పాపం జైస్వాల్‌.. కోహ్లి క్షమాపణ చెప్పాలి!.. తప్పు ఎవరిది? | Jaiswal Horrible Run Out Mix Up with Kohli Collapse In Minutes Fans Reacts | Sakshi
Sakshi News home page

పాపం జైస్వాల్‌.. కోహ్లి క్షమాపణ చెప్పాలి!.. తప్పు ఎవరిది?

Published Fri, Dec 27 2024 3:02 PM | Last Updated on Fri, Dec 27 2024 4:18 PM

Jaiswal Horrible Run Out Mix Up with Kohli Collapse In Minutes Fans Reacts

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. స్వీయ తప్పిదం కారణంగా రనౌట్‌(#Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. అయితే, కొంత మంది మాత్రం జైస్వాల్‌ పెవిలియన్‌ చేరడానికి విరాట్‌ కోహ్లి(#Virat Kohli)నే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆసీస్‌ భారీ స్కోరు
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ముగియగా.. 1-1తో సమంగా ఉన్న ఇరుజట్ల మధ్య.. గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్‌ దీప్‌ రెండు, వాషింగ్టన్‌ సుందర్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన భారత్‌కు శుభారంభం లభించినా.. ఆఖర్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.

రోహిత్‌ మరోసారి విఫలం
కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma Fails Again- 3) మరోసారి నిరాశపరచగా.. మూడో స్థానంలో వచ్చిన కేఎల్‌ రాహుల్(24) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(82), విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జైస్వాల్‌ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.

పరుగు కోసం యత్నించిన జైస్వాల్‌
టీమిండియా ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌లో ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ బంతితో బరిలోకి దిగగా.. ఆఖరి బంతికి జైస్వాల్‌ మిడాన్‌దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్‌ సరిగ్గా కనెక్ట్‌ కాలేదు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి.. ఫీల్డర్ల వైపు చూస్తూ ఉండగా.. అప్పటికే జైస్వాల్‌ క్రీజును వీడాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌వైపు దూసుకురాగా.. అప్పటికి కోహ్లి కూడా తన ప్లేస్‌లోకి తిరిగి వచ్చేశాడు.

జైస్వాల్‌ రనౌట్‌.. శతక భాగస్వామ్యానికి తెర
అప్పటికి బంతిని అందుకున్న ఫీల్డర్‌ కమిన్స్‌ స్టంప్స్‌ వైపు బంతిని విసరగా.. మిస్‌ అయింది. అయితే, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేయడంతో జైస్వాల్‌ రనౌటయ్యాడు. ఫలితంగా జైస్వాల్‌- కోహ్లి శతక భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించారు.

అంతా తలకిందులు
అయితే, జైస్వాల్‌ అవుటైన కాసేపటికే కోహ్లి కూడా పెవిలియన్‌ చేరాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్‌ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ కమిన్స్‌ రెండు, స్కాట్‌ బోలాండ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

కాగా జైస్వాల్‌కు రనౌట్‌కు కోహ్లినే కారణమని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మండిపడ్డాడు. యువ బ్యాటర్‌కు కోహ్లి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించాడు. అయితే, టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాత్రం.. రనౌట్‌ విషయంలో జైస్వాల్‌దే తప్పని.. అందుకు కోహ్లిని నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

చదవండి: IND Vs AUS 4th Test: ‘జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement