవ్‌(పేసర్‌)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్‌- 14 వికెట్లు
5. ఉమేశ్‌ యాదవ్‌(పేసర్‌)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్‌- 13 వికెట్లు

తొలిరోజు ఆసీస్‌దే
బాక్సింగ్‌ డే టెస్టు((Boxing Day Test))లో గురువారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, ఆకాశ్‌ దీప్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్‌ కోహ్లికి ఐసీసీ భారీ షాక్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement