టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం(Virat Kohli- Sam Konstas Altercation)పై ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ స్పందించాడు. ఆటలో ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు. అయితే, భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లే తామిద్దరం అలా గొడవపడ్డామని తెలిపాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.
అరంగేట్రంలోనే అదుర్స్
ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్‌బోర్న్‌లో గురువారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్ సందర్భంగా 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దూకుడైన ఆటతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను సామ్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టీ20 తరహాలో దంచికొట్టిన సామ్ కొన్‌స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీలు బాది పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే, సామ్ కొన్‌స్టాస్ ఏకాగ్రతను దెబ్బతీసే క్రమంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దూకుడు మీదున్న సామ్‌కు భుజాలు తాకిస్తూ కోహ్లి కాస్త దుందుడుకుగా ప్రవర్తించినట్లు కనిపించింది. సామ్ కూడా అతడికి అంతే గట్టిగా బదులివ్వగా వాగ్వాదం జరిగింది. ఇంతలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతపరిచారు.
కోహ్లికి ఐసీసీ షాక్
ఇక ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విరాట్ కోహ్లికి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత విధించింది. ఇదిలా ఉంటే.. తన అభిమాన క్రికెటర్‌తో గొడవపై సామ్ కొన్‌స్టాస్ స్పందించిన తీరు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది.
నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నా
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తాను అవుటైన తర్వాత.. కోహ్లితో గొడవ గురించి సామ్ కొన్‌స్టాస్ మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో మేమిద్దరం భావోద్వేగంలో మునిగిపోయి ఉన్నామేమో!.. అప్పుడు నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నా. ఆ సమయంలో అతడు వస్తున్నట్లు గమనించలేకపోయా. అయినా క్రికెట్‌లో ఇవన్నీ సహజమే’’ అని 7క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా కోహ్లి తన అభిమాన క్రికెటర్ అని సామ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్
అదే విధంగా తన ప్రణాళికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్. అయితే, అతడిపై ఒత్తిడి పెంచగలిగితేనే నేను పైచేయి సాధించగలనని తెలుసు. అందుకే దూకుడుగా ఆడుతూ.. అతడిని డిఫెన్స్‌లో పడేలా చేశాను. నిజానికి మ్యాచ్‌కు ముందు నేనేమీ ప్రత్యేక ప్రణాళికలు రచించుకోలేదు’’ అని సామ్ కొన్‌స్టాస్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 311 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.
చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
The man of the moment 👊
Sam Konstas chats with @copes9 about his first Test innings...
And everything else that happened during it as well #AUSvIND pic.twitter.com/v7hhwMWgtB— 7Cricket (@7Cricket) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment